మన జాగ్రత్తలో మనం
ఉదయం ఎనిమిది గంటలు అయింది.
హాలులో కూర్చుని రామాయణం చదువుకుంటున్న కాంతమ్మగారిని చూసి కోడలు సరోజ,
“అత్తయ్య, మరో కప్పు కాఫీ ఇయ్యమంటారా?” అని అడిగింది.
“లేదమ్మా, వద్దు. ఇదిగో ఇది అయిన తర్వాత టిఫిన్ తినేస్తాను.”
“అది అప్పుడే ఎక్కడ అవుతుంది? ప్రతిరోజు పది గంటల వరకు చదువుకుంటున్నారు. అంతసేపు ఉంటే మీకు నీరసం వస్తుంది,” అని అంది సరోజ.
“పరవాలేదు,” అని సమాధానం చెప్పి మళ్లీ రామాయణం చదువుకోవడంలో మునిగిపోయింది కాంతమ్మ.
“నువ్వు టిఫిన్ తినేసేయ్. నా గురించి చూడకు,” అంది.
‘అదేమిటి! ఉదయం లేస్తూనే కాఫీ కోసం విలవిల్లాడే ఈ కాంతమ్మ ఈ మధ్య ఇలా తయారవుతోంది ఏమిటి? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? ఏమీ చెప్పదు…’ అని మనసులో అనుకుంది సరోజ.
సరోజ పని అంతా పూర్తి చేసుకుని టిఫిన్ చేసి వచ్చేటప్పటికి కాంతమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది.
“మీకు ఇష్టమని పెసరట్లు వేశాను. అల్లం పచ్చడి కూడా చేశాను,” అని చెప్పినా, మొహంలో ఎలాంటి ఉత్సాహం చూపలేదు కాంతమ్మ. ప్లేట్లో పెట్టిన రెండు పెసరట్లు తిని, చేయి కడిగేసుకుంది.
ఎప్పుడూ “నోరు బాగాలేదు… ఏదో ఒక పచ్చడి చెయ్యి” అంటూ చెప్పే కాంతమ్మ, మధ్యాహ్నం భోజనం కూడా ఏమి మాట్లాడకుండా తినేసింది.
మొన్ననే కాంతమ్మగారికి డబ్బై ఏళ్లు నిండాయి. ఆరోజు కొడుకు బజార్ నుంచి తెచ్చిన కోటయ్య కాజా కూడా చిన్న ముక్క మాత్రమే నోట్లో వేసుకుంది. కేక్ ముక్క తినడంలో చిన్నపిల్లలతో పోటీ పడే కాంతమ్మ ఎందుకు ఇలా అయిందో ఎవరికి అర్థం కాలేదు.
కాంతమ్మకి మొదటి నుంచి చిరుతిండి అంటే బాగా ఇష్టం. దానికి కారణం ఆమె తండ్రి, భర్త ఇద్దరూ ఆయుర్వేద వైద్యం చేసేవారు. అందువల్ల గ్రామంలో ఎవరింట్లో శుభకార్యం జరిగినా, పండగలు వచ్చినా స్వీట్లు పట్టుకొచ్చి ఇచ్చేవారు.
పెళ్లయిన తర్వాత కాంతమ్మ కూడా పిల్లలతో సమానంగా చిరుతిండి తినేది. అన్నిట్లోకి పాలకాయలు అంటే ఆమెకు చాలా ఇష్టం. రాత్రిపూట కూడా పక్కన సీసాలో పెట్టుకుని తినేది.
కాంతమ్మకి ఎనిమిది మంది సంతానం. మంచం పట్టిన అత్తగారు, మామగారు—ఇదీ సంసారం. తెల్లవారగానే చేతినిండా పని. అయినా ఏదో ఒకటి నోట్లో వేసుకుని పని చేసుకుంటూ ఉండేది.
అందరికీ పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు చేసి… అత్తగారు, మామగారు, భర్త పోయిన తర్వాత పెద్ద కొడుకు దగ్గరే కాలక్షేపం చేస్తోంది. కోడలికి కూడా తన కోరికలన్నీ చెప్పి ప్రతిరోజు ఏదో ఒకటి చేయించుకుని తినేది.
అలాంటిది అకస్మాత్తుగా కాంతమ్మలో వచ్చిన ఈ మార్పుకు అందరూ ఆశ్చర్యపోయారు.
సాయంకాలం నాలుగు గంటలు అయ్యింది. టీ తాగి కుర్చీలో కూర్చున్న కాంతమ్మ దగ్గరికి పక్కింటి సుబ్బమ్మ వచ్చి కూర్చుంది.
“ఏమే కాంతమ్మ! ఇవాళ మా కోడలు పాలకాయలు చేసింది. నీకు ఇష్టమని నాలుగు డబ్బాలో వేసుకుని వచ్చాను,” అంటూ డబ్బా చేతికి అందించింది.
సుబ్బమ్మ దగ్గర నుంచి డబ్బా తీసుకుని పక్కన పెట్టేసింది కాంతమ్మ. కానీ పెద్దగా ఉత్సాహం చూపలేదు.
“అదేమిటి, రెండు నోట్లో వేసుకో,” అంది సుబ్బమ్మ.
“వద్దు… చిరుతిళ్లు తినడం మానేశాను,” అంది కాంతమ్మ.
“ఏమయ్యింది? ఒంట్లో బాగోలేదా?” అని అడిగింది సుబ్బమ్మ.
“లేదు లేదు, బాగానే ఉంది. ఎందుకనో మొన్న మా అత్తగారు, మామగారు గుర్తుకొచ్చారు. ఎన్ని రోజులు మంచం మీద ఉన్నారు పాపం. అయినా నోరు కట్టేవారు కాదు. ఏదో ఒకటి పెట్టమనేవారు. కొద్దిగా తిన్నా మరునాటికి తేడా చేసేది.
అవి ఆ రోజులు కాబట్టి సరిపోయింది. ఇప్పటి రోజుల్లో ముసలి వాళ్లు మంచం మీద పడితే చాకలి చేసే వాళ్లు లేరు.
ఇప్పుడు నా పరిస్థితి చూసుకో. వాడు పొద్దున్నే వెళ్లి సాయంకాలం ఇంటికి వస్తాడు. కోడలికి పిల్లలతో సరిపోతుంది. ఇది వాళ్లని తప్పు పట్టడానికి కాదు… మనం తెలుసుకోవాల్సిన సత్యం.
ఎవరో మనిషిని పెడతారు. ఆ మనిషి సరిగా చేస్తుందో చెయ్యదో ఎవరికి తెలుసు! అక్కడ నుంచి డాక్టర్లు, మందులు, ఇంజక్షన్లు—రకరకాల బాధలు.
హాస్పిటల్‌కి వెళ్లలేము. ఆ టెస్టులు అవి చేయించుకోలేము… మన జాగ్రత్తలో మనం ఉంటే ఆ తర్వాత భగవంతుడి దయ.
పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు. పదిమంది బలగం ఉండేది. ఒకరు కాకపోతే మరొకరు… అలా సర్దుకునేవారు.
ఇప్పటి రోజులు చాలా కష్టం,” అంది కాంతమ్మ. అలా అని ఉపవాసాలు ఉండమని నేను చెప్పటం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది కాంతమ్మ.కాంతమ్మ మాటల్లో నిజం లేకపోలేదు అనిపించింది సుబ్బమ్మకి.
ముసలి వయసులో పనికొస్తుందని డబ్బు దాచుకుంటాం. కడుపున పుట్టిన పిల్లలు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని భావిస్తాం. కానీ పరిస్థితులు మన చేతుల్లో లేవు అవి భగవంతుడు నిర్ణయాల ప్రకారం జరుగుతాయని మనకు ఎవరికీ తెలియదు. ఉమ్మడి కుటుంబాలు అడుగంటి పోయే యి. పదిమంది పిల్లలు కనే రోజులు పోయాయి. డబ్బు సంపాదన మీద ఇష్టంతో విదేశాలకు వెళ్ళిపోతున్నారు పిల్లలు. స్వదేశంలో ఉన్నవాళ్లకి తీవ్రమైన పనులు ఒత్తిడి. ఇటువంటి పరిస్థితుల్లో ముసలి వాళ్లకు కష్టంగానే ఉంది. ఈ సందర్భంలో వృద్ధాశ్రమాలు సర్వెంట్ మెయిడ్ ప్రకటనలు ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. చివరి దశలో అయిన వాళ్ళ మధ్య ఆనందంగా గడపాలని ప్రతి ముసలి వాళ్ళ కోరిక.
కాంతమ్మ చెప్పినట్లుగా ఆహార నియమాలు పాటిస్తే తప్పేముంది. మన జీవితం మనం ఆనందంగా మలుచుకోవడానికి మనమే నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంది సుబ్బమ్మ.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి