ఎవరి తప్పు లేదు
ఎవరి తప్పులేదు " ఇదేమిటి దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. సాఫీగా నడుస్తున్న జీవితంలో ఒక పెద్ద పెను తుఫాన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వయసులో దీన్ని తట్టుకునేది ఎలా? ఈ ఆఖరి దశలో ఎవరు చూస్తారు. ఎవరు ఆదరణగా ఇంత ముద్ద పెడతారు. బాధ్యతలు అన్నీ అయిపోయాయి కదా. ఏదో కృష్ణ రామా అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్లి హాయిగా కాలక్షేపం చేద్దామనుకుంటే ఇలా హఠాత్తుగా వసుమతి మరణించడం నిజంగా తట్టుకోలేక పోతున్నాను అంటూ మంచం మీద పడుకుని పెద్దగా ఏడుస్తున్నాడు జగన్నాథ శర్మ. చూసే వాళ్ళందరికీ ఆ దృశ్యం హృదయవిదారకంగా ఉంది. నిజమే ఈ వయసులో భార్య చనిపోతే మగవాడికి చాలా కష్టం భార్య తోడు లేకుండా ఒక క్షణం కూడా గడవదు మగవాడికి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా లేచి భర్త కోసం ఆ గుప్పెడు మెతుకులు భార్య వండి పెడితేనే ఆ మగవాడికి తృప్తి అనుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కళ్ళు తుడుచుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. జగన్నాథ్ శర్మ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఆరుగురు ఆడ పిల్లలకి పెళ్లిళ్లు చేసి పురుళ్ళు పుణ్యాలు అన్ని పూర్తి చేసి సొంత ఊర్లో సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేద్దామని పట్నం నుంచి ఈ మధ్యనే ఆ ఊరికి వచ్చాడు...