కుటుంబం

కుటుంబం

ఉదయం ఆరు గంటలు అయింది. 

ఆ వృద్ధుల ఆలయంలో మైకు నుంచి విష్ణు సహస్రనామం శ్రావ్యంగా వినపడుతోంది. 

ఒంటిమీద తెల్లటి బట్టలు వేసుకుని కాళ్లకు నల్లటి షూ తొడుక్కుని నుదుటన ఎర్రటి బొట్టు పెట్టుకుని సగం సగం నెరిసిన జుట్టుతోసుమారు యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి 
ప్రతి గది లోకి తొంగిచూస్తూ అక్కడున్న వృద్ధులను ఆప్యాయంగా వరుసలు కలిపి పలకరిస్తున్నాడు. 

"పెద్దమ్మ కాఫీ తాగావా! పెద్దనాన్న లేచావా! ఆరోగ్యం బాగుందా! మందులు వేసుకున్నావా! రాత్రి నిద్ర పట్టిందా! ఇలాంటి ప్రశ్నలతో ఆ వృద్ధులందరినీ పలకరించడం ఆయన దినచర్య.

ఆ వృద్ధుల ఆలయంలో సుమారు యాభై గదులు ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గదిని నిశితంగా పరిశీలించి బాగోగులు కనుక్కోవడం ఆయనకి ఇష్టం. తనకంటూ ఎవరు అయినవాళ్లు లేకపోయినా , అయినవాళ్లు ఉండి కొందరు, ఎవరూ లేకుండా ఆ వృద్ధుల ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరిని తన బంధువు లాగే చూసుకుంటాడు . మర్యాదలు చేస్తాడు. కష్టం వస్తే తల్లడిల్లిపోతాడు. ఎవరికైనా అనారోగ్యం వస్తే రాత్రి పగలు తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు.
అలా ప్రతి గదిలోకి తిరిగి భోజనాశాలలోకి వెళ్లి అందరూ పలహారం తీసుకునే వరకు అక్కడే కూర్చుంటాడు. ఎవరైనా ఆ భోజనశాలకు రా లేకపోతే కారణం తెలుసుకొని వారు ఉండే గదిలోకే టిఫిన్ కూడా పంపించడం ఆయన దినచర్యలో భాగమే.

మధ్యాహ్నం సాయంకాలం కూడా ప్రతి ఒక్కరూ తినేదాకా తను వేచి ఉండడం ఆయనకి అలవాటు. 

ఆ వృద్ధుల ఆలయంలో ప్రతి పండుగని, వృద్ధుల పుట్టినరోజుల్ని పెళ్లిరోజులని అందంగా జరపడం ఆయనకు ఎంతో ఇష్టం. ప్రతి ముదుసలిని తన సొంతవాళ్లుగా చూసుకోవడం ఆయనకి అలవాటైపోయింది.

ఇంతకీ ఆయన ఎవరు ? ఈ శరణాలయానికి ఆయనకి ఏమిటి సంబంధం ?ఆయన పేరు చంద్రశేఖర్. ఈ శరణాలయానికి చెప్పాలంటే ఆయనే యజమాని

ఎప్పటిలాగే ఉదయం పూట తన దినచర్య ముగించుకుని ఆఫీసు రూమ్ లోకి వెళ్ళబోతున్న చంద్రశేఖర్ కి ఎదురుగుండా ఉన్న బెంచి మీద సుమారు నలభైఏళ్ళు ఉన్న స్త్రీ కూర్చుని ఉండడం గమనించాడు. పక్కనే ఒక సూట్ కేసు చిన్న సంచి కనబడ్డాయి. కానీ కూడా ఎవరూ లేరు. చంద్రశేఖర్ గారిని చూడగానే ఆమె రెండు చేతులు ఎత్తి నమస్కరించింది. 

 లోపలకు రండంటూ గదిలోకి వెళ్లి తన కుర్చీలో కూర్చుని ఎదురుగుండా ఉన్న కుర్చీ చూపించి ప్రశ్నార్ధకంగా ఆమెకేసి చూసేడు. నా పేరు అన్నపూర్ణమ్మ. మాది హైదరాబాద్. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పనిచేసేవారు. పిల్లలిద్దరూ చదువుకుంటూ ఉండేవారు. ఆనందంగా ఉన్న మా కుటుంబంలో ఒక తీవ్ర విషాదం మా కుటుంబాన్ని తలకిందులు చేసింది. వేసవి సెలవుల కోసం మా పిల్లలు ఇద్దరినీ కాకినాడలో మా అమ్మ గారి ఇంట్లో దింపుదామని గౌతమి ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన మా వారు పిల్లలు ఏసి భోగి లో వచ్చిన మంటల్లో కాలిపోయారు. ఆ ప్రమాదంలో మా వారు పిల్లలతో పాటు చాలామంది చనిపోయారు..నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు.

నేను దిక్కులేని దాన్ని అయిపోయాను. నాకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. దూరపు బంధువుల దగ్గర కొద్ది రోజులు ఉండి వారు నా ఆస్తి కాజేసే ప్రయత్నాలు చూసి భయమేసి మీ శరణాలయం గురించి విని ఇది శరణాలయం కాదు ఒక కుటుంబo లా ఉంటుందని పేపర్లో చదివి ఇక్కడికి వచ్చాను. నాకు ఉచితంగా మీరు ఏమి పెట్టక్కర్లేదు. ప్రతి నెల అందరిలాగే ఫీజు చెల్లిస్తాను అంటూ ఏడుస్తూ చెప్పిన ఆమె మాటలకి చంద్రశేఖర్ కి దుఃఖం ఆగలేదు. 

అన్నపూర్ణమ్మ జీవిత గాధ తన బాధ ఒకలాటిదే. అమెరికాలో డాక్టర్ గా పని చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ ఇద్దరు పిల్లలతో ఆనందంగా గడిచిపోతున్న జీవితం ఇలా మారిపోతుందని ఎప్పుడు ఊహించుకోలేదు. ఊహించనిది జరగడమే జీవితం. 

" ఏవండీ మనం అమెరికా వచ్చి పది సంవత్సరాలయింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్లకి కావలసినంత డబ్బు అయితే ఇవ్వగలం గాని తాతయ్య బామ్మ నానమ్మ లాంటి వాళ్లతో గడిపినప్పుడు వచ్చే ఆనందాన్ని మనం ఇవ్వలేము. అంతేకాకుండా మన తల్లిదండ్రులు కూడా మనవలతో గడిపే అవకాశం కూడా కల్పించవలసిన బాధ్యత మన మీదే ఉంది. దానికి తోడు మన తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళ చివరి దశలో మన దగ్గర ఉంచుకోవాలి. ఇంత దూరం రమ్మంటే వాళ్ళు రాలేరు. అందుకోసం మనం ఇండియా వెళ్ళిపోదాం అంటున్న భార్య సుజాత మాటలలో నిజం ఉందనిపించింది చంద్రశేఖర్ కి.

అయినప్పటికీ అమెరికాలో చేసుకోవాల్సిన పనులన్నీ ఇంకా మిగిలిపోయి ఉండిపోవడంతో రెండు మూడు నెలల తర్వాత భార్య పిల్లలు ఇద్దరినీ విమానం ఎక్కించి వచ్చిన చంద్రశేఖర్ కి పిడుగు లాంటి వార్త వినబడింది. ఆ విమానం తీవ్రవాదులు పెట్టిన బాంబులికి మాడి మసైపోయిందని. ఇంకేముంది చంద్రశేఖర్ జీవితం అంధకారo అయిపోయింది. చంద్రశేఖర్ ఒంటరివాడైపోయాడు. 
చేతినిండా డబ్బున్న ఇంటికి వెళితే పలకరించే మనిషి లేక కొద్ది రోజులు పిచ్చెక్కిపోయి తనలాంటి వారికోసం ఇదిగో ఇలా భార్య పేరు మీదుగా శరణాలయాన్ని స్థాపించి జీవితం గడుపుతున్నాడు చంద్రశేఖర్. ఆ శరణాలయం అంటే ఆయనకి ఎనలేని ప్రేమ. ఓపిక ఉన్నంతవరకు శరణాలయాన్ని స్వంతంగా నడపగలం ఆ తర్వాత శరణాలయం పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న చంద్రశేఖర్ ని ఆలోచింపచేసేది. నిస్వార్ధంగా సేవ చేసే వాళ్ళు దొరకడం చాలా కష్టం అనుకునేవాడు చంద్రశేఖర్.

అన్నపూర్ణమ్మ గారి లాంటి బాధ అనుభవిస్తున్న చంద్రశేఖర్ వెంటనే ఫార్మాలిటీలు పూర్తి చేసి అన్నపూర్ణమ్మ ని శరణాలయంలో చేర్చుకున్నాడు. అక్కడున్న వృద్ధులు అందరికంటే అన్నపూర్ణమ్మతో బాగా అలవాటయింది. 

ప్రతిరోజు అందరి బాగోగులు చూసే చంద్రశేఖర్ని ప్రతిరోజు ఆప్యాయంగా పలకరించడం ప్రారంభించింది అన్నపూర్ణమ్మ.

 అన్నపూర్ణమ్మ ఖాళీగా కూర్చోకుండా వంట గదిలోకి వెళ్లి కాలక్షేపానికి పనులన్నీ పర్యవేక్షిస్తూ ఉండేది . దెబ్బతిన్న మనసుకి ఏదో ఒక కాలక్షేపం లేకపోతే మరీ పిచ్చెక్కిపోతుంది అది ఆవిడ ఉద్దేశం. మధ్యాహ్నం వరకు వంట గదిలోను సాయంకాలం తోటలోను పనులు దగ్గరుండి చేయించడం అలవాటు చేసుకుంది అన్నపూర్ణమ్మ.

 తన బాధ్యతలో కొంత భాగం అన్నపూర్ణమ్మ తీసుకోవడం చంద్రశేఖర్ కి ఆనందంగా అనిపించింది. అయినప్పటికీ "ఎందుకమ్మా మీకు హాయిగా రెస్ట్ తీసుకోండి అన్న చంద్రశేఖర్ మాటలకి లేదండి ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఈ బంధువుల సేవలోనే గడుపుతాను. 

నాకు నా అన్న వాళ్లు లేరు. వీళ్ళ అందరి తోటి ఇలా గడుపుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పిన అన్నపూర్ణమ్మ మాటలు సంతోషాన్ని ఇచ్చేయి చంద్రశేఖర్ కి. ఇంతవరకు ఇక్కడ చేరిన వృద్ధులు ఎవరు ఇలా లేరు అనుకున్నాడు చంద్రశేఖర్. అయినా కానీ ఈ వయసులో ఉన్నవాళ్లు ఈ శరణాలయంలో చేరడం ఇదే మొదటిసారి అనుకున్నాడు చంద్రశేఖర్. 

ఆ శరణాలయంలోని గదులలో రాత్రిపూట లైట్లు అయితే ఆరిపోతాయి కానీ అక్కడున్న వారి గుండెల్లో మంటలు మటుకు ఎప్పుడు మండుతూనే ఉంటాయి . వారి గత జీవితం చేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. ముసలి వయసులో ఉన్న వారికి పిల్లలు దూరమైపోయారని భర్తను కోల్పోయిన బాధ భార్యకి, భార్యను కోల్పోయిన బాధ భర్తకి, జీవితంలో ఎవరూ లేకుండా ఉన్నవాళ్లది ఒక రకమైన బాధ. ఇలా రకరకాలు. జీవిత చరమాంకంలో ఉన్న వాళ్ళకి ఆ వారి సమస్యలకు ఒకటే పరిష్కారం. అది దేవుడు చూపించే పరిష్కారమే. 

అలా రెండు మూడు సంవత్సరములు అయిన తర్వాత అన్నపూర్ణమ్మ ఆ శరణాలయానికి చేస్తున్న సేవ చూసి తన మనసులోని కోరికను బయటపెట్టాడు చంద్రశేఖర్. 

" చూడండి ఈ కుటుంబoలో నాకు తండ్రులు, పినతండ్రులు మామయ్యలు ,పెద్దమ్మలు ,తల్లులు ,తమ్ముళ్లు, అన్నయ్యలు అందరూ ఉన్నారు . కానీ ఒకే ఒక లోటు అదేమిటో మీకు బాగా తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే. నాకు ఈ వయసులో పెళ్లి ఏమిటని అందరిలాగే మీకు అనుమానం రావచ్చు. పగలంతా వీళ్ళ సేవలో గడుపుతున్న నాకు రాత్రిపూట నిద్ర రాదు. తప్పుగా అనుకోకండి. మనసు పంచుకోవడానికి ఒక మనిషి ఎవరు లేరు. అంతేకాదు రేపొద్దున్న నాకు ఏదైనా అయితే నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన ఈ వృద్ధుల పరిస్థితి ఏమిటి. శరణాలయాన్ని కన్నబిడ్డలా చూసుకునేది ఎవరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీది నాది సమానమైన బాధ. మీకు అభ్యంతరం లేకపోతే అంటూ చెప్పిన చంద్రశేఖర్ మాటలకి అన్నపూర్ణమ్మ చాలాసేపు ఆలోచించి మౌనంగా ఉండిపోయింది. 

ఆ తర్వాత కొద్దిరోజులకి ఒక మంచి ముహూర్తంలో కొంతమంది వృద్ధులు మగ పెళ్లి వారిగాను మరి కొంతమంది ఆడపెళ్లి వారుగాను మారి ఆ పెళ్లి దగ్గరుండి జరిపించి మనస్ఫూర్తిగా దీవించారు. ఇది దేవుడు కలిపిన బంధం అని అందరూ ఆనందపడ్డారు. ఒకే అభిరుచి ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏముంది శరణాలయం మరింత మందికి ఆశ్రయం ఇచ్చింది.అది ఆ దంపతులకు ఎంతో తృప్తినిస్తూ వచ్చింది.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు. 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సాయంకాలం సాగర తీరం