స్నేహం ముసుగులో
ఇదే రామకృష్ణ ఇల్లు అనుకుంటా! ఏమి మార్పు లేదు. అప్పట్లోనే పడిపోతున్నట్టుగా ఉండేది. కొద్దిగా రిపేర్లు చేయించినట్టున్నారు. ఊరంతా మారిపోయింది. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేశారు. తారు రోడ్లు వేశారు. పూరిపాకలు తక్కువగా కనబడుతున్నాయి. అవును, ఇది రామకృష్ణ ఇల్లే. ఇంటి ముందు దుమ్ము కొట్టుకుపోయిన మగ్గం అలాగే ఉంది. అవతల అరుగు మీద ఎన్నిసార్లు ఆడుకున్నామో! ఎన్నాళ్ళయిందో వాడిని చూసి… అసలు నన్ను గుర్తుపడతాడా లేదా? ఎప్పుడో చిన్నప్పుడు ప్రతి ఏటా అమ్మమ్మని చూడడానికి వచ్చినప్పుడు ఎక్కువగా వీడితోటే ఆడుకునేవాడిని. నా కంటే రెండేళ్లు పెద్ద. అప్పట్లోనే వాళ్ల నాన్నకి సాయం చేసేవాడు. నేను వచ్చానంటే వాళ్ల నాన్న – "ఆడుకో!" అంటూ పంపించేవాడు. పాపం, వాళ్ల నాన్న మగ్గం నడిపితే గాని బ్రతుకు గడిచేది కాదు. ఒక్కసారి పాత జ్ఞాపకాల్లోంచి బయటకి వచ్చి, "రామకృష్ణ!" అని గట్టిగా పిలిచాను. "లేరండి, బయటకి వెళ్లారు!" – ఎవరిదో పిల్లల గొంతు వినిపించింది. "నా పేరు ప్రవీణ్. నీవు, నేను రామకృష్ణ ఫ్రెండ్స్. అమెరికా నుంచి వచ్చాను" అని చెప్పండి అని పిల్లాడితో చెబుతూనే వెనక్కి తిరిగి వెళ్తుండగా, తలుపు తెరచిన చప...