గురువు
ఆషాఢ శుద్ధ పౌర్ణమి – గురు పౌర్ణమి. వ్యాస మహర్షి జన్మదినం. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు వ్యాస మహర్షిని పూజించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. నాలుగు వేదాలను లోకానికి అందజేసిన వారు వ్యాస మహర్షి. అష్టాదశ పురాణాలను ఆయనే రచించారు. మానవ జీవితం నడవడికకు ఇవే ప్రమాణాలు. అయితే నిత్య జీవితంలో, అంటే బాల్యం నుంచి అనేకమంది వ్యక్తులు మనకు మంచి మాటలు చెప్పి, మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేవారు ఉంటారు. వారందరూ కూడా మనకు గురువులే. మొట్టమొదటి గురువు తల్లి. మంచి చెడ్డలు నేర్పేది తల్లిదండ్రులు మాత్రమే. ప్రతి వ్యక్తి మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువ. పిల్లలకు తల్లి దగ్గర చేరిక ఎక్కువగా ఉంటుంది. తండ్రి అంటే భయం. చిరు ప్రాయంలోనే తల్లి నీతి కథలు, రామాయణ మహాభారత కథలు చెబుతుంది. ఆ వయసులో తప్పుడు పనులు చేయకూడదని అర్థమవుతుంది. మనకు జ్ఞానం వచ్చే వరకు మన నడవడికను తీర్చిదిద్దేది తల్లే. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను కూడా తల్లి దగ్గర నుంచే తెలుసుకుంటాము. కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాల చేరినప్పుడు ఓనమాలు దగ్గరుండి దిద్దించి, భవిష్యత్తుకు పునాది వేసేవారు ఉపాధ్యాయులు. అక్షరాన్ని కనుక మనం నేర్చుకోకపోతే, ఎవరు బ్రతుకు బ...