కుటుంబం
ఉదయం ఆరు గంటలు అయింది. ఆ వృద్ధుల ఆలయంలో మైకు నుంచి విష్ణు సహస్రనామం శ్రావ్యంగా వినపడుతోంది. ఒంటిమీద తెల్లటి బట్టలు వేసుకుని కాళ్లకు నల్లటి షూ తొడుక్కుని నుదుటన ఎర్రటి బొట్టు పెట్టుకుని సగం సగం నెరిసిన జుట్టుతోసుమారు యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి ప్రతి గది లోకి తొంగిచూస్తూ అక్కడున్న వృద్ధులను ఆప్యాయంగా వరుసలు కలిపి పలకరిస్తున్నాడు. "పెద్దమ్మ కాఫీ తాగావా! పెద్దనాన్న లేచావా! ఆరోగ్యం బాగుందా! మందులు వేసుకున్నావా! రాత్రి నిద్ర పట్టిందా! ఇలాంటి ప్రశ్నలతో ఆ వృద్ధులందరినీ పలకరించడం ఆయన దినచర్య. ఆ వృద్ధుల ఆలయంలో సుమారు యాభై గదులు ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గదిని నిశితంగా పరిశీలించి బాగోగులు కనుక్కోవడం ఆయనకి ఇష్టం. తనకంటూ ఎవరు అయినవాళ్లు లేకపోయినా , అయినవాళ్లు ఉండి కొందరు, ఎవరూ లేకుండా ఆ వృద్ధుల ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరిని తన బంధువు లాగే చూసుకుంటాడు . మర్యాదలు చేస్తాడు. కష్టం వస్తే తల్లడిల్లిపోతాడు. ఎవరికైనా అనారోగ్యం వస్తే రాత్రి పగలు తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలా ప్రతి గదిలోకి తిరిగి భోజనాశాలలోకి వెళ్లి అందరూ పలహారం తీసుకునే వరకు అక్కడే కూర్చుంటాడు. ...