ఆఖరి కప్పు
ఆఖరి కప్పు.  ఇవాళ నిన్న కాదు సుమారు యాభై సంవత్సరాల నుంచి పరిచయం. ఉదయం లేస్తూనే దంత దావనం చేసుకున్న  వెంటనే ముందుగా నన్ను పలకరించేది, నేను పలవరించేది , వంటిల్లువైపు ఆశగా చూసేది, పది నిమిషాలు ఆలస్యం అయితే బుర్ర పనిచేయన ట్లుగా తయారుచేసింది  , దానికి మేము బానిస అయ్యింది  ఆ కాఫీ మహాతల్లికి.  పదేళ్లు వయసు వచ్చేవరకు అమ్మ పాలు, గుమ్మ పాలు తాగి పెరిగిన ఈ శరీరం  ఇంట్లో నాకంటే అందరూ పెద్దవాళ్ళు పెద్దపెద్ద గ్లాసులతో అదేదో కొత్త రంగులో ఉండి ఆప్యాయంగా  ఉదయం  రెండు మూడు సార్లు తాగే ఆ ద్రవాన్ని చూసి  అంతవరకు పాల రుచి తప్ప మరొక రుచి ఎరగని నేను కొత్త రుచి కోసం పేచీ పెట్టి రుచి చూసిన రోజు నుంచి  సుమారు నెలరోజుల క్రితం వరకు అది నాకు ఆప్తురాలు అయిపోయింది.  నిజానికి ఈ అలవాటును పెద్దవాళ్ళు ఎవరు చెయ్యి పట్టుకుని అలవాటు చేయలేదు. ఇంట్లో అందరూ తాగుతుంటే నేను కూడా తాగాలని కోరిక పుట్టి అలవాటుగా మార్చుకున్నది.  మాది ఉమ్మడి కుటుంబం. పిల్లలు పెద్దలు కలిసి  ఇరవై మందిపైగా. అందులో ఒకరిద్దరు తప్పితే అందరూ కాఫీ తాగేవాళ్లే. ఇది కాకుండా పరిచారిక జనం.  తెల్లవారుజామున నాలుగు గంటలకు కట్టెల పొయ్యి వెలిగి...