మారిన మానవుడు

మారిన మానవుడు

అనాదిగా మానవుడు సంఘజీవి. ఒక తీయని పలకరింపుతో పులకరించిపోతాడు. స్నేహం కోసం ప్రాణాలు అర్పిస్తాడు. విద్యార్థి దశలో మొదలైన స్నేహం కడదాకా కొనసాగుతుంది. ఎవరైనా కోరితే సహాయం వెంటనే చేసేవాడు. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడే వాడు కాదు. మన సంస్కృతి అటువంటిది. మన చరిత్ర అటువంటిది. కర్ణుడు శిబి చక్రవర్తి లాంటి వారు మనకు ఆదర్శం. సంతర్పణలు పూజలు పునస్కారాలు అంటూ పదిమంది ఒకచోట చేరేవారు. కష్టo సుఖం మాట్లాడుకునేవారు. పుణ్య దినాలలో అరుగుల మీద కూర్చుని భజనలతో కాలక్షేపం చేసేవారు. రచ్చబండల దగ్గర పిచ్చా పాటీ మాట్లాడుకునేవారు. అలా మనిషికి మనిషికి ఒక అనుబంధం ఉండేది. ఆప్యాయంగా పలకరించుకునేవారు. మనసు విప్పి మాట్లాడుకునేవారు. మమత పంచుకునేవారు. బంధుత్వాలుపెంచుకునేవారుకష్టసుఖాల్లోపాలుపంచుకునేవారు కానీకాలంమారిందిమనిషిలోమార్పులుచోటుచేసుకున్నాయి.మనిషి ఒంటరివాడైపోతున్నాడు .మనిషి తన చుట్టూ తాను గిరి గీసుకొని బతుకుతున్నాడు. యువతరం అయితే మరీను. ఎవరైనా పలకరిస్తే తప్ప మాట్లాడరు. పక్కనున్న వ్యక్తి గురించి పట్టించుకోరు. ఎదురింటిలో ఎవరు ఉంటున్నారో తెలియదు. ఎంతసేపు ఒకే లోకం. ఆ లోకంలోనే మనిషి మాలోకంలా తయారవుతున్నాడు. ఎదుటివారి గురించి మనకెందుకులే అనే ఆలోచనలో ఉన్నది యువతరం. 

మానవుడు సంఘజీవనే నిర్వచనం మారిపోతుంది 
అది పెంపకం లోపం కాదు . పరిస్థితుల ప్రభావం. మారుతున్న జీవనశైలి . సాంకేతికంగా అభివృద్ధి సాధించిన మనిషి సంఘం నుంచి విడిపోతున్నాడు. యువతరానికి మొహమాటం ఎక్కువ. అవసరమైనప్పుడు సహాయం అడగడానికి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇలా బాధపడుతోంది నవతరం.

ఇవన్నీ ఆలోచిస్తే దీనికి వెనుక బలమైన ఆర్థిక సామాజిక సాంకేతిక కారణాలు మనకు కనిపిస్తాయి. పూర్వం పెద్దపెద్ద మండువా లోగిళ్ళలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చిన్నపిల్లల బాల్యం అనుబంధాలతో పెరిగేది బంధుత్వాలు తెలిసేవి. పెద్దలు కూడా చెప్పేవారు. గ్రామాల్లో జరిగే పండగలు ఉత్సవాలు భజన కార్యక్రమాల్లో అందరూ పాలుపంచుకునేవారు
అలా సమాజం తోటి అనుబంధం పిల్లలకు కలిగేది. మర్యాదలు తెలిసేవి . పెద్దలు యెడ గౌరవం ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చినమైపోయి ఎవరికి వారు పొట్ట చేత పట్టుకుని నగరాలు చేరి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో కాపురం చేస్తూ భార్యాభర్త ఉద్యోగాలు చేస్తూ పిల్లలకి సమాజం గురించి చెప్పే తీరిక, సమయం లేక పిల్లలు ఆ వాతావరణం లో పెరిగితే ఎలా తయారవుతారు. అయినప్పటికీ ఇక్కడ పెద్దల బాధ్యత కొంత ఉంది. కనీసం ఒక ఆదివారం నాడు అయినా అందరూ కలిసి భోజనం చేస్తే కొంతవరకు అనుబంధాలు పెరుగుతాయి. మనిషి మనిషి మాట్లాడకుంటే కొత్త విషయాలు తెలుస్తాయి. విదేశాల్లో ఈ సంస్కృతి ఉంది. దానికో గెట్ టుగెదర్ అనే పేరు పెట్టుకుని కుటుంబాలు కలుసుకుంటాయి. 
మనదేశంలో కూడా ఇటువంటి సంస్కృతి అలవరచుకుంటే మంచిది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి స్నేహం చేస్తే పాడైపోతారని కట్టడి చేస్తారు. ఇది మంచిది కాదు. పదిమందితో కలిస్తే మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. సంఘంలో ఎలా మెలగాలో తెలుస్తుంది. అయినా ఇక్కడ కూడా ఒక ప్రమాదం ఉంది. బాధ్యతగా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆటపాటల మీద దృష్టి పెట్టించాలి. దానివల్ల ఆరోగ్యం మానసిక వికాసం కలుగుతాయి.

