నా జ్ఞాపకాల కాకినాడ
కాకినాడ మా ఊరండి. ఆ పేరు వినగానే మనసంతా ఏదో అయిపోతుంది. జగన్నాధపురం బ్రిడ్జి దాటగానే మన కాకినాడ పాత జ్ఞాపకాలు ఒక్కసారి సినిమా రీలులా గిర్రున తిరుగుతాయి.
అప్పట్లో అలా ఉండేది. ఎప్పుడో విదేశీయులు కాకినాడ వచ్చి కోకల వ్యాపారం మొదలుపెట్టారుట. వ్యాపారం అంటే చీరలు అమ్మడం కాదు, చీరలు ఎగుమతి. చుట్టూ విశాలమైన బంగాళాఖాతం ఉండగా చేపలు పట్టడం మానేసి కాకినాడలో ఈ కోకల వ్యాపారం ఎందుకు ఎంచుకున్నారో ఆ విదేశీయులు డచ్ వారు. అప్పటినుంచి కాకి నందివాడ కోకనాడగా మారిపోయింది. ఇప్పటికీ రైల్వే డిపార్ట్మెంటు వారికి కోకనాడ పేరు మరచిపోలేదు. అది అలానే కంటిన్యూ అవుతోంది. ఆ విదేశీయుల నామకరణం వాడుకలో కాకినాడగా మారిపోయింది.
కోకనాడ అతి పురాతన నగరం. తూర్పున బంగాళాఖాత సముద్రం ఓడరేవుగా మారి ఎగుమతలకు సహాయం చేస్తూ మధ్యలోని హోప్ ఐలాండ్ నగరాన్ని ముంపు నుండి కాపాడుతోంది.
అందాల నగరం లోపల అందమైన రోడ్లు, మంచి మంచి పార్కులు, మంచి మంచి కాలేజీలు, మంచి స్కూల్స్ ఎన్ని ఉండేవో! అప్పట్లో కాలేజ్ అంటే గుర్తుకొచ్చేది పి.ఆర్. కాలేజ్ అండి. ఈ కాలేజీలో చదువుకుని ఎంతోమంది కలెక్టర్లు, డాక్టర్లు, నాయకులు, ఇంజనీర్లు, యాక్టర్లు అయిపోయారు.
కాకినాడ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మహా వ్యక్తి పిఠాపురం మహారాజు శ్రీ రాజారావు వెంకట మహిపతి గంగాధర రామారావు గారు. ఈ మహారాజు వారు 1884లోనే ఒక స్కూలు స్థాపించి దాన్ని కాలేజీగా మార్చి ఎంతో మందికి విద్యను అందించారు. అదే పి.ఆర్. గవర్నమెంట్ కాలేజ్. ఈనాటికీ అది అత్యున్నత ప్రతిష్టాకరమైన కళాశాల.
ఈ నగరంలో రంగరాయ మెడికల్ కాలేజీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ లకు కూడా స్థలదాత పిఠాపురం మహారాజు వారే. అలాగే జగన్నాధపురంలో మల్లాడి సత్యలింగం నాయకర్ గారి కళాశాల నాయకర్ గారి బిక్ష.
ఏ రాజుల ఏలుబడిలో ఈ నగరం ఉండేదో తెలియదు గాని రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు మటుకు కాకినాడ మీద వేశారుట. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఈ నగరంలో జరగడం ఒక చారిత్రాత్మక విషయం. బ్రిటిష్ వారి కట్టడాలు కొన్ని ఈనాటికీ ఈ నగరంలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఉదాహరణకి కలెక్టర్ కార్యాలయం.
అతి సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు అందరూ హాయిగా బ్రతకగలిగే ఈ నగరాన్ని ఒకప్పుడు "పెన్షనర్స్ పారడైజ్" అని పిలిచేవారు.
ఊరి మొదట్లో ఒక బోధన ఆసుపత్రి, పిఠాపురం రాజుగారి కాలేజీ, మెక్లారిన్ హై స్కూలు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండేవి. రామారావుపేట, గాంధీనగరంలో అందమైన పెంకుటిళ్లు. సుబ్బయ్యగారి హోటల్, కోటయ్యగారి కాజా, విశాలమైన సముద్రం, త్రిపురసుందరి గుడి, భానుగుడి, నూకాలమ్మగుడి, రమణయ్యపేట కూరగాయ మార్కెట్, సర్పవరం పూల మార్కెట్, రోజూ ఇత్తడి బిందెలతో పాలు అమ్మే వ్యాపారులు, ఇంటిముందర పాలు పిండే వ్యాపారులు, పొట్టి పెసరట్టు, గాంధీ పార్క్—ఇన్ని ఆకర్షణలతో ఇలా సుందర నగరంలా ఉండేది.
