పరంధామయ్య కథ
ఉదయం పన్నెండు గంటలు అయింది. “పోస్ట్…” అనే కేకతో వాలు కుర్చీలో పడుకుని కళ్ళు తెరిచిన పరంధామయ్యకి, పోస్ట్‌మాన్ ఒక శుభలేఖ అందించి వెళ్లాడు. “ఎవరిది అబ్బా ఈ శుభలేఖ?” కార్డు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. బాగా డబ్బున్న వాళ్లది అయి ఉంటుంది, అని అనుకుంటూ శుభలేఖ తెరిచి చూశాడు. పూర్తిగా చదివేసరికి — “అబ్బో! రవికి ఇంత పెద్ద కూతురు ఉందా!” అని లోలోపల సంబరపడ్డాడు. అంతలో వంటింట్లో నుంచి శారద బయటికి వచ్చింది. “ఎవరిదండి ఆ శుభలేఖ?” అని అడిగింది. “మా మేనల్లుడు రవి కూతురు పెళ్లిట. శుభలేఖ పంపించాడు,” అన్నాడు పరంధామయ్య ఆనందంగా. “వెళ్లి వస్తే బాగుంటుందేమో,” అని కూడా అన్నాడు. శారద నిట్టూర్చింది. “ఏదో పై వాళ్లల్లాగా శుభలేఖ పంపించి ఊరుకున్నాడు. ఏనాడైనా మన ఇంటికి వచ్చాడా? ఎప్పుడైనా ఫోన్ చేశాడా? కనీసం పెళ్లి కుదిరిందని కూడా చెప్పలేదు. వాళ్ల అమ్మానాన్న ఉన్నంతకాలం బంధుత్వాలు బానే మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మీ అక్క పిల్లలందరూ మేనమామను మర్చిపోయారు,” అంది నిష్టూరంగా. శారద మాటల్లో నిజం లేకపోలేదు అని పరంధామయ్యకి అనిపించింది. అయినా… రక్తసంబంధం కదా! ఇన్నాళ్లూ ఆ చేదు నిజాన్ని కడుపులోనే దాచుకున్నాడు. అంతలో గతం కళ్ల ముందుకు వచ...