 నేటి మానవుడు ఆర్థిక స్థితిగతులు కూడా బాగా పెరిగాయి. రకరకాల వినోద సాధనాలు అందుబాటులోకి వచ్చాయి.
ఒకప్పుడు ప్రసార సాధనముగా రేడియో ఒకటి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది ఏ కొద్దిమందికో అందుబాటులో ఉండేది. క్రమేపీ టెలివిజన్ అందుబాటులోకి వచ్చింది. అలాగే టెలిఫోన్ తరువాత చరవాణి అందుబాటులోకి వచ్చింది. ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడ్డాయి. ప్రతి ఇంటిలోనూ చరవాణి లేని చెయ్యి ఉండదు. టెలివిజన్ లేని గడప ఉండదు.
ఇక మానవుడికి వీటితోటే కాలక్షేపం. పక్క మనిషి గురించి పట్టించుకునే ఆలోచన, తీరికలేదు. మార్కెటింగ్ చేయవలసిన అవసరం లేదు. మీట నొక్కితే అన్ని గుమ్మం దగ్గరకు వచ్చి పడుతున్నాయి. స్నేహితులు బంధువులుకూడా ముఖ పుస్తకం face boo k)ద్వారానే పలకరిస్తున్నారు. ఏ వస్తువైన క్షణాల్లో గుమ్మoల్లోకి చేరుతోంది. ఇంకా సమాజంతో పని ఏముంది
బయటకు వెళ్లి మార్కెటింగ్ చేయడం కూడా పిల్లలకు తెలియడం లేదు. ఈ భావి భారత పౌరులకు సమాజం తెలియడం లేదు. సమాజంతోటి అనుబంధం పెరగడం లేదు. డబ్బుతోనే అన్నీ తన కాళ్ల దగ్గరికి రప్పించుకుంటున్నాడు. ఈ విషయం ఇలా పక్కన పెడితే సామాజిక స్థితిగతులు కూడా మనిషిని సంఘం నుంచి వేరు చేస్తున్నాయి. నిన్నటి వరకు మనల్ని భయభ్రాంతులు చేసిన కరోనా మనిషిని సమాజం నుంచి విడగొట్టేసింది. దూరం నెట్టేసింది. ఇప్పటికీ ఈ భయం మనల్ని వీడలేదు. మళ్లీ అదే వార్తలు రోజు వింటున్నాం. ప్రాణం భయం కొద్దీ మనిషి సంఘానికి దూరమైపోతున్నాడు.

మనిషి సాంకేతికంగా ఆర్థికంగా ఎదిగిన నిర్భయంగా జీవించలేకపోతున్నాడు. ఏదో వెలితి. అందరి దాని కోసం ఆరాటం. చేజిక్కించుకోవాలనే తాపత్రయం. తాపత్రయంతోటే తప్పులు చేస్తున్నాడు. మునుపటిలాగే సమాజంతోటి కలిసిమెలిసి బతికితే మనసు బాగుంటుంది.మనిషి తనకు తెలియకుండానే ఎదుగుతాడు. అటువంటి మంచి కాలo కోసం ఎదురు చూద్దాం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం