భాధ్యత
ఉదయం 5 గంటలు అయింది. ఎప్పుడూ ఐదు గంటలకు కాఫీతో పలకరించే కేర్ టేకర్ లక్ష్మీ ఇవాళ ఇంకా కనపడలేదు. ఏమిటి? ఏం చేయాలి అబ్బా! బీపీ మందు వేసుకోవాలి. మొహం కూడా కడుక్కోలేదు. ఏమిటో, నీరసంగా ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఎవరు పిలిచినా పలకరు. రాజేష్ ఫోన్ తీయట్లేదు. వాడు ఇంకా నిద్ర లేచాడో లేదో. ఏమిటో ఈ వయసులో ఈ కర్మ అనుకుంటూ, అలాగే నెమ్మదిగా మంచం దిగి డేకుతూ, మొహం కడుక్కుని, నేల మీద ఉన్న స్టవ్ మీద పాలు పెట్టి, కాఫీ కాచుకుని తాగింది కాంతమ్మ. "కొడుకు ఒక మంచి పని చేశాడు. ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంచినా స్టవ్ సామాన్లు కూర్చుంటే అందేలా పెట్టాడు" అని అనుకుంది కాంతమ్మ. అయినా, ఎప్పుడూ ఈ కేర్ టేకర్ ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్లలేదే! ఇవాళ ఏమైందో ఏమో! మార్కెట్కు గాని వెళ్ళిందా, అయినా చెప్పి వెళ్తుంది కదా! ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. పోనీ, రాజేష్ కి విషయం చేద్దాం అంటే వాడు ఫోన్ తీయట్లేదు. ఏమిటో, వాడు కళాకళల మనిషి. కోపంగా ఉంటే ఫోన్ తీయడు. వాడికి కోపం వస్తే, "అమ్మ" అనే సంగతి మర్చిపోతాడు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? రాజేష్ నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. ఎంత బాగా చూసుకునే వారు. నేల మీద కాలు పెట్టనిచ్చేవారు కాద...