పోస్ట్‌లు

ఫిబ్రవరి 9, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

నిశ్శబ్ద వీరుడు

  నీ గెలుపుకోసం   ఎన్నోసార్లు నేనే ఓడిపోయాను —   మన సంసార సమరంలో   బాధ్యతగల భర్తగా నిలిచాను. కన్నబిడ్డల కలలన్నీ   నా భుజాలపై మోసుకుంటూ,   నాన్నగా నా జీవితాన్ని   నిశ్శబ్ద త్యాగంగా మార్చుకున్నాను. కుర్చీకి అతుక్కుపోయిన రోజులు,   పని గంటలు మరిచిన రాత్రులు,   రక్తపోటు పెరిగినా   కుటుంబ సంతోషమే ఔషధమైంది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు, ఎవరూ గాథలు రాయలేదు; అయినా ప్రతి ఇటుకలో నా చెమట ఉంది, ఈ ఇంటి ప్రతి వెలుగులో నా శ్వాస ఉంది. ఇంతకీ నేనెవరు? పేరులేని త్యాగాల మధ్య నిశ్శబ్దంగా జీవించే వాడిని కాదు — తుఫాన్లను ఆపే తీరం, చీకట్లను తట్టుకునే దీపస్తంభం, కూలిపోకుండా కుటుంబాన్ని నిలబెట్టే అదృశ్య బలాన్ని. నేను సగటు మగవాడిని కాదు… ప్రేమను బాధ్యతగా మోసే ఒక నిశ్శబ్ద వీరుడిని రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

అరుగు

అరుగు ఇంటికి అందం, యజమానికి ఆనందం, యజమాని కంటే ముందే అతిథి గౌరవం. ఇంటి గౌరవం కాపాడే మౌన బంధం, అడుగుపెట్టగానే మనసు నిండే అనుబంధం. రాజు కూర్చుంటే అది సింహాసనం, పసిబిడ్డకు అది ఆటస్థలం. పండు ముదుసలికి విశ్రాంతి మందిరం, ఉబుసుపోక కూర్చుంటే బోలెడు కాలక్షేపం. రామాయణం, లోకాభిరామాయణం తరతరాలుగా వింటూనే ఉంది; నవ్వుల ప్రతిధ్వనులు, కన్నీటి చరిత్రలు నిశ్శబ్దంగా తనలో దాచుకుంది. గడిచిన కాలానికి గడియారం కాదు అది— జ్ఞాపకాలను కాపాడే నిలువెత్తు గ్రంథం. వచ్చినవారిని ఆహ్వానించి, వెళ్లినవారు గుర్తుంచుకునే  మనసులను మోసే మట్టి పలక . కాలం మారినా కదలని సాక్ష్యం, మనుషులు మారినా తగ్గని ఆత్మీయత. అడుగుల రాకపోకలే దీని శ్వాస అయితే, అరుగు అంటే… ఇంటి ముందు నిలిచిన జీవితం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279