జీవితం
సాయంకాలం ఐదు గంటలు అయింది. రోడ్డంతా చాలా రష్‌గా ఉంది. రిక్షా చెట్టు కింద పెట్టి సవారి కోసం ఎదురుచూస్తున్న లక్ష్మికి ఒక జంట నడుచుకుంటూ వస్తూ కనిపించారు. " అయ్యా రిక్షా కావాలా !అని అడిగింది లక్ష్మి. స్వప్న థియేటర్ కి ఎంత తీసుకుంటావు! అని అడిగాడు ఆయన. "ఇరవై రూపాయలు ఇవ్వండి అంది లక్ష్మి. ఆ దంపతులిద్దరూ సరేనని తల ఊపి రిక్షా ఎక్కి కూర్చున్నారు. "కొంచెం తొందరగా పోనీయమ్మ! సినిమాకు టైం అయిపోతోంది," అన్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. "అలాగే అయ్యా! ట్రాఫిక్కు ఎక్కువగా ఉంది కదా!" అంటూ బలవంతంగా బండిని స్పీడ్‌గా లాగడానికి ప్రయత్నించింది లక్ష్మి. బరువు లాగడం లక్ష్మికి కొత్త ఏం కాదు. బతుకు బండి నడపడానికి ఈ రిక్షాని, తాగుబోతు తండ్రి వదిలేసిన సంసారాన్ని లాగుతూనే ఉంది రోజు పాపం లక్ష్మి. రిక్షా ఎక్కిన దగ్గర్నుంచి ఊరికే కంగారు పడిపోతున్నాడు రిక్షాలో కూర్చున్న వ్యక్తి. ఎంత తొందరపడితే ఏం లాభం? మార్గం ఉండాలిగా బండి నడవాలంటే. స్కూలు, కాలేజీలు, సినిమా హాలు వదిలిన సమయం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్లతో రోడ్ అంతా బిజీగా ఉంది. "బండిలో కూర్చున్నాయన తొందర చూసి ఎందుకండి తొందరపడ...