భగీరథ ప్రయత్నం
భగీరథ ప్రయత్నం. "ఏమమ్మా సీతమ్మ మీ వాడికి ఇంకా సంబంధం చూడడం లేదా! అని అడిగింది పక్కింటి కాంతమ్మ. లేదమ్మా! మా వాడు అప్పుడే పెళ్లి చేసుకోను అంటున్నాడు! అంది సీతమ్మ. కాంతమ్మకు తెలుసు సీతమ్మ కొడుకుకి సంబంధాలు ఎక్కడా కుదరట్లేదు అని. సీతమ్మకు ఒక్కడే కొడుకు. పేరు ప్రవీణ్. ఆరడుగుల అందగాడు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చి నాలుగేళ్లయింది. క్యాంపస్ సెలక్షన్ అని ఎగిరి గంతేసుకుని జాయిన్ అయిపోయాడు పాపం. ప్రవీణ్ ని పెళ్లి చేసుకోమంటే జీతం నా ఒక్కడికే చాలటం లేదు అని వాయిదాలు వేసినా సీతమ్మ తన ప్రయత్నాలన్నీ గట్టిగా చేస్తూనే ఉంది. ప్రవీణ్ ఉద్యోగంలో చేరగానే ముందుగా ఒకరోజు స్టూడియోకి తీసుకెళ్లి అందమైన ఫోటో తీయించి వివాహ వేదికలో ఫీజులు కట్టేసి ప్రవీణ్ వివరాలను నమోదు చేసేసింది. ఇంకేముంది రోజుకో ఫోన్. పిల్ల తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్తూ ఆఖరికి ప్యాకేజీ దగ్గరకు వచ్చేటప్పటికి నీరు కారిపోయి ఫోన్ పెట్టేసి మళ్లీ ఏ కబురు ఉండేది కాదు వాళ్ల దగ్గర నుంచి. చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత సీతమ్మ మళ్లీ ఫోన్ చేస్తే అబ్బాయి జాతకం నచ్చలేదండి! అని మొహ...