వసంతం చెప్పే జీవన సత్యం
ఆంగ్ల సంవత్సరాది, తెలుగు సంవత్సరాది—రెండూ కాలానికి కొలమానాలే. కానీ వాటి స్వభావం మాత్రం వేరు. ఆంగ్ల సంవత్సరాది గడియారం లాంటిది—సూచీలు తిరుగుతాయి, తేదీలు మారతాయి, కానీ అది యాంత్రికం. మన జీవనంతో, మనసుతో, ప్రకృతితో పెద్దగా సంబంధం లేకుండా కాలాన్ని కొలుస్తుంది. తెలుగు సంవత్సరాది మాత్రం జీవంతో నిండినది. అది గడియారం కాదు… అది ఒక జీవన చక్రం. ప్రకృతి శ్వాసించే ప్రతి క్షణానికీ అది ప్రతిబింబం. శిశిరం తన చివరి ఊపిరి తీసుకుంటున్న వేళ, చెట్లు ఆకులు రాల్చి నిశ్శబ్దంగా నిలబడినప్పుడు, ఒక ముగింపు కనిపిస్తుంది. అయితే అదే ముగింపులో కొత్త ఆరంభం దాగి ఉంటుంది. వసంతం అడుగుపెట్టినప్పుడు, చిగుర్లు మొలుస్తాయి… పూలు వికసిస్తాయి… ప్రకృతి తన నవ్వును తిరిగి పొందుతుంది. ఆ ఆకురాల్చే దశ నుండి మొగ్గ తొడిగే దశకు మారడమే వసంతం. అదే నిజమైన “యుగాది”—యుగానికి ఆది. అందుకే తెలుగు సంవత్సరాది ఒక తేదీ మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమై, జీవితం కొత్తగా మొదలయ్యే క్షణం. అదే మనకు ఉగాది పండుగ. ఈ పండగ కేవలం ప్రకృతిలో మార్పు తో నిశ్శబ్దంగా మన ఇంటిలోనికి వస్తుంది. హోరెత్తించే మైకులు, అర్ధరాత్రి వరకు బిర్యానీ వాసనలు, బాణస...