ఒకే వీధిలో సినిమా హాళ్లు, ఒకే వీధిలో బట్టల షాపులు. సమస్తం అందులోనే దొరికేవి. ఎటు చూసినా ఎనిమిది కిలోమీటర్ల వ్యాసార్థంతో నగరం ఉండేది. ట్రాఫిక్ సమస్యలు అన్నమాటే లేకుండా రిక్షాలోనే ప్రయాణం. కార్లు, బస్సులు, ఆర్టీసీ వారి బస్సులు ఉన్నా వాహన కాలుష్యం లేకుండా ఎంత ఆనందంగా ఉండేది నగర జీవనం.
సర్కార్ ఎక్స్ప్రెస్, గౌతమి ఎక్స్ప్రెస్, ఒకటో రెండో ప్యాసింజర్ రైళ్లు తప్ప ఇంకేమీ మనకి ఉండేవి కాదు. సగటు మనిషి కూడా సరదాగా బతికేసే రోజులు అవి.
చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశాలు, మామిడి తోటలు, పనస చెట్లు. గట్టిగా వర్షం వస్తే మునిగిపోయే ప్రదేశాలు. స్థలాలు కొనుక్కోమని బతిమాలుతుండేవారు. ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి?
అప్పట్లో కాకినాడ నగరమే గాని తెల్లవారితే పల్లెటూరు అంతా కాకినాడలోనే ఉండేది. పొద్దున్నే ఎర్రబస్సు ఎక్కి కాకినాడ వచ్చి, ఉదయం శాంతిభవన్లో టిఫిన్ చేసి, మధ్యాహ్నం సుబ్బయ్యగారిని పలకరించి, సాయంత్రం బజార్లో కుమార్ బిస్కెట్లు కొనుక్కుని పని చూసుకుని సాయంత్రానికి ఇంటి చేరేవారు.
అలాగే రోజు వచ్చే పోయే జనంతో బిజీ బిజీగా ఉండేది. సాయంత్రం పూట చల్లటి గాలి, ప్రాణం హాయిగా ఉండేది. బజారు వెళ్లి హాయిగా పని చూసుకుని ఇంటికి వస్తే ఎంతో ఆనందంగా ఉండేది.
అటు పల్లెటూరు కాదు, ఇటు పట్టణం కాదు అనేలా ఉండే కాకినాడ వాతావరణం. పది కాలాలపాటు ఈ ఊర్లోనే ఉండాలని అనుకుని ట్రాన్స్ఫర్ వచ్చిన పిల్లల్ని ఎక్కడికీ కదపకూడదని, పక్క ఊర్లకు, విశాఖపట్నం వరకూ ప్యాసింజర్ రైలు ఎక్కి ఉద్యోగం చేసి సాయంకాలం కాకినాడ చేరి హాయిగా ఊపిరి పీల్చుకునే స్నేహితులు ఎంతోమంది.
ఎప్పుడైనా విశాఖపట్నం ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఎక్కితే దారి పొడుగునా చేతిలో ఒక క్యారేజీతో కనబడే స్నేహితులు చాలా మంది. అంటే ఆ రోజుల్లో కాకినాడ నుండి మకాం మార్చడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు.
సొంతిల్లు లేకపోయినా సామాన్యుడుకి అందుబాటులో ఉండేవి ఇంటి అద్దెలు. సినిమాల్లో చూపించినట్లు ఉండేవారు కాదు ఇంటి యజమానులు. ఎంతో ఆప్యాయంగా, ఎంతో అభిమానంగా, ప్రేమగా ఉండేవారు. అద్దె ఒక రోజు లేట్ అయినా ఏమి అనుకునేవారు కాదు. సహాయం అంటే ఎవరైనా ముందుకు వచ్చేవారు.
ఇక పిల్లల చదువులు కూడా కార్పొరేట్ కళాశాలలు, స్కూళ్లు చాలా చాలా తక్కువ. ఒక మాదిరి కాన్వెంట్లో లేదా గవర్నమెంట్ స్కూలు, కాలేజీల్లో విద్య సామాన్యుడికి కూడా చాలా అందుబాటులో ఉండేది.
