పెద్ద సమస్య
పెద్ద సమస్య
అది నగరంలోని పెద్ద పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రి లోని
ఎమర్జెన్సీ వార్డ్. పదో నంబరు బెడ్ చుట్టు డాక్టర్లు నర్సులు బెడ్ చుట్టూ చేరి తన తమ పనుల్లో హడావిడిగా ఉన్నారు. పేషంట్ బంధువులుమాటిమాటికీ ఆందోళనగా వార్డులోకి తొంగి చూస్తున్నారు.
ఇంతలో తెల్ల కోటు వేసుకొన్న పెద్ద డాక్టర్ గారు వార్డులోంచి బయటకు వచ్చి సీరియస్ గా తన గదిలోకి వెళ్ళిపోయారు.
లోపల వార్డులో పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఎవరిని లోపలికి రానివ్వడం లేదు.
డాక్టర్ గారు రూములోంచి నర్సు బయటకు వచ్చి పదో నంబరు బెడ్ రామారావు గారు తాలూకు ఎవరైనా ఉన్నారా అంటూ నాకేసి ప్రశ్నార్థకంగా చూసింది. అవునండి నేనే అంటూ ముందుకు వెళ్లాను. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి రండి అంటూ రూము తలుపులు తీసింది.నన్ను చూడగానే డాక్టర్ గారు వెరీ సారీ అంటూ సీట్లోంచి లేచి సిస్టర్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత బాడీని వీరికి అప్పగించండి అంటూ బయటకు వెళ్ళిపోయారు. ఒకసారి కాళ్ల కింద భూమి కదిలినట్లయ్యింది. దుఃఖం ఆగలేదు. అలాగే ఏడుస్తూ బల్ల మీద
కూర్చుండిపోయాను. నాన్న హార్ట్ ఎటాక్ తో ఆస్పత్రిలో చేరి మూడు గంటలకు కూడా కాలేదు అప్పుడే ఇలా ఈ లోకం విడిచి వెళ్లిపోతాడని కలలో కూడా ఊహించలేదు.
ఇంటి దగ్గర ఉన్న అమ్మకి ఏం సమాధానం చెప్పగలను అంటూ నాలోనే నేను మదనపడుతూ దుఃఖాన్ని ఆపకుంటూ జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచనలో మునిగిపోయాను
ఇంటి దగ్గర ఉన్న భార్యకు విషయం చెప్పి మౌనంగా రోధిస్తూ ఉండిపోయాను . నర్సులు డాక్టర్లు యధావిధిగా తన పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. జనన మరణాలతో వీరికి సంబంధం లేదు. ఆస్పత్రి అంటేనే నరకం. ఒక గదిలో ఈ లోకంలోనికి కొత్తగా వచ్చిన వాళ్ళు. మరొక గదిలో ఈ లోకం నుండి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు. అందర్నీ తన గుండెల్లో పెట్టుకుని తన పని తాను చేసుకుంటూనే పోతుంది.
రామారావు గారు గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిరుద్యోగి. ఒక్కడే కొడుకు. కొడుకు రమేష్ ఉన్నత చదువులు చదివి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీపెట్టిభాగ్యనగరంలోబాగాసంపాదిస్తున్నాడు. గేటెడ్ కమ్యూనిటీలో ఒక పెద్ద ప్లాటు కొనుక్కుని కాపురం ఉంటున్నాడు. రామారావు గారు కూడా ఈ మధ్యనే రిటైర్ అయ్యి భార్యతో సహా భాగ్యనగరం వచ్చేసాడు.
అపార్ట్మెంట్లో సకల సౌకర్యాలు ఉన్న అందరూ శ్రీమంతులు కావడం చేత ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. నెలకోసారి జరిగే కమిటీ మీటింగ్లకి మాత్రమే హాజరవుతారు. శుభ కార్యము జరిగిన అశుభకార్యం జరిగిన చివరి వరకు తెలియదు. ఎందుకంటే శుభకార్యం జరిగితే ఫంక్షన్ హాల్ లోనే చేస్తారు. ఇంటిదగ్గర ఆనవాళ్లు ఏమి ఉండవు. ఎవరైనా చనిపోతే అసలు అపార్ట్మెంట్ దగ్గరకు తీసుకురావడానికి ఒప్పుకోరు.
అటు ఆసుపత్రి నుంచి డైరెక్ట్ గా స్మశానానికి తీసుకెళ్లే పరిస్థితులు కనీసం ఎవరూ పలకరించడానికి కూడా ముందుకు రా రు. చాలామందికి శవం అంటే భయం . ఇంటికి తీసుకొస్తే ఇల్లు మైల పడిపోతుందని చాందస భావం.రోజు రోడ్డు మీద ఎంతోమందిని తగులుతూ ఉంటాం ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో మనకు తెలియదు. ఈ విషయం చాలామంది ఆలోచించరు.
ఊపిరి ఉన్నన్నాళ్ళు మనిషిగా గౌరవిస్తాం. ఊపిరి ఆగిపోతే
శవం అంటాము. ఊపిరి ఆగిపోతే పిలుపు మారిపోతుంది.
అంతకు ముందున్న బంధుత్వాలన్నీ మాయమైపోయి దేహాన్ని పార్థివ దేహం అంటాము. పార్థివ దేహం అంటే దెయ్యం కాదు. భయపడడానికి.
ముఖ్యంగా అద్దె ఇళ్ళల్లోను అపార్ట్మెంట్లో నివాసం ఉండే వారికి
ఈ రకమైన సమస్య ఉంది. ఆ మధ్య మా స్నేహితుడు అత్తగారు చనిపోతే ఇంటి యజమాని ముందుగానే చెప్పేశాడు. చేసేది లేక వాళ్ళు డైరెక్ట్ గా ఆసుపత్రి నుండి శవాన్ని రుద్ర భూమికి తరలించేశారు.
భూముల ధరలకు రెక్కలు వచ్చిన సందర్భంలో సొంత ఇల్లు ఎవరు కట్టుకోలేకపోతున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లోని ప్లాట్లు తప్పితే వేరే దారి లేదు. గ్రామాలన్నీ నగరం మీదకు వచ్చి పడిపోతున్నాయి. పాపం నగరం ఎంతమందికి చోటు ఇవ్వగలదు.
ఇంతలో ఇక్కడ సంతకం పెట్టండి అంటూ ఆసుపత్రి సిబ్బంది కాగితాలు ముందు పెట్టారు. బాడీని తీసుకున్నట్లుగా సంతకం. ఇప్పుడేం చేయాలి. ఇంటికి తీసుకెళ్లే పరిస్థితులు లేవు.ఇప్పుడు టైం చూస్తే రాత్రి 8 అయింది. ఈ సమయంలో అంతిమ సంస్కారం అంటే శాస్త్రం ఒప్పుకోదు.
నాన్న అసలే చాదస్తం మనిషి. పూజా పునస్కారం కర్మకాండ పట్ల నమ్మకం ఎక్కువ. అటువంటి మనిషిని ఈ రాత్రి ఏం చేయాలి. ఇంతలో రమేష్ భార్య, తల్లి సుశీలమ్మ రోదిస్తూ ఆసుపత్రిలోకి వచ్చారు. తెల్లదుప్పటి కప్పి ఉన్న భర్త శవం మీద
మీద పడి సుశీలమ్మ గట్టిగా ఏడవ సాగింది. మిగిలిన పేషెంట్లు భయపడతారు గట్టిగా ఏడవకండి అని నర్సు గట్టిగా కసిరి బయట బల్ల చూపించింది. సుశీలమ్మ రోదిస్తూ బల్లమీద కూలబడింది.
మనిషికి కష్టం వచ్చినప్పుడు కూడా పదిమంది ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలి. అమ్మ ని ఈ విషయంగురించిఅడగలేను. రమేష్ భార్య కూడా సలహా చెప్పే స్థితిలో లేదు. ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకొని తన పరిస్థితి అంతా చెప్పిమరుసటి ఉదయం శవాన్ని తీసుకెళ్తానని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. వారు అందుకు అంగీకరించలేదు.
మీరు తీసుకెళ్లకపోతే మేం మార్చురీకి తరలించేస్తాం కసిరినట్టుగా సమాధానం చెప్పారు. ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. అనాధ శవంలా మార్చురీలో పెట్టడం ఏమిటి . ఆ మందుల వాసనలో ఆ చలువ గదిలో ఆ శవాన్ని ఉంచడానికి మనసు ఒప్పలేదు. సినిమాలో చూపించినట్లుగా ఎలుకలు కొరికి తినేస్తే . శవాల మీద కూడా ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎవరిని నమ్మలేము.
నాన్న బ్రతికిన ఉన్నవాళ్లు రాజాలా బ్రతికాడు. చిన్నప్పటినుంచి ఆయనకి శ వాలంటే చాలా భయం. ఎటు తోచకుండా ఉంది పరిస్థితి. కాళ్లు చేతులు ఆడడం లేదు. బాధ్యత మీద పడిన తర్వాత భయం అంటే ఎలా కుదురుతుంది.
అప్పటికే రాత్రి 12 గంటలు అయింది. ఎటు పాలుపోని పరిస్థితి. అన్ని దోవలు మూసుకుపోయా యి. ఇంక మా అపార్ట్మెంట్ ఒక్కటే దారి. వాళ్లు ఇంత రాత్రివేళ ఫోన్ చేస్తే సమాధానం ఇస్తారో ఇవ్వరో అయినా సభ్యత కూడా కాదు .అయినా ధైర్యం కూడగట్టుకుని అపార్ట్మెంట్ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ శర్మ గారికి ఫోన్ చేయడానికి నిశ్చయించుకున్నాను.
ఫోన్ రింగ్ చేసి హలో అనగానే రమేష్ గారు చెప్పండి అంటూ శర్మ గారు ప్రశ్నించారు. ఉన్న విషయం యధాతధంగా చెప్పి
శవాల గదిలో ఉంచడానికి నా మనసు వప్పుకోవడo లేదని కూడా చెప్పి బోరున ఏడ్చేసాను.
వెరీ సారీ అండి నేను ఇప్పుడు అర్జెంటుగా మీటింగ్ పెట్టి మన ప్లాట్ ఓనర్లు అందర్నీ రిక్వెస్ట్ చేసిమీరు ఆసుపత్రి నుంచి నేరుగాశవాన్నిఇక్కడికితీసుకురావడానికి పరిమిషన్ తీసుకుంటా ను. మీరు కంగారు పడకండి మళ్ళీ ఒక గంటలో ఫోన్ చేస్తాను అంటూ శర్మగారు ఫోన్ పెట్టేసారు.
ఏదైనా ప్రయత్నం చేయడం వరకే మన బాధ్యత . ఫలితం కోసం వేచి చూడడం అది కూడా మన ధర్మం. ఫలితం ఏ రకంగా వస్తుందని మనం చెప్పలేము. అదృష్టం బాగుంటే సత్ఫలితాలు వస్తాయి. ఇలా కళ్ళు మూసుకుని ఆలోచించుకుంటూ ఉండగా
రమేష్ గారు అని గట్టిగా పిలుపు వినబడింది. కల కాదు కదా అని కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగుండా శర్మ గారితో పాటు మా అపార్ట్మెంట్ ఓనర్లు అందరూ వచ్చి నా భుజం తట్టి
పదండి మన అపార్ట్మెంట్ కి తీసుకు వెళ్ళిపోదాం .
మన అపార్ట్మెంట్లోని కమ్యూనిటీ హాలు ఖాళీ చేయించాం అంటూ అంబులెన్స్ ఏర్పాట్లు చేసి మా నాన్న గారి శవాన్ని మా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కి చేర్చి తెల్లవారులు మాతోపాటు శవ జాగరణ చేసి అంతిమ సంస్కారానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసి మాతోపాటు అందరూ స్మశానానికి వచ్చి దహన సంస్కారం అయ్యేవరకు ఉండి వెళ్లిపోయారు.
నాన్న చాలా అదృష్టవంతుడు అంటూ రమేష్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
మనిషి ఎప్పుడు మారతాడు? తనకు కలిగిన అనుభవం , లేదా ఎవరైనా చెప్పిన చక్కని మాటలు, అంటే హృదయాన్ని తాకేలా ఉన్న మాటలు అంటే మహాత్ముల ప్రవచనాలు. మారిన మనిషి తను ఎందుకు మారాడో చెప్పడు. ఆచరణలో చూపిస్తాడు. గాంధీజీ తను ఆచరించి చూపించిన ఖద్దరు వస్త్రధారణ చాలామంది అనుసరించారు. చాగంటి వారి ప్రసంగం విని చాలామంది తన జీవన సరళి మార్చుకున్న సందర్భం ఆయనే ఒకసారి తన ప్రసంగంలో చెప్పారు. దృశ్యశ్రవణ యంత్రాన్ని
మనమందరం చాలాసార్లు తప్పుపడుతుంటాం. కానీ ఎందరో చెప్పిన ప్రవచనాలు చాలామందిని మారుస్తున్నాయని మూఢనమ్మకాలని తరమేస్తున్నాయని చెప్పడంలో నా కథ ఉదాహరణ.
ఈ అపార్ట్మెంట్ వాసులు ఎలా మారారో విడ మరిచి చెప్పక్కర్లేదు.
ఎంతోమంది స్నేహితుల బంధువుల అనుభవాల సారాంశమే
ఈ కథ.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి