చిలిపి పనులు
అర్ధరాత్రి 12 గంటలు అయింది. వీధి తలుపు ఎవరో కొడుతుండడంతో గాఢ నిద్రలో ఉన్న గోవిందరావుకి మెలకువ వచ్చింది. "ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ!" అనుకుంటూ తలుపు సందులో నుంచి బయటకు తొంగి చూసాడు. వీధిలో పదిమంది యువకులు నిలబడి ఉన్నారు. "ఎవరండీ? ఏం కావాలి?" అంటూ ప్రశ్నించాడు గోవిందరావు. "చలపతిరావు గారు పంపించారండి. ఎవరికో పురుడు వచ్చిందిట. ఇంగువ తీసుకురమ్మని పంపించారంటూ చెప్పారా" అని యువకులు. "వస్తున్నాను, ఉండండి. కొట్టు తీస్తాను," అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు గదిలోకి వెళ్లి లైట్ వేసి డబ్బా గురించి వెతకడం మొదలెట్టాడు గోవిందరావు గోవిందరావు అంటే ఆ ఊర్లో ఉన్న ఏకైక కోమటి. కిరాణా కొట్టు వ్యాపారం – అక్కడ లేని సరుకు ఉండదు. కానీ అన్ని హై రేట్లు. ఏ వేళ లేపినా సరుకు అప్పిస్తాడు. 'లేదు' అనకుండా కిరాణా కొట్టు మీద ఆ ఊర్లో పది ఎకరాలు భూమి సంపాదించాడు. దానికి తోడు తాకట్టు–వాకట్టు వ్యాపారం కూడా ఉంది. అంతా వ్యవసాయదారులు. ఇంకేముంది! వ్యవసాయం పనుల కోసం అప్పు తీసుకుని, పంటలు రాగానే తీర్చేస్తుంటారు. పైగా ధాన్యం కొనుగోలు కూడా ఆయనే. "మా ఊరుకి బ్యాంక్ లాంటివాడు" అని...