పిచ్చుక _ పల్లె జ్ఞాపకo
ప్రకృతి అందాలకు పుట్టినిల్లు మన పల్లెటూళ్లు. అనుబంధం, ఆప్యాయతలతో నిండిన మనుషుల మధ్య, మాటరాని మూగజీవాల సాన్నిధ్యంలో మనిషి ప్రశాంతమైన జీవితం గడపగలిగే ప్రదేశం పల్లెటూరు. అక్కడ జీవితం కృత్రిమం కాదు — సహజం. ప్రతి ఉదయం ఒక కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది.
గంప కింద కూస్తున్న కోడి తెల్లవారిందని సంకేతం ఇస్తుంది. పాకలోని లేగదూడ అరుపు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆకాశంలో విహరించే పక్షులు, చెట్టు మీద “కుహూ కుహూ”మని ఆలపించే కోయిల, చుట్టూ నీడనిచ్చే చెట్లు — ఇవన్నీ కలిసి జీవన సంగీతాన్ని సృష్టిస్తాయి.
గలగల పారే గోదావరి ప్రవాహం మనసుకు నెమ్మదిని ఇస్తుంది. తూర్పున ఉదయించే బాలభానుడు భూమిని బంగారు వెలుగులతో నింపుతాడు. ఈ సృష్టిలోని ప్రతి జీవరాశి మధ్య మనిషి సహజంగా మమేకమై ఆనందంగా జీవిస్తాడు.
ఇలాంటి వాతావరణం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కొనలేం. ప్రకృతి అంటే కొనుగోలు చేయలేనిది, నిర్మించలేనిది — అది సహజ సిద్ధమైన వరం. దానిని ఆస్వాదించడమే మన అదృష్టం.
అలాంటి మన ఊరిలో, మన ఇంటి చూరులో, ఇంటి ముందు ఉన్న తాటాకు పందిరిలో, పచ్చటి చెట్టు కొమ్మమీద గూడు కట్టుకుని నిత్యం “కిచకిచ”మని శబ్దం చేస్తూ, గోధుమరంగులో మెరిసిపోతూ నేలపై ఉన్న గింజలను, పురుగులను ఆహారంగా చేసుకుని మన మధ్యే ముద్దుగా బ్రతికే అల్పప్రాణి — పిచ్చుక.
పక్షిజాతికి చెందినదే అయినా, దానిని చూస్తే మనసులో చిన్నపాటి ఆనందపు అలలు అలుముకుంటాయి. జనవాసాల మధ్య బ్రతికే అది మనం దగ్గరికి వెళ్లగానే తుర్రున ఎగిరిపోతుంది; కానీ కొద్దిసేపటికే మళ్లీ వచ్చి మన ఇంటి చుట్టూ తిరుగుతూ తన ఉనికిని తెలియజేస్తుంది.
ఇంజనీరింగ్‌లో డాక్టరేట్లు పొందిన వారికి కూడా ఆశ్చర్యమే — అంత చిన్న ప్రాణి ఆ గూడు ఎలా నిర్మించిందో! గడ్డి తుంట్లు, పొదల తీగలు, చిన్నపాటి రెమ్మలు… ఇవన్నీ ఏరి జాగ్రత్తగా అల్లుకుని ఒక సురక్షితమైన లోకాన్ని తయారు చేస్తుంది. చిన్నప్పుడు ఆ గూళ్లు చూసి మనం కూడా అలాగే కట్టాలని ప్రయత్నించడం ఒక ఆట, ఒక మధుర జ్ఞాపకం.
ఆకారంలో పొట్టిగా ఉన్న ఆ పిచ్చుకంటే అందరికీ మమకారమే.
చెట్టు మీద ఉండే కోయిల లాంటి మధుర స్వరం కాకపోయినా, దాని గొంతు నుంచి వచ్చే “కిచకిచ” శబ్దం వినిపిస్తే ఇంటి వద్ద జీవం నిండినట్టుగా అనిపిస్తుంది. అది కేవలం ఒక పక్షి కాదు — మన బాల్యాన్ని గుర్తు చేసే జ్ఞాపకం, మన ఊరి సౌందర్యానికి చిన్న ప్రతీక, ప్రకృతి మనతో మాట్లాడే మృదువైన స్వరం.
మనల్ని చూడగానే తుర్రున పారిపోయే ఈ బుజ్జి ప్రాణి తెలియక కరెంటు తీగల మీద వాలి ఉయ్యాల ఊగుతుంటే మన ప్రాణం విలవిలలాడేది.
మేము ఇల్లు కట్టాలంటే ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ప్లాన్లు. మంది సాయం తీసుకుంటే గాని మా గూడు కట్టలేము. తీరా కట్టిన తర్వాత నిత్యం వాస్తు సందేహాలతో మనసు పాడు చేసుకుంటూ గడుపుతాం. కానీ నువ్వు — పరంధాముడు ఇచ్చిన చిన్న ముక్కుతో పుల్లలు ఏరుకుని, ఎవరికీ అంతుచిక్కని ప్రణాళికతో గూడు కట్టుకుని పిల్లలతో ఆనందంగా జీవిస్తావు. అందుకే ఒక కవి అన్నాడు — “అన్నీ తెలిసిన మానవుడు కంటే పిట్ట బ్రతుకే మేలు రా!”
మా ఇంటి చూరులో నీ గూడు కనిపిస్తే మా పసిబిడ్డకు ఆనందం. పెద్దవాళ్లమైన మేము అటుగా వెళ్లడానికే జాగ్రత్త పడతాం. పైగా అందరికీ చెబుతాం — “అక్కడ పిచ్చుక గూడు ఉంది, చూసుకోండి” అని. నువ్వంటే మాకు అంత ఇష్టం.
కానీ కాలం ఎప్పటికీ ఒకలా ఉండదు. పల్లెటూరు నగరాన్ని తన ఒడిలోకి ఆహ్వానించింది. సాంకేతికత ముసుగులో పరుగులు పెట్టించింది. రచ్చబండల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే పెద్దలు ఇప్పుడు సెల్‌ఫోన్‌లో పలకరించుకునే స్థాయికి వచ్చారు. ఆకాశాన్ని తాకే వృక్షాలు కనుమరుగయ్యాయి; వాటి స్థానంలో ఆకాశాన్ని చీల్చి మాటలు మోసుకెళ్ళే సెల్ టవర్లు నిలిచాయి.
ఇదివరకు మనందరం ఆనందంగా జీవించిన పల్లెటూరు, చూరులేని గూడులా మారిపోయింది. నువ్వు కాపురం ఉండే చెట్లు పోయాయి. దొరికిందే తిని పిల్లలను పెంచుకున్న నువ్వు, రెక్కలు వచ్చిన గువ్వలు ఎగిరిపోతే మాలాగే ఒంటరిగా మిగిలిపోయావు.
ఇప్పుడు ఆ పల్లెటూర్లో కూడా నువ్వు కనిపించడం లేదని విన్నప్పుడు హృదయం భారమైంది. ఇంట్లో కూర్చుని మీట నొక్కితే పనులు జరుగుతున్నాయనే ఆనందంలో మునిగిపోయాం; కానీ మన ఇంటి మీద కట్టిన ఆ స్తంభాలే నిన్ను కనుమరుగయ్యేలా చేశాయని శాస్త్రజ్ఞులు చెప్పినప్పుడు కళ్లలో నీరు వచ్చింది.
పట్టణంలో మేడ మీద గుప్పెడు గింజలు పట్టుకుని ఎదురుచూశాను — నీ జాడ మాత్రం లేదు. జరగవలసింది జరిగిపోయింది. చేసేదేమీ లేక ప్రతి ఏడాది ఒకరోజు నిన్ను గుర్తు చేసుకుంటూ మనసును ఓదార్చుకుంటున్నాం.
మా తరం అంతా ఆనందంగా నిన్ను చూస్తూ పెరిగాం. రాబోయే తరాలకు బొమ్మ పిచ్చుకలను మాత్రమే చూపించాల్సి వస్తుందేమో అన్న భయం మమ్మల్ని వేధిస్తోంది.
నువ్వు పొట్టిదానివే గాని గట్టిదానివి… మా మనసు దోచిన దానివి.
ఓ పిచ్చుకా… మళ్లీ ఒకసారి రా.
మా ఇంటి చూరులో గూడు కట్టు.
మా బాల్యాన్ని, మా పల్లె జ్ఞాపకాలను మళ్లీ మోగించు.
ప్రకృతి ఇంకా బ్రతికే ఉందని మాకు నమ్మకం కలిగించు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి