ఆఖరి గమ్యం _ఒక క్రొత్త ప్రారంభం
నలుగురు నడిచే దారి రహదారి. నాలుగు ఊళ్లను కలిపే దారి రహదారి. రహదారికి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. తెల్లవారి లేస్తే మన బ్రతుకు రహదారి మీద ప్రయాణం తోటి ప్రారంభమవుతుంది. రహదారి కొంతమందికి బ్రతుకు దారి. మరి కొంతమందికి బంధాలను కలుపుకోవడానికి వెళ్లే దారి. బాధ్యతలు తీర్చుకోవడానికి నడిచే దారి. మన జీవితంలో లాగే రహదారి మీద కొన్ని నియమాలు పాటించకపోతే మన జీవితం అక్కడే తెల్లారిపోతుంది. మనం పాటించడమే కాదు మనం తోటి ప్రయాణికులు కూడా పాటించాలి. లేదంటే ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వస్తుంది. అందరికీ గమ్యం చేరుకోవాలని తొందర. తొందరలో ఎవరు తప్పు చేశారో ఎవరికీ తెలుసు ? తప్పు జరిగిపోయింది. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్ అన్నట్టు మెదడుకు కోపం వచ్చి మౌనంగా ఉండిపోయింది. అవయవాలకి ఇంక ఆజ్ఞలు అందవు. కొంతసేపు అవి ముందు చెప్పిన టైం టేబుల్ ప్రకారం నడుచుకుంటూ వెళ్లిపోతాయి. ఊపిరి ఉన్నంతవరకు ఇది నా ఆస్తి. నేను చెప్పినట్టు నడిచే శరీరం. మరి ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఎవరిస్తారు. ఈ శరీరంపై అధికారం ఎవరికి ఉంది. ఇది ఎవరి సొత్తు. ఇంకెవరిది శాస్త్ర ప్రకారం చూసిన వారసులుదే ఈ శరీరం. మహా అయితే 24 గంటలు. ఆ తర...