వసంతం చెప్పే జీవన సత్యం
ఆంగ్ల సంవత్సరాది, తెలుగు సంవత్సరాది—రెండూ కాలానికి కొలమానాలే.
కానీ వాటి స్వభావం మాత్రం వేరు.
ఆంగ్ల సంవత్సరాది గడియారం లాంటిది—సూచీలు తిరుగుతాయి, తేదీలు మారతాయి, కానీ అది యాంత్రికం.
మన జీవనంతో, మనసుతో, ప్రకృతితో పెద్దగా సంబంధం లేకుండా కాలాన్ని కొలుస్తుంది.
తెలుగు సంవత్సరాది మాత్రం జీవంతో నిండినది.
అది గడియారం కాదు… అది ఒక జీవన చక్రం.
ప్రకృతి శ్వాసించే ప్రతి క్షణానికీ అది ప్రతిబింబం.
శిశిరం తన చివరి ఊపిరి తీసుకుంటున్న వేళ,
చెట్లు ఆకులు రాల్చి నిశ్శబ్దంగా నిలబడినప్పుడు,
ఒక ముగింపు కనిపిస్తుంది.
అయితే అదే ముగింపులో కొత్త ఆరంభం దాగి ఉంటుంది.
వసంతం అడుగుపెట్టినప్పుడు,
చిగుర్లు మొలుస్తాయి… పూలు వికసిస్తాయి…
ప్రకృతి తన నవ్వును తిరిగి పొందుతుంది.
ఆ ఆకురాల్చే దశ నుండి మొగ్గ తొడిగే దశకు మారడమే వసంతం.
అదే నిజమైన “యుగాది”—యుగానికి ఆది.
అందుకే తెలుగు సంవత్సరాది ఒక తేదీ మాత్రమే కాదు,
ప్రకృతితో మమేకమై, జీవితం కొత్తగా మొదలయ్యే క్షణం. అదే మనకు ఉగాది పండుగ.
ఈ పండగ కేవలం ప్రకృతిలో మార్పు తో నిశ్శబ్దంగా మన ఇంటిలోనికి వస్తుంది. హోరెత్తించే మైకులు, అర్ధరాత్రి వరకు బిర్యానీ వాసనలు, బాణసంచా మెరుపులు, భయంకర శబ్దాలు, చిత్ర విచిత్ర ధ్వనులతో కుర్ర కారు విన్యాసాలు, అర్ధరాత్రి వరకు క్లబ్ నృత్యాలు, పబ్బులో సీసా చప్పుళ్ళు ఇవేవీ ఈ పండుగను ఆహ్వానించవు. మనసుపెట్టి చూస్తే కొమ్మ మీద కోయిల సన్నాయి రాగం ఆలపిస్తుంటే చిటారు కొమ్మునున్న మిఠాయి పొట్లం అప్పుడే ప్రాణం పోసుకుని అందంగా ఆహ్వానం పలుకుతుంది. అప్పుడే ప్రాణం పోసుకున్న కొరికితే వగరుగా ఉండి ఉగాది సంబరంలో నేను కూడా ముఖ్యం అంటూ పొగరుగా ఉంటుంది.
తోటలో విరిసిన పువ్వులు మీద తుమ్మెదలు అందగా తిరుగుతూ చేసే శబ్దం ఒక మధురమైన సంగీతంలా చెవులకు వినబడుతుంది. అది పూజకు పనికిరాని పువ్వు అయినా ఆకాశంలో నక్షత్రంలా మెరిసిపోతూ ఉగాదికి స్వాగతం పలుకుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా వంగకుండా నిటారుగా నిలబడి అందరికీ తీపిని పంచాలని చెరుకుగడ ఉగాది పండుగను ఆహ్వానిస్తుంది.
చింత చెట్టు మీద దెయ్యం ఉంటే నాకేం భయం అని ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. అది పేరుకు మాత్రమే పండు కొరికితే పుల్లగా ఉండు. అయినా ఈ పండుగకు అది ముఖ్యమే. నాకు కారం మీద మమకారం లేదు అన్నా తప్పదు ఉగాది రుచి చూపించేస్తుంది. ఇలా ప్రకృతిలో దొరికే రుచులతో పచ్చడి తయారు చేసుకుని పండగ సంబరం మొదలు పెట్టుకుంటా ము. ఈ పండగ సంబరం కేకుముక్కల కోతతో కాదు జీవితంలో అతి ముఖ్యమైన ఆరు రుచుల సమ్మేళనంతో తయారైన ఉగాది పచ్చడితో.
ఆ ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు… అవి కేవలం రుచులే కావు, మన జీవిత సత్యాల ప్రతిరూపాలు.
ఈ ఆరు రుచులు కలిసి మన జీవితాన్ని ప్రతిబింబించే ఒక చిన్న విశ్వంలా నిలుస్తాయి.
అందుకే ఉగాది పచ్చడి ఒక వంటకం మాత్రమే కాదు—ఒక జీవన సందేశం.
ఉగాది పండుగ ఉదయం, ఇంటి ముందు ముగ్గులు వేసిన ప్రాంగణం, తలుపుకి కట్టిన మామిడి తోరణాలు, ఇంట్లో పూజ వాసనలు—ఇవి అన్నీ కలసి ఒక పవిత్రమైన ఆరంభాన్ని సూచిస్తాయి.
పంచాంగ శ్రవణం వినిపించినప్పుడు, రాబోయే సంవత్సరానికి ఒక మార్గదర్శకం లభించినట్టుగా అనిపిస్తుంది. అదే నమ్మకంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాం.
ఇంక ఆదాయo అదృష్టాన్ని బట్టి వస్తే వ్యయం మన చేతుల్లోనే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుని వచ్చిన ఆదాయం పొదుపుగా ఖర్చు పెట్టుకుంటే ఆదాయాన్ని పెంచినట్లే. నరం లేని నాలుకని పొదుపుగా వాడుకుని అందరితో కలిసిమెలిసి జీవితం గడుపుకుంటే ఏ బాధ ఉండదు.
కానీ ఇవన్నీ కంటే ముఖ్యమైనది—మనసులో కలిగే కొత్త ఆశ.
“ఇది ఒక కొత్త ఆరంభం” అనే నమ్మకం.
ప్రకృతి ఎలా ప్రతి వసంతంలో తనను తాను పునరుద్ధరించుకుంటుందో,
మనిషి కూడా తనలోని పాత బాధలను వదిలి, కొత్త ఆశలతో ముందుకు సాగాలి అని ఉగాది చెబుతుంది.
ఆంగ్ల సంవత్సరాది మనకు “సమయం మారింది” అని చెబితే,
తెలుగు సంవత్సరాది మనకు “మనమే మారాలి” అని గుర్తు చేస్తుంది.
అందుకే ఉగాది ఒక పండుగ మాత్రమే కాదు—
అది ఒక తాత్త్విక సందేశం…
మన జీవితానికి ఒక కొత్త ఆహ్వానం.
ఇది పరాభవనామ సంవత్సరం. పేరులో కొంత వ్యతిరేక ధోరణి కనిపించినప్పటికీ భయపడవలసిన పనిలేదు. పరాభం జీవితానికి కూడా అవసరమే. అది మనలో కసిని పెంచి పరోక్షంగా మన అభివృద్ధికి తోడ్పడుతుంది. అయినా కాలచక్రాన్ని త్రిప్పే ఆ పరమాత్ముడి పాదాలు పట్టుకుని మన జీవన యానం సాగిస్తే కష్టాలు సుఖాలు సమంగా స్వీకరించే మానసిక స్థితి మనకి ఏర్పడుతుందనడంలో సందేహం లేదు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి