మా ఊరి వినోదం
మా ఊరి వినోదం. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం పొలిమేరలో మా చింతలు తీర్చే పోలేరమ్మ కాపురం. ఆ దేవాలయానికి ఎదురుగా అందమైన చెరువు. చెరువులో నిత్యం స్నానం చేసేది అమ్మవారి భక్తులు కాదు. అమ్మ బిడ్డలు వదిలేసిన మురికి దుస్తులు. తరతరాలుగా అదే రేవు. రేవు గట్టుమీద మురికి బట్టలతోపాటు తలలు తెగిపడి ఉన్న జీవులు. రక్తపు మరకలు. గాలికి ఎగురుతున్న కోడి ఈకలు. అమ్మవారి గుడి ముందు గుమి కూడిన జనం . జనం మధ్యలో జనాలను అదుపు చేస్తూ చింత నిప్పులాంటి కళ్ళతో ఒక భారీ కాయం. మధ్యలో కోడిపుంజుల పౌరుషం. ప్రాణాలకు తెగించి పోరాటం. చుట్టూ ఉన్న జనం అరుపులు కేకలు ఈలలు గోలలు. ఇంతకీ ఆ సంబరం ఏమిటి అక్కడ జరుగుతున్నది ఏమిటి. ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి జరిగే కోడి పందాలు ఆట. సంక్రాంతికి జరిగే సంబరం. మా ఊరి ప్రజలకు సంక్రాంతి వినోదం. మా ఊరు అంటే ఎవరికి తెలుస్తుంది. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని ఒక పల్లె. ఆ పల్లె పేరు పల్లిపాలెం. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గ్రామం. ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు. అన్ని పల్లెటూర్లు మాదిరిగానే. వేద పండితులు పురాణ కర్తలు కవులు...