ఓహో పావురమా!
ఓహో పావురమా. అది నిజంగా భాగ్యనగరమే. ఆ రాజ్యానికి పట్టపురా ణి మీద ప్రేమతో అందంగా నిర్మించబడిన ఆ నగరం నాలుగు దిక్కులలో ఉన్న పల్లెలను కలుపుకుని సువిశాల నగరంగా మారి పరిశ్రమలకు కర్మాగారాలకు ఆశ్రయమిచ్చి కాలుష్యం మాట దేవుడెరుగు పొట్ట చేత పట్టుకుని పట్టా పుచ్చుకుని పట్నం చేరిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు కార్పొరేట్ ఆఫీసుల్లో ఆశ్రయమిచ్చి కడుపు నింపే ఆ నగరం నిజంగా అక్షయ పాత్ర . రోజురోజుకీ నగరం పెరిగిపోతోంది. ఎర్రబస్సు ఎక్కి పట్నం చేరే జనం చెప్పక్కర్లేదు.కనీస అవసరాలు నేను కల్పించలేను బాబోయ్ అన్నా సరే కర్మాగారం పక్కనైనా ఉంటాం అని బహుళ అంతస్తుల భవనాలు విల్లాలు డూప్లెక్స్ హౌస్లు కట్టుకుని కాలక్షేపం చేసే జనం ఎంతోమంది. మాకు గుండెల్లో ధైర్యం ఉంది. జేబులో డబ్బుంది. ఒంట్లో ఓపిక ఉంది. కూత వేటు దూరంలో కూతవేసే మెట్రో రైలు బండి ఉంది.ఇంటి దగ్గర నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్ కైనా వెళ్లి వస్తామని జనం దూర దూరంగావెళ్లిపోయి చెయ్యి చాస్తే ఆకాశం అందే బహుళ అంతస్తుల భవనంలో కాపురం చేస్తున్నారు. మీట నొక్కితే పైకి మోసుకుపోయే యంత్రం ఉంది మాకు ఏమి భయం అంటూ ఆ అంతస్తుల్లో క...