పరంధామయ్య కథ


ఉదయం పన్నెండు గంటలు అయింది.

“పోస్ట్…” అనే కేకతో వాలు కుర్చీలో పడుకుని కళ్ళు తెరిచిన పరంధామయ్యకి, పోస్ట్‌మాన్ ఒక శుభలేఖ అందించి వెళ్లాడు.

“ఎవరిది అబ్బా ఈ శుభలేఖ?”

కార్డు చూస్తే చాలా పెద్దదిగా ఉంది.

బాగా డబ్బున్న వాళ్లది అయి ఉంటుంది, అని అనుకుంటూ శుభలేఖ తెరిచి చూశాడు.

పూర్తిగా చదివేసరికి —

“అబ్బో! రవికి ఇంత పెద్ద కూతురు ఉందా!” అని లోలోపల సంబరపడ్డాడు.

అంతలో వంటింట్లో నుంచి శారద బయటికి వచ్చింది.

“ఎవరిదండి ఆ శుభలేఖ?” అని అడిగింది.

“మా మేనల్లుడు రవి కూతురు పెళ్లిట. శుభలేఖ పంపించాడు,” అన్నాడు పరంధామయ్య ఆనందంగా.

“వెళ్లి వస్తే బాగుంటుందేమో,” అని కూడా అన్నాడు.

శారద నిట్టూర్చింది.

“ఏదో పై వాళ్లల్లాగా శుభలేఖ పంపించి ఊరుకున్నాడు. ఏనాడైనా మన ఇంటికి వచ్చాడా? ఎప్పుడైనా ఫోన్ చేశాడా? కనీసం పెళ్లి కుదిరిందని కూడా చెప్పలేదు. వాళ్ల అమ్మానాన్న ఉన్నంతకాలం బంధుత్వాలు బానే మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మీ అక్క పిల్లలందరూ మేనమామను మర్చిపోయారు,” అంది నిష్టూరంగా.

శారద మాటల్లో నిజం లేకపోలేదు అని పరంధామయ్యకి అనిపించింది.

అయినా… రక్తసంబంధం కదా!

ఇన్నాళ్లూ ఆ చేదు నిజాన్ని కడుపులోనే దాచుకున్నాడు.

అంతలో గతం కళ్ల ముందుకు వచ్చింది.

పరంధామయ్య తండ్రి రామయ్యకి ఇద్దరు సంతానం.

అక్క సీతమ్మ — పరంధామయ్య కంటే నాలుగేళ్లు పెద్దది.

చిన్నతనంలోనే సీతమ్మకి పెళ్లి జరిగింది. నలుగురు పిల్లల తల్లి అయి, పక్క ఊరిలో భర్త రాజయ్యతో కాపురం చేస్తూ ఉండేది. పిల్లలందరిలో పెద్దవాడు రవికుమార్.

పరంధామయ్యకి అక్కంటే పంచప్రాణాలు.

పండగలకి, పబ్బాలకి, పురుళ్లకి, పుణ్యాలకి — సీతమ్మ పుట్టింటికి వచ్చినప్పుడల్లా, పిల్లల బాధ్యతలో పరంధామయ్య కూడా భాగస్వామి అయ్యేవాడు.

తల్లి వయసు పైబడడంతో తరచూ చెప్పేది —

“ఒరేయ్ పరం… అక్క పిల్లలతో పని చేయలేకపోతున్నాను రా. మనం అక్కడికి వెళ్లలేం. ఇక్కడికి వచ్చినప్పుడు అయినా కాస్త విశ్రాంతి ఇద్దాం. నువ్వు పిల్లల్ని ఆడించు.”

అప్పటి నుంచి పిల్లల బాధ్యత అంతా పరంధామయ్యదే.

సీతమ్మ పిల్లలందరిలో పెద్దవాడు రవి.

సన్నగా, పొడవుగా ఉండేవాడు.

పరంధామయ్యని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేవాడు కాదు.

“మామా…” అని ప్రేమగా పిలిచేవాడు.

“నాకు బాత్రూంకి వెళ్ళాలి… నువ్వు కడుగుతావా?” అని అడిగితే పరంధామయ్యకి నవ్వు వచ్చేది.

ఎక్కడికి వెళ్లినా మావయ్యే కావాలి.

ఊర్లోకి వెళ్తే చేయి పట్టుకుని నడవాలి.

చెరువు కట్టకు తీసుకెళ్లినా, బజారుకి తీసుకెళ్లినా — ముందు రవి, వెనుక మిగతా పిల్లలు.

“మావయ్య… నన్నెత్తుకో,” అన్నప్పుడు, పరంధామయ్య ఆకలి కూడా మర్చిపోయి భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పేవాడు.

రాత్రిళ్లు —

“మావయ్య పక్కనే పడుకుంటా,” అని పట్టుబట్టేవాడు.

సీతమ్మ దగ్గరికి పంపినా, అర్థరాత్రి లేచి వచ్చి పరంధామయ్య చేతిని పట్టుకుని పడుకునేవాడు.

రవికి ఆస్తమా, జ్వరాలు వచ్చేవి. జ్వరం వస్తే రాత్రంతా పరంధామయ్య చంక దిగేవాడు కాదు.

సీతమ్మ పుట్టింట్లో ఉన్నన్నాళ్లు — సమయం ఎలా గడిచిందో పరంధామయ్యకి తెలియదు.

నిజమే…

ఏ కుటుంబంలో అయినా మేనమామ పాత్ర అలాగే ఉంటుంది.

కాలం గడిచింది.

శారదతో పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే తల్లిదండ్రులు మంచం పట్టి కాలం చేశారు.

తల్లి మంచంపై ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఎప్పటికీ పరంధామయ్య మనసులో మెదులుతూనే ఉన్నాయి —

“పరం… ఆడపిల్లకు ఎంత వయసు వచ్చినా పుట్టింటి మీద మమకారం ఉంటుంది. మేము పోయిన తర్వాత కూడా అక్క కుటుంబంతో సంబంధం కొనసాగించాలి రా.”

ఆ మాటలు తూచా తప్పకుండా పాటించాడు.

పండగలకి, పబ్బాలకి సీతమ్మ కుటుంబాన్ని పిలిచేవాడు.

“పిల్లలు పెద్దవాళ్లయ్యారు… చదువులు, పనులు…” అని సీతమ్మ చెప్పినా, వీలైనప్పుడల్లా వాళ్లను చూసి వచ్చేవాడు.

కాలక్రమేణా —

రవి అమెరికా వెళ్లాడు, చదువుకున్నాడు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు…

తర్వాత సీతమ్మ దంపతులు చనిపోయారు.

అంతే.

ఫోన్‌లు తగ్గాయి.

రాకపోకలు లేవు.

ఎవరు తప్పు అన్న ప్రశ్నకి — అందరి దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంటుంది.

వయసు మీద పడేంతవరకు పరంధామయ్య రక్తసంబంధం అనే పడవలో ప్రయాణించాడు.

ఆ తర్వాత… ఆ బంధాన్ని గుర్తుచేసే పెద్దవాళ్లు లేకపోయారు.

గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్న రవి లాంటి వాళ్లు మర్చిపోతే —

మనం ఎందుకు గుర్తు చేయాలి?

అని మౌనంగా మిగిలిపోయాడు పరంధామయ్య లాంటి మేనమామ.

ఇప్పుడేమో —

శుభలేఖ.

చేతిలో కార్డు పట్టుకుని చాలాసేపు అలాగే కూర్చున్నాడు.

బంగారు అక్షరాలు మెరుస్తున్నాయి.

పెళ్లి ముహూర్తం, వేదిక పేరు, ఫోటోలు — అన్నీ ఉన్నాయి.

కానీ అడుగున… కొత్త కొత్త పేర్లు.

కుటుంబంలో పెద్దవాడిగా, ఒక క్షణం మనసు బాధపడి మౌనంగా ఉండిపోయాడు.

పరంధామయ్య నుంచి సమాధానం రాకపోవడంతో శారద మళ్లీ వంటింట్లోకి వెళ్లిపోయింది.

ఇల్లు నిశ్శబ్దంగా మారింది.

అంతలో పరంధామయ్య నిర్ణయించుకున్నాడు.

“ఏమైతేనేం… వెళ్లాలి.

రక్తసంబంధం అలా ఊరుకోదు.”

మంచి చొక్కా తీసాడు.

పాత సంచి తెరిచాడు.

కొద్దిగా పొదుపుగా దాచుకున్న డబ్బు అందులో పెట్టాడు.

అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు —

ముడతలు పడ్డాయి…

కానీ ఆ మావయ్య ప్రేమ మాత్రం అలాగే ఉంది.

“రవి గుర్తుపడతాడా?”

“అతని పిల్లలు నన్నెవరో తెలుసుకుంటారా?”

అనే ప్రశ్నలు కలవరపెట్టినా —

“పిల్లల పెళ్లికి వెళ్లకపోతే మనిషినే కాదు,”

అని తన మనసుకే చెప్పుకున్నాడు.

బస్సు స్టాప్ వైపు నడుస్తూ —

ఆనాడు చిన్న రవి తన వేలు పట్టుకుని నడిచిన రోజులు,

“మావయ్య” అని పిలిచిన స్వరం —

మళ్లీ చెవుల్లో మోగాయి.

ఈ ప్రయాణం పెళ్లికే కాదు…

ఒక బంధాన్ని మళ్లీ తట్టిలేపడానికి.

కొన్ని బంధాలు తాత్కాలికంగా దూరమవుతాయి 

కానీ పిలిస్తే మళ్లీ వెతుక్కుంటూ వెళ్తాయి పరంధామయ్య మనసు ఉంటే.


తల్లి తర్వాత తల్లి అంతటివాడు మేనమామ. మధ్యలో వచ్చే బంధాలు మూలాన్ని ఈ రక్తసంబంధం మరుగున పడిపోతోంది చాలా కుటుంబాల్లో. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. 


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం