అమ్మ -ఆవకాయ

ఎండాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం నాకు గుర్తుకు వచ్చేది మా అమ్మ పెట్టే ఆవకాయి. నా చిన్నతనంలో మా తోటలో ఆవకాయ కోసం ప్రత్యేకంగా ఒక చెట్టు ఉండేది.
అలాగే మాగాయ కోసం కూడా ప్రత్యేకంగా చెట్లు ఉండేవి. ఏనాడో మా తాతగారు వేసి పెంచిన చెట్లవి.
ఆ కాలం వారికి ముందుచూపు ఎక్కువ. బతికున్న రోజుల్లో వారు పండ్లు తిన్నారా లేదో తెలీదుగానీ మా తరం వారు మాత్రం అన్ని రకాల పండ్ల రసాలను రుచి చూడడం జరిగింది. చెరుకు రసం కాయలతో బెల్లపు ఆవకాయి, చిన్న రసం కాయలతో మాగాయి ,ఇంకా పచ్చ ఆవకాయ్ మామూలు ఆవకాయి కోసం ప్రత్యేకమైన కాయలు ఉండేవి.
ఆవకాయ పెట్టుకోడానికి మామిడి కాయ తోపాటు ఆవాలు ఉప్పు కారం మరియు నూనె ప్రధానంగా కావాల్సిన సరుకులు.

ఆవకాయ కోసం ప్రత్యేకం గా కొన్న మిరపకాయలు
రోకళ్లు తో దoపించేవారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్త్రీల చేత ఈ పని చేయించేవారు. అందులో ఒక నాయకురాలు పేరు శేషమ్మ. దంపుళ్ళ శేషమ్మ అనేవారు.
కళ్ళలో నీళ్ళు కారుతున్నా అవిశ్రాంతంగా వారు కారం ఉప్పు ఆవాలు విడివిడిగా దంచి జల్లెడ పట్టి డబ్బాలో పోసి ఉంచేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో పాటు మా అమ్మ గారు, పిన తల్లి గారు అలుపు సొలుపు లేకుండా ఒకపక్క వండి వార్చి పెడుతూ వారికి కూడా సహాయం చేసేవారు. గంపెడు సంసారం ఏం చేస్తారు మరి. ఈ కాలం తో పోల్చి చూసుకుంటే ఆ మాతృమూర్తులు పడిన కష్టం చూసి నాకు చాలా బాధగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉన్నా ఈ కాలం వారికి సహనం ఓపిక తక్కువ. 
ఆవకాయకి పనికి వచ్చే కాయ ముదిరింది లేదో చూసుకుని ఆవకాయ్ పనులు మొదలెట్టే వారు. ఆవకాయ భద్రపరచడానికి మట్టి కుండలు శుభ్రంగా కడుక్కొని ఎండలో తడి లేకుండా ఆరబెట్టి వారు. కుండ కుదురుగా ఉండడానికి చుట్ట కుదుళ్లు సంత నుండి తెప్పించేవారు.
ఊర్లో ఉన్న గానుగ నుండి గానుగు నూని తెచ్చుకుని ఉదయాన్నే తోట లోకి వెళ్లి మామిడి కాయల కోత ప్రారంభించేవారు. మామిడి కాయలు కోతకు ఉపయోగించే కర్రని గెడ చిక్కo అనేవారు . చిటారు కొమ్మన ఉన్న మిఠాయి పొట్లం కూడా చిక్కానికి చిక్కేది.
ఆ రోజుల్లో మామిడి చెట్లకి తేనెపట్టు ఎక్కువగా పట్టే వి.
తేనె పట్టు ఉన్న కొమ్మని ముట్టుకోకుండా మిగిలిన కొమ్మల కాయలు కోసుకుని గుండిగలో నీళ్లు పోసి అందులో నాన పెట్టేవారు. మధ్యాహ్నo వేళ టీ కాఫీలు తాగి పిల్లలందరూ మామిడి కాయలు తుడిచి ముక్కల కోయడానికి రెడీగా పెట్టేవారు.
మామిడి కాయలు ముక్కలుగా తరగడానికి పెద్ద కత్తి పీట వేసుకుని మా బాబాయ్ గారు రెడీ గా ఉండేవారు. కొందరు మరకత్తి పీట తో కూడా ముక్కలు తరుగుతారు.
మా ఇంట్లో మాత్రం ఆది నుంచి కత్తిపీట తో తరిగేవారు.
అలవాటు లేకపోతే మరకత్తి పీటతో ముక్క నలిగిపోతుంది.
 ఆయన ముక్కలు తరిగిన తర్వాత పిల్లలందరూ జీడి తీసివేసి ముక్కల్ని శుభ్రంగా గుడ్డతో తుడిచి పళ్లెం లో రెడీగా ఉంచేవారు.ఈ లోగా మా అమ్మ స్నానం చేసి మడిగట్టుకొని తూర్పుగా తిరిగి దైవ ప్రార్థన చేసి ఆవకాయ ముక్కల్ని కొలతల ప్రకారం కారం ఉప్పు ఆవపిండి పొడి కలిపి కుండలో వేసి నిర్ణీత ప్రదేశంలో భద్రపరిచి ఊపిరిపీల్చుకునే వారు.. ఒకే రోజు పచ్చ ఆవకాయ బెల్లం ఆవకాయ మామూలు ఆవకాయ పెట్టేవారు. ఈ కార్యక్రమంలో మా పిన్ని గారు మా అమ్మగారికి తోడుగా ఉండేవారు. ఇద్దరు మాతృమూర్తులు కలిసిమెలిసి పని చేసుకునేవారు.

మరునాడు మాగాయ కాయ కోసి నీళ్ళల్లో నానబెట్టి పిల్లలందరం గుడ్డతో తుడిచి ఆల్ చిప్పలతో మామిడి కాయ తొక్క తీసి ఇచ్చే వాళ్ళo. ఆ పని ఆ రోజుల్లో చాలా సరదాగా ఉండేది. పదిమంది కలిసి కూర్చుని పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండేది కాదు. అలా పెద్దవాళ్ళు పిల్లలకు పనులు నేర్పారు. మా తరానికి బృందంతో కలిసి పనిచేయడం అలా అలవాటయింది. చెక్కు తీసిన కాయలని ముక్కలుముక్కలుగా కత్తి పీట తో కోసి ఉప్పుతో కలిపి కుండలో పోసేవారు. అలా వారం పది రోజులు లు వేసవికాలంలో మండుటెండలో వూరగాయలు అప్పడాలు వడియాలు పెట్టి రాబోయే కాలం కోసం భద్రపరిచేవారు. 
మధ్యాహ్నం పూట మా మాతృమూర్తులు నిద్రపోకుండా
ఎండలో పెట్టిన కూరగాయల్ని కాపలా కాసేవారు. అవి తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది. 

ఆవకాయ పెట్టిన మూడో రోజు నుండి తినడం ప్రారంభించే వాళ్ళం. మా అమ్మగారి చేతి మహత్యం ప్రతి ఏడాది ఆవకాయ అద్భుతంగా ఉండేది. సాయంకాలం పూట ఆకలి వేస్తే బెల్లం ఆవకాయ కలిపి తినే వాళ్ళo. దానికి తోడు ఇంట్లో పండిన పాపయ్య రాజు గోవా మామిడి పళ్ళు
గడ్డపెరుగు. తలుచుకుంటేనే నోరూరిపోతుంది. పంటి కింద పిండి వడియo ముక్క. అరుగు మీద తువ్వాలు వేసుకుని పడుకుంటే ప్రకృతి నుండి వచ్చే గాలి ఏ లోకమో తీసుకుని వెళ్ళి పోయేది.

ఇక గుమ్మంలోకి ఎవరైనా వచ్చే అవకాయ అడిగితే లేదు అనకుండ ఇచ్చి పంపేవారు. ఇరుగుపొరుగు వారికి రుచి చూడమని పంపించేవారు. అలా చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మంచి సంబంధబాంధవ్యాలు ఉండేవి. అసూయతో కాదు అనుబంధాలతో జీవితం గడిపేవారు. ధనిక పేద తారతమ్యాలు లేవు. అందుకే నా జన్మభూమి పల్లెపాలెం అంటే నాకు చాలా ఇష్టం.

కాలం మారిపోయింది. మామిడి తోటల పోయి మహా భవంతులు వెలిశాయి. మనిషికి ఓపిక కూడా తగ్గింది.
ఆరోగ్యరీత్యా  
వాడకం తగ్గింది. కావలసినప్పుడల్లా కాళ్లు రెడీమేడ్ ఫుడ్స్ వేపు దారితీస్తున్నాయి. ఏం చేస్తాం కాలం కూడా మనం పరిగెడుతున్నాo.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
సామర్లకోట 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం