రెక్కల అతిథులు
ఉదయం లేస్తూనే చెప్పాడు మా అబ్బాయి అవినాష్ — ఇవాళ అతిధులను తీసుకురాడానికి వెళ్లాలని. “ఎవర్రా?” అని అడిగితే “సస్పెన్స్” అంటూ మాట దాటేశాడు. “రైల్వే స్టేషన్? బస్టాండ్?” కా అని అడిగితే మౌనంగా ఉండిపోయాడు, నవ్వుతూ. వీడి సస్పెన్స్ బంగారం గాను! అయినా ఈరోజుల్లో ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చే అతిధులు ఎవరు అబ్బా అనుకుంటూ ఎదురు చూడడం మొదలుపెట్టాం. “వాళ్లు భోజనానికి వస్తారా? టిఫిన్లు పెట్టాలా? ఏంట్రా విషయం?” అంటూ వాళ్ళ అమ్మ పదేపదే అడగడం మొదలెట్టింది. మా అబ్బాయి మొహంలో చిరునవ్వు తప్ప సమాధానం లేదు. “పోనీలే, వాడు చెప్పకపోతే చెప్పకపోయాడు, నేను ఇల్లు సర్దుకుని రెడీగా ఉంటాను,” అంటూ చిందరవందరగా ఉన్న సామాన్లన్నీ సరిగ్గా సెట్ చేసి, స్నానం చేసి, బట్టలు మార్చుకుని రెడీగా కూర్చుంది వాళ్ళ అమ్మ. మా అబ్బాయి మటుకు ఏమి కంగారు పడకుండా — చుట్టాలే ఎన్ని గంటలకు వస్తారో చెప్పడు, తాను ఎప్పుడు తీసుకువస్తాడో కూడా చెప్పడు. ఏమి చెప్పకుండా మామూలుగా పని చేసుకుంటూ కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ వరుసగా పూర్తి చేసి, నిదానంగా సాయంకాలం ఐదు గంటలకి బండి తీసుకుని బయటికి వెళ్లిపోయాడు. రాబోయే చుట్టాల కోసం మళ్లీ రెండోసారి ఇల్లు సర్ది, డైనింగ్...