పెద్ద సమస్య
పెద్ద సమస్య అది నగరంలోని పెద్ద పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రి లోని ఎమర్జెన్సీ వార్డ్. పదో నంబరు బెడ్ చుట్టు డాక్టర్లు నర్సులు బెడ్ చుట్టూ చేరి తన తమ పనుల్లో హడావిడిగా ఉన్నారు. పేషంట్ బంధువులుమాటిమాటికీ ఆందోళనగా వార్డులోకి తొంగి చూస్తున్నారు. ఇంతలో తెల్ల కోటు వేసుకొన్న పెద్ద డాక్టర్ గారు వార్డులోంచి బయటకు వచ్చి సీరియస్ గా తన గదిలోకి వెళ్ళిపోయారు. లోపల వార్డులో పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. డాక్టర్ గారు రూములోంచి నర్సు బయటకు వచ్చి పదో నంబరు బెడ్ రామారావు గారు తాలూకు ఎవరైనా ఉన్నారా అంటూ నాకేసి ప్రశ్నార్థకంగా చూసింది. అవునండి నేనే అంటూ ముందుకు వెళ్లాను. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి రండి అంటూ రూము తలుపులు తీసింది.నన్ను చూడగానే డాక్టర్ గారు వెరీ సారీ అంటూ సీట్లోంచి లేచి సిస్టర్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత బాడీని వీరికి అప్పగించండి అంటూ బయటకు వెళ్ళిపోయారు. ఒకసారి కాళ్ల కింద భూమి కదిలినట్లయ్యింది. దుఃఖం ఆగలేదు. అలాగే ఏడుస్తూ బల్ల మీద కూర్చుండిపోయాను. నాన్న హార్ట్ ఎటాక్ తో ఆస్పత్రిలో చేరి మూడు గంటలకు కూడా కాలేద...