కలలు కన్న రాజ్యం
ఉదయo ఎనిమిది గంటలు అయింది. ఆకాశమంత దట్టంగా మబ్బులు పట్టి ఉంది. ఉదయం నుంచి ఒకటే ఈదురుగాలులు . గత రెండు రోజుల నుంచి బంగాళాఖాతంలో తుఫాను హెచ్చరికలు రేడియోలో టీవీలు గంట గంటకి వినిపిస్తున్నాయి.ఈ సమయంలో తుఫాన్లు ఏమిటి విపరీతకాలం కాకపోతేను .ఇదివరకు వర్షాకాలంలోనే వచ్చేవి. ఇప్పుడు కాలంతో పనిలేదు. ఏమిటో పంటలన్నీ కోతకు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కనక తుఫాను వస్తే రైతులు మట్టి కొట్టుకుపోతారు. పైగా ఇది గోదావరి నది ఒడ్డు పక్కన ఉన్న పల్లెటూరు. వర్షం వస్తే గోదావరి కూడా వరదలు వస్తాయి. గత ఏడాది వచ్చిన వరదలకే ఇంకా ప్రజలు తేరుకోలేదు. ఎంత ప్రాణ నష్టం జరిగింది . పంటలన్నీ పాడైపోయా యి. పశువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేయి. ప్రభుత్వ సహాయం అందేటప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది అనుకొని భయపడుతూ ఆ వీధి అరుగు మీద కూర్చుని విద్యార్థులకి వేద పాఠాలు చెబుతున్నారు చలపతి శాస్త్రి గారు. పరోపకారార్ధం ఇదం శరీరం అనే సూక్తిని గట్టిగా నమ్మిన వ్యక్తి చలపతి శాస్త్రి గారు. పైగా అగ్రహారంలో ఉండే వేద పండితుల్లో ఒకరు. వారసత్వంగా వచ్చిన ఆస్తి, పెద్ద ఇల్లు పదిమందితో కలిసి పోయే మంచితనం, స్నేహ తత్వం, కులమతాలు అంటే పెద్...