అంతిమ ఘడియల్లో నైతిక విజయం
* అంతిమ ఘడియల్లో నైతిక విజయం" "చనిపోయిన వాళ్లకి ఏం తెలుస్తుంది? కట్టెలతో కాలిస్తే ఏమిటి, కరెంట్ మీద దహనం చేస్తే ఏమిటి? మీ చాదస్తం ఏమిటీ?" — ఇలా అన్నాడు బ్రహ్మయ్య గారి దూరపు బంధువు రాజయ్య. "వద్దు బాబూ... నాన్నకు కరెంట్ అంటే భయం. లైట్ స్విచ్ వేయడానికి కూడా ఎప్పుడూ తడబడేవాడు. అలాంటి మనిషిని కరెంట్ మృతదహనానికి పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు..." అన్నాడు పెద్దకొడుకు రమణ, తలవంచుకొని. "మామూలు స్మశానం మన ఇంటికి చాల దూరం. అక్కడికి వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ. పెద్దవాళ్ళు రావడం కష్టం. అక్కడ అంతసేపు ఉండలేరు, ఆతిథ్యం ఎలా చూస్తాం?" అంటూ కోపంగా రాజయ్య వాదించాడు. "పర్వాలేదు. రాలేని వారు రాకపోవచ్చు. కానీ కుటుంబ సభ్యులంతా వెళ్తాం," అన్నది సరోజ, బ్రహ్మయ్య గారి పెద్ద కూతురు. "రోజూ యూట్యూబ్‌లో చూస్తున్నాం… ఎవరో తెలియని వ్యక్తిని కూడా అలా బూడిద అయ్యే దృశ్యం చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. నాన్న గురించి ఊహించలేకపోతున్నాం అక్కా..." ఆమె మాటల్లోకి బాధ తళతళలాడింది. "నిజమే. చివరకు మిగిలేది బూడిదే. కానీ శాస్త్రం చెప్పిన విధంగా, తలకొరివి కొడుకు చేతి మీద చేయకపోతే...