రెక్కల అతిథులు



ఉదయం లేస్తూనే చెప్పాడు మా అబ్బాయి అవినాష్ — ఇవాళ అతిధులను తీసుకురాడానికి వెళ్లాలని.
“ఎవర్రా?” అని అడిగితే “సస్పెన్స్” అంటూ మాట దాటేశాడు.
“రైల్వే స్టేషన్? బస్టాండ్?” కా అని అడిగితే మౌనంగా ఉండిపోయాడు, నవ్వుతూ.
వీడి సస్పెన్స్ బంగారం గాను! అయినా ఈరోజుల్లో ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చే అతిధులు ఎవరు అబ్బా అనుకుంటూ ఎదురు చూడడం మొదలుపెట్టాం.
“వాళ్లు భోజనానికి వస్తారా? టిఫిన్లు పెట్టాలా? ఏంట్రా విషయం?” అంటూ వాళ్ళ అమ్మ పదేపదే అడగడం మొదలెట్టింది.
మా అబ్బాయి మొహంలో చిరునవ్వు తప్ప సమాధానం లేదు.
“పోనీలే, వాడు చెప్పకపోతే చెప్పకపోయాడు, నేను ఇల్లు సర్దుకుని రెడీగా ఉంటాను,” అంటూ చిందరవందరగా ఉన్న సామాన్లన్నీ సరిగ్గా సెట్ చేసి, స్నానం చేసి, బట్టలు మార్చుకుని రెడీగా కూర్చుంది వాళ్ళ అమ్మ. 

మా అబ్బాయి మటుకు ఏమి కంగారు పడకుండా — చుట్టాలే ఎన్ని గంటలకు వస్తారో చెప్పడు, తాను ఎప్పుడు తీసుకువస్తాడో కూడా చెప్పడు.

ఏమి చెప్పకుండా మామూలుగా పