అమ్మ -ఆవకాయ
ఎండాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం నాకు గుర్తుకు వచ్చేది మా అమ్మ పెట్టే ఆవకాయి. నా చిన్నతనంలో మా తోటలో ఆవకాయ కోసం ప్రత్యేకంగా ఒక చెట్టు ఉండేది. అలాగే మాగాయ కోసం కూడా ప్రత్యేకంగా చెట్లు ఉండేవి. ఏనాడో మా తాతగారు వేసి పెంచిన చెట్లవి. ఆ కాలం వారికి ముందుచూపు ఎక్కువ. బతికున్న రోజుల్లో వారు పండ్లు తిన్నారా లేదో తెలీదుగానీ మా తరం వారు మాత్రం అన్ని రకాల పండ్ల రసాలను రుచి చూడడం జరిగింది. చెరుకు రసం కాయలతో బెల్లపు ఆవకాయి, చిన్న రసం కాయలతో మాగాయి ,ఇంకా పచ్చ ఆవకాయ్ మామూలు ఆవకాయి కోసం ప్రత్యేకమైన కాయలు ఉండేవి. ఆవకాయ పెట్టుకోడానికి మామిడి కాయ తోపాటు ఆవాలు ఉప్పు కారం మరియు నూనె ప్రధానంగా కావాల్సిన సరుకులు. ఆవకాయ కోసం ప్రత్యేకం గా కొన్న మిరపకాయలు రోకళ్లు తో దoపించేవారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్త్రీల చేత ఈ పని చేయించేవారు. అందులో ఒక నాయకురాలు పేరు శేషమ్మ. దంపుళ్ళ శేషమ్మ అనేవారు. కళ్ళలో నీళ్ళు కారుతున్నా అవిశ్రాంతంగా వారు కారం ఉప్పు ఆవాలు విడివిడిగా దంచి జల్లెడ పట్టి డబ్బాలో పోసి ఉంచేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో పాటు మా అమ్మ గారు, పిన తల్లి గారు అలుపు సొలుపు లేకుండా ఒకపక్క వండ...