కాఫీ తాగారా
కాఫీ తాగారా! " దిక్కుమాలిన అలవాటయింది! ఇలా మొహం కడుక్కుంటున్నారో లేదో అలా కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చిందులు తొక్కుతారు అంటూ ప్రతిరోజులాగే దండకం చదివి కాఫీ కప్పు అక్కడ పెట్టింది మా శ్రీమతి రాజ్యలక్ష్మి. కాఫీ రుచి ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ కాఫీ తాగదు. 'కప్పు కాదండి పెద్ద స్టీల్ గ్లాస్. ఆ గ్లాస్ తో కాఫీ తాగకపోతే కాఫీ తాగినట్టు ఉండదు. ఇంకా నయం మా తాతగారు ఒకాయన పెద్ద చెంబుతో కాఫీ తాగేవాడుట. అయితే మేము మటుకు తక్కువేముంది . ఒక్కసారి తాగే బదులు నాలుగు సార్లు తాగుతున్నాం. ఇంట్లో ఉంటే ఏ బెంగ ఉండదు. ఎన్ని తిట్లు తిట్టినా వేళకు కాఫీ వచ్చి పడిపోతుంది. మరి ఎక్కడికైనా వెళ్తే మనకా ఉదయం లేచి కాఫీ తాగడం అలవాటు. అవతల వాళ్ళు లేస్తారా! లేచిన వెంటనే కాఫీ ఇస్తారా! అనేది ఒక పెద్ద బెంగ. సరే పెళ్లిళ్లకి ఫంక్షన్లకి వెళితే ఆ కాఫీ తాగితే ఏడుపొస్తుంది . డోసు తక్కువ రుచి నేను వర్ణిస్తే బాగుండదు. మా చిన్నతనంలో పొయ్యి మీద కాచిన కాఫీ ఎంత రుచికరంగా ఉండేది. ఇప్పుడు కాఫీ మేకర్లు వచ్చేసి పని సులువు అయింది గానీ సరుకు రుచి మరి ఏమో! ఉదయం లేచిన దగ్గర్నుంచి మామూలుగ...