ఉగాది పండుగ
ఉగాది పండుగ " ఒరేయ్ సుధాకర్ రేపు ఉదయం నాలుగు గంటలకు అలారం పెట్టు అంటూ మంచం మీద వాలింది పార్వతమ్మ. " అంత పొద్దున్నే ఎందుకమ్మా లేవడం అని అడిగాడు కొడుకు సుధాకర్ పార్వతమ్మ ని. రేపు ఉగాది పండుగ కదరా. బోల్డంత పని ఉంది నాకు. ఉదయం లేచి గుమ్మాలికి తోరణాలు కట్టుకోవాలి. వంటింట్లో బోల్డు పనుంది. మీరు లేచిన దగ్గర్నుంచి ఆకలి అంటూ చంపేస్తారు. మీరు లేచిన వెంటనే కాఫీ కూడా తాగకుండా రేపు తలంటు పోసుకోవాలి. మర్చిపోకుండా అంటూ నిద్రకి ఉపక్రమించింది. అలా మంచం మీద పడుకుoదేగాని చాలాసేపటి వరకు ఆలోచనలతో నిద్ర పట్టలేదు. పాపం రమ్య భాగ్యనగరంలో చంటి పిల్లతో ఎలా ఇబ్బంది పడుతుందో. ఉగాది పండుగకి రమ్మని ఫోన్ చేస్తే ఒక్కరోజే సెలవు అంటూ చెప్పింది. పిల్లలతో చేసుకోవడం కష్టం అనుకుంటూ ఉండగా ఇంతలో అలారం మోగింది. పార్వతమ్మకి బద్దకంగా అనిపించిన ఇక తప్పదు అనుకుంటూ లేచి బాత్రూం లోకి వెళ్లి మొహం కడుక్కుని తలంటుకుని గుమ్మాలకు తోరణాలు కట్టుకుని పసుపు బొట్టు పెట్టుకుని వంటింట్లోకి ప్రవేశించింది. మామూలుగా ఏ స్త్రీ కైనా పండగ అంటే రోజు ఉండే పనితో పాటు కొంచెం ఎక్కువగానే పని ఉంటుంది. అందులో ఉగాది పండుగ. తొలి పండుగ. ఏది ఏమైనా ఆ...