పెద్ద బజార్లో కిరాణా షాపులు సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలతో సరుకులు అమ్మేవి. రమణయ్యపేట కూరగాయల మార్కెట్, గాంధీనగర్ మార్కెట్ ఆదివారం పూట కిటకిటలాడుతూ ఉండేవి. తాజా కూరగాయలు, రేట్లు తక్కువ.
ఉదయం 5 గంటల నుంచే పక్కనుండే పల్లెటూర్ల నుండి సైకిల్ మీద కూరగాయలు తట్టలో పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్మేవారు. "అరువు రేపు" అనే బోర్డు వీరి దగ్గర ఉండేది కాదు. నెలాఖరులో కూడా డబ్బు తీసుకునే వాళ్లే కానీ, సరుకు మాత్రం తాజాగానే. ఎందుకంటే కాకినాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అన్ని కూరగాయలు పండించేవారు. చిత్రాడ బీరకాయలు ఎవరు మర్చిపోతారు?
వర్షాకాలం వస్తే కూరగాయల విత్తనాలు, వంగ నారు, బాలాజీ చెరువు సెంటర్లో దొరికేవి.
తెల్లవారగానే కాఫీ పడకపోతే ఎవరికి తోచేది కాదు. ఉదయం ఐదు గంటలకు వీధి గుమ్మం తలుపు తీస్తే ఎదురుగుండా సైకిల్ మీద ఇత్తడి బిందెలతో పాలు పెట్టుకుని ప్రతి ఇంటికి వచ్చి పాలు పోసేవాడు. కావాలనుకుంటే నాలుగు గేదెలతో వచ్చేవాడు.
ఇంటి ముందే పాలు పితికి తన నిజాయితీని ప్రతిరోజూ ప్రదర్శిస్తూ ఉండేవాడు పాలవాడు. ఆ వాతావరణం మన గ్రామీణ వాతావరణం తలపించేది. ఉదయమే ప్రశాంతంగా ఉండేది.
నగరంలో ఆఫీసులకు చేరాలంటే బస్సు ఎక్కక్కర్లేదు, ట్రైన్ ఎక్కక్కర్లేదు. రిక్షాలు, స్కూటర్లు, నగరంలో తిరిగే సిటీ బస్సులు సామాన్యుడికీ అందుబాటులో ఉండేవి. ఇంటి దగ్గర భోజనం చేసి తాంబూలం వేసుకుని చక్కగా ఆఫీస్ సీట్లో కూర్చుని, మధ్యాహ్నం లంచ్‌బాక్స్ స్నేహితులతో పంచుకుని, సాయంకాలం 6 గంటలకల్లా ఇంటికి చేరి, స్నానం చేసి లుంగీ, పంచ కట్టుకుని, రేడియోలో వార్తలు వింటూ వాలు కుర్చీలో పడుకుని సేదదీరేవాడు సగటు ఉద్యోగి. ఉద్యోగి కూడా ఒత్తిడి ఫీలయ్యే వాడు కాదు.
ఎవరికైనా అనుకోకుండా రోగం వస్తే జిల్లాలోనే అతి పెద్దదైన రంగరాయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సామాన్యుడికి చాలా అందుబాటులో ఉండేది. నిష్ణాతులైన వైద్యులు ఆ ప్రభుత్వాసుపత్రిలో ఉండేవారు. డాక్టర్‌కి, రోగికి ఉండే సంబంధం ఒక తల్లికి బిడ్డకు ఉండే సంబంధంలా ఉండేది. అందులో పని చేసే వైద్యులు అనుభవజ్ఞులే కాకుండా ధర్మబద్ధంగా ఉండేవారు.
పిల్లలు స్కూల్‌కి రిక్షాలో వెళ్లేవారు. ఇంటింటికి రిక్షావాడు టైంకి వచ్చి పిల్లల్ని ఎక్కించుకుని జాగ్రత్తగా స్కూల్ దగ్గర దింపి, మళ్లీ టైంకి స్కూల్ నుంచి తిరిగి తీసుకువచ్చేవాడు. రిక్షావాళ్లు చాలా నమ్మకంగా ఉండేవారు.
రోడ్డు మీద కూడా స్త్రీలు నిర్భయంగా తిరగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆకతాయిమూక ఎక్కడో తప్పితే కాకినాడలో లేరు. అటువంటి సంఘటనలు ఏమీ లేవు. ప్రజలందరూ ఆప్యాయత, అభిమానాలతో కలిసిమెలిసి ఉండేవారు. మనకి పల్లెటూర్లో ఉండే వాతావరణం ఇక్కడ కనిపించేది.
వినాయక చవితి, దసరా ఉత్సవాలు ప్రతీ వీధిలోనూ జరుగుతూ ఉండేవి. రాత్రిపూట సినిమాలు రోడ్డు మీద వేసేవారు. రికార్డింగ్ డాన్సులు, కోలాటాలు, హరికథలు, బుర్రకథలు—అబ్బో! ఆ సందడే వేరు.
ఇక సూర్య కళామందిరంలోనూ, సరస్వతి గాన సభలోనూ సంగీతం జరుగుతూనే ఉండేది. ఆనందభారతిలో మీటింగులు చెప్పక్కర్లేదు.
కాలక్రమేణా కాకినాడలో మార్పులు మొదలయ్యాయి. పాత పెంకుటిళ్ల బదులు అపార్ట్మెంట్లు కట్టబడ్డాయి. విశాలమైన మామిడి తోటలు, ఖాళీ ప్రదేశాలు నెమ్మదిగా కనుమరుగైపోయాయి. అక్కడక్కడా షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాపులు, ఆధునిక రెస్టారెంట్లు వెలసాయి.
పాత బజారు వీధులు మారిపోయాయి. పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చాయి. సుబ్బయ్యగారి లాంటి హోటళ్లు ఇప్పుడు కూడా ఉన్నా, వాటి చుట్టూ కొత్త కొత్త రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. అప్పట్లో అరుదుగా కనిపించే కార్లు ఇప్పుడు రోడ్డు మీద కిటకిటలాడుతున్నాయి. రిక్షాలు, సైకిళ్లు తగ్గిపోయి ఆటోలు, బైకులు, కారు లు ప్రాధాన్యం సాధించాయి.
ట్రాఫిక్ జామ్‌లు కాకినాడకూ వచ్చేశాయి. రోడ్డుపై నడవాలన్నా జాగ్రత్తగా నడవాలి. వాహనాల శబ్దం, పొగ కాలుష్యం పట్టణ వాతావరణాన్ని మార్చేశాయి.
పిల్లల చదువులు కూడా మారాయి. అప్పట్లో గవర్నమెంట్ స్కూళ్లు, సాధారణ కాన్వెంట్లు ఉన్న చోట ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు వెలిశాయి. ఫీజులు భరించలేనంతగా పెరిగాయి. చదువులపై పోటీ పెరిగిపోయింది.
అద్దె ఇళ్లు కూడా అందుబాటులో లేవు. పాత రోజుల్లో ఒక జీతానికి సగం సరిపోయే అద్దె, ఇప్పుడు జీతానికి మించి కావాల్సినంత అయిపోయింది. ఇంటి యజమానులు పాత రోజుల్లా ఆప్యాయంగా ఉండడం అరుదు. సంబంధాలు వ్యాపార సంబంధాల్లా మారిపోయాయి.
బజార్లలో అప్పటిలా మనస్ఫూర్తిగా ఇచ్చే తూలం కూరగాయలు, "సరే మరీ పాత కస్టమరు" అని అదనంగా ఇచ్చే ఉల్లిపాయల గుప్పెడు—ఇవి ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు. డిజిటల్ పేమెంట్స్, బిల్లులు, ప్యాకేజింగ్, ఆన్‌లైన్ ఆర్డర్లు అన్నీ వచ్చేసాయి.
అయినా సరే, కాకినాడలో పాత వాతావరణం గుర్తుకు తెచ్చే మూలలు ఇంకా ఉన్నాయి. పెద్ద బజారు, రమణయ్యపేట కూరగాయ మార్కెట్, భానుగుడి, నూకాలమ్మగుడి ఉత్సవాలు, గోదావరి గాలి తాకిన తీరపు చల్లదనం—ఇవి ఇంకా మనసుని తాకుతూనే ఉంటాయి.
పాత కాకినాడలో ఆప్యాయత, నమ్మకం, సౌలభ్యం ఎక్కువ. కొత్త కాకినాడలో సౌకర్యాలు, సాంకేతికం, వేగం ఎక్కువ. కాలం మారింది, వాతావరణం మారింది. కానీ ఎవరి గుండెల్లోనూ ఆ పాత కాకినాడ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి