శ్రీరామచంద్రుడు
సకల గుణాభిరాముడు భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై దశావతారాలు ఎత్తి ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. అయితే త్రేతా యుగంలో శ్రీరాముడుగా మానవ రూపంలో జన్మించి రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షించాడు. శ్రీరాముని జీవితమే ఒక మహా కావ్యంగా వ్రాసిన వారు వాల్మీకి మహర్షి. ఆదికవి వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణం రచించి సీతారాముల కథను లోకానికి తెలియజేశాడు. రామాయణం భారతజాతి గర్వించదగ్గ ఉత్తమమైన కావ్యం. ఈ ఆదికావ్యాన్ని చదివితే శ్రీరామ చంద్రమూర్తి గొప్పదనం మనకు తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి ఆదర్శవంతమైన పురుషుడు ఎందుకైనాడో మనకు తెలుస్తుంది. ఆదర్శవంతుడు అంటే అనుసరించదగినవాడు అని అర్థం. శ్రీరామచంద్రుని గుణగణాలను పరిశీలిస్తే ఎల్లప్పుడూ సత్యము మాట్లాడేవాడు మృదుభాషి నిగర్వి ఎవరినైనా తానే ముందుగా పలకరించేవాడు పరుషంగా మాట్లాడేవాడు కాదు.. అన్నదమ్ములతో తల్లితండ్రులతో భార్యతో ప్రజలతో వివిధ సందర్భాలలో ప్రవర్తించిన తీరును బట్టి శ్రీరామచంద్రమూర్తి ఆదర్శవంతుడైన పురుషుడని ప్రజలు వెయ్యినోళ్ల కీర్తించేవారు. అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజుకి పుత్ర కామేష్టి యాగ ఫలితంగా అవతార మూర్తి...