భూమాత కన్నీరు
"అమ్మా పద్మ! నా బంగారు తల్లి కదా, రెండు మాత్రలు వేసుకో. పొద్దున్న టిఫిన్ మాత్రలు కూడా వేసుకోలేదు. ఈ లంచ్ మాత్ర వేసుకో అమ్మా. నీరసం వస్తుంది" అంటూ పద్మ తల్లి నీరజ కూతుర్ని బతిమాలుతోంది. "లేదమ్మా! నాకు ఆకలిగా లేదు. ఆ మాత్రలు వేసుకుంటే కడుపులో ఏదోలా ఉంటోంది. ఆ మాత్రలు చేదుగా ఉంటున్నాయి. వికారంగా ఉంటుంది. నాకు వద్దు" అంటూ ఏమి తినకుండానే స్కూల్‌కి వెళ్ళిపోయింది పద్మ. "ఆకలి చంపుకోడానికి మాత్రలు వేసుకుంటున్నాను కానీ నిత్యం నా పరిస్థితి కూడా ఇదే" అని తనలోతాను అనుకుంది పద్మ తల్లి నీరజ. "అయినా శరీరానికి ఈ మాత్రలు అలవాటు పడటానికి కొద్ది రోజులు పడుతుంది అని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈ పిల్ల అర్థం చేసుకోవడం లేదు" అని అనుకుంది నీరజ. "ఒసేయ్ నీరజా! నాకు ఆ దిక్కుమాలిన మాత్రలు వద్దు. నాకు రెండు ముద్దల మజ్జిగ అన్నం పెట్టు. అసలే నేను రోగానికి మందులు మింగుతున్నాను. దానికి తోడు మళ్ళీ ఈ దిక్కుమాలిన బాధ ఒకటీ! అలవాటైన ప్రాణం... వేళకి రెండు ముద్దలు తినకుండా ఉండలేము. ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి దేవుడా! కడుపులోని ఆకలిని చంపడానికి మందులు మింగే స్థితికి వచ్చేసాము...