పండుగ మామూలు
ఉదయం 6:00 అయింది అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి గట్టిగా అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఆ గొంతు ప్రెసిడెంట్ గారిది లా ఉంది అనుకుంటూ బాల్కనీ నుంచి కిందకు తొంగి చూశాను. సాక్షాత్తు మా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన ముక్కోపి. ఇండియాకు ప్రెసిడెంట్ గా ఫీల్ అయిపోతుంటాడు ఇంత పొద్దున్నే ఎవరబ్బా ఆయనకు బలి అయిపోయింది అనుకుంటూ చూస్తే ఎదురుగుండా మున్సిపాలిటీ వాళ్ళ ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అపార్ట్మెంట్ ఎదురుగుండా రోడ్డుమీద రోజు వ్యర్థ పదార్థములు తీసుకువెళ్లే ట్రాక్టర్ నిలిపి ఉంది. ఓహో అయితే ఈ మనిషి ప్రతాపం ఈవేళ పాపం రోజు వ్యర్థ పదార్థాలు తీసుకుని వెళ్లే మున్సిపాలిటీ వాళ్ళ మీద అన్నమాట. మా అపార్ట్మెంట్లో మొత్తం యాభై ప్లాట్లు ఉంటాయి. మాది భాగ్యనగరంలో ప్రగతి నగర్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ కట్టి పదిహేను ఏళ్లయింది. ప్రతిరోజు మన శరీరం లాగే మనం నివసించే ఇల్లు కూడా వ్యర్థ పదార్థాలను ఇంట్లో ఉంచుకోదు. కాదు కాదు మనం ఆ ఇంట్లో ఉండలేం. కంపు భరించలేక అనారోగ్యాలు తెచ్చుకోలేక. ప్రతిరోజు ప్రతి ప్లాట్ నుంచి సుమారుగా రెండు డబ్బాలు చెత్త వస్తుంది. ప్రతిరోజు రా...