నాన్న

నాన్న ఓ అభయ హస్తం.
నాన్న అంటే ఒక నిస్వార్ధం
నాన్న ఒక మార్గదర్శి.
ఆఫీసులో బండెడు చాకిరీ చేసి ఇంటికి వచ్చి నవ్వుతూ పిల్లలు పలకరించేవాడు నాన్న
తన జేబు ఖాళీగా ఉన్నా పిల్లల గొంతెమ్మ కోరికలు నిరంతరం తీర్చే వాడే నాన్న.
తను సైకిల్ మీద ఉసూరుమంటూ ఆఫీస్ కి వెళ్తున్నా తన పిల్లల కోసం స్కూటీలు కొనిచ్చి వాడే నాన్న.

తాహతుకు మించిన ఫీజులు పెట్టి గురుకుల విద్య నేర్పి
తల తాకట్టు పెట్టి పరదేశంలో విద్య నేర్పించి ఉపాధి కల్పించి గ్రీన్కార్డు వచ్చిందంటూ పిల్లలు చెప్పే టాటాలు తో మురిసిపోతూ తన బ్రతుకు పల్లెటూరి కొంప లోనే వెళ్లదీస్తూ చాలీచాలని పెన్షన్ రాళ్లతో పచ్చడి మెతుకులు పరమానందంగా తింటూ అన్ని కూరలు ఆరోగ్యానికి సరిపడవు అంటూతన లేనితనాన్ని కప్పి పుచ్చుకుంటూ గుంభనంగా జీవితాన్ని సాగించే వాడే నాన్న. 

రెండు లేదా మూడు సంవత్సరాల కోసారి పరదేశం నుండి వచ్చే మనవలు కోసం ఏసీ కొనమనిచెప్పే భారీ మాటలని, భార్య మాటలని సున్నితంగా తోసిపుచ్చి ఎందుకు మన అరుగు మీద మడత మంచం వేసుకుని పడుకుంటే చల్లని గాలి వేస్తుంది అంటూ చెప్పిన మాటలు నాకు నాన్నలో ఓ పొదుపరి కనిపిస్తాడు. చరిత్ర నాన్న పాత్రకి ద్వితీయ స్థానం కల్పించినా భార్యకి తన భర్త పిసినారిగా కనిపించినా సంసార రధాన్ని వీధిలో పడకుండా ఈడ్చేవాడు నాన్నే కదా.
 తన పిల్లల్ని సైకిల్ మీద ఎక్కించుకుని బజారులో వెళుతూ దారిలో కనిపించిన ముష్టి వాళ్లకి తన జేబులోంచి దొరికిన దానిని దానంగా వేసే నాన్న లో నాకు ఒక దాన కర్ణుడు కనిపిస్తాడు. పిల్లలు ఎక్కడ నుంచి నేర్చుకుంటారు తండ్రి నుంచే కదా. 
. ఎప్పుడు ఖద్దరు చొక్కా లో కనిపించే నాన్నని ఒక మంచి సిల్కు చొక్కా కొనుక్కోమని అడిగితే ఎందుకు రా నా వంటికి పడదు అంటూ చెప్పే నాన్న లో ఒక అతి సాధారణ వ్యక్తి కనిపిస్తాడు .
 చాలీచాలని జీతంతో సంసారాన్ని లాగుతూ రోగాలు రొచ్చులు పెళ్లిళ్లు పేరంటాలు మందులు మాకులు ఖర్చులకోసం తను దాచుకున్న పీఎఫ్ డబ్బులు కూడా ఖర్చుపెట్టే నాన్న ఓ నిస్వార్థ పరుడు. 

తన పిల్లల భవిష్యత్తు కి నిరంతరం ప్రణాళికలు వేస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడే నాన్న నిజంగా ఓ మార్గదర్శి.

 తన ఆదాయ వ్యయాలను రెండు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తన సంసారపు బడ్జెట్ను చక్కగా నిర్వహిoచే నాన్న ఓ గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త.

తన మనసులో ఉన్న భావోద్వేగాలను అంత సులువుగా బయట పెట్టుకోలేక బయటకు చాలా గంభీరంగా కనిపిస్తూ ఆ స్పందనని తన ముఖంలో కనపడనివ్వని వ్యక్తి నాన్న.

నాన్న పాత్ర మీద ఎన్నో చలన చిత్రాలు కూడా వచ్చాయి అందులో ఆ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ప్రకాష్ రాజు గారు నాన్న పాత్ర పోషించారు.అభినయం ఎంతో బాగుంది. నిజంగా ఇటువంటి పాత్రని దర్శకుడు నిజ జీవితంలో ఎక్కడో ఒకచోట చూసే ఉంటారు అని నా అభిప్రాయం. నాన్న , నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు కూడా నాన్న పాత్రను ఎంతో బాగా చూపించాయి..

ఏదేమైనా మన జీవితాల్లో విలక్షణమైన పాత్రను పోషించే గొప్ప వ్యక్తి నాన్నని అంగీకరించక తప్పదు 
 
తండ్రి మనసులో ఏముందో గ్రహించుకుని అందుకు అనుగుణంగా నడిచే కొడుకు ఉండడం ప్రతి తండ్రి అదృష్టమే.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట