మరిచిపోలేని మా ఊరి పోస్ట్ మెన్
మరిచిపోలేని మా ఊరి పోస్ట్ మాన్. "న వాబు గారు మాకు ఏమైనా ఉన్నాయా! అంటూఎదురపడిన సైకిల్ మీద తిరిగే ఆ ఆరడుగుల మనిషిని ప్రతిరోజు ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ అదే పలకరింపు. "ఏమీ రాలేదండి అంటూ ఆ వ్యక్తి నవ్వుతూ సమాధానం. రావాల్సింది అందించినప్పుడు తమ ఆనందం కళ్ళల్లో వ్యక్తం చేసేవారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు. అందమైన పంచ కట్టు దానిపైన ఆ కాలంనాటి చొక్కా ,కాళ్లకు చెప్పులు ,చేతిలో ఉత్తరాల కట్ట, సైకిల్ మీద ఊరంతా ఉత్తరాల బట్వాడా. ఎండైనా వానైనా క్రమం తప్పకుండా తన వృత్తి ధర్మం నిర్వర్తించే మా ఊరి తపాలా ఉద్యోగి షేక్ లాల్ సాహెబ్. మాటవరసకి కాకి చేత కబురు పంపితే చాలు వచ్చి వాలిపోతాం అంటారు. పూర్వకాలంలో ఆ ఊరి నుంచి ఈ ఊరికి సమాచారం పంపించాలంటే రాజుల కాలంలో అయితే వేగుల ద్వారా, పావురాలు ద్వారా కూడా పంపించేవారుట. కాలక్రమేణా బ్రిటిష్ వారి పుణ్యమా అని తంతి తపాలా వ్యవస్థ ఏర్పడింది. ఒకప్పుడు ఆ ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉండేది కాదుట. ఇంతకీ ఆ ఊరి పేరు ఏమిటి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా వయా యానం పల్లిపాలెం గ్రామం ఆ ఊరి అడ్రస్.ప్రక్కనే ఉన్న ఊరి నుంచి ఉత్తరాలు బట్వాడా చేసేవారుట. ఆ ఊరికి రోడ్డు సౌకర్యం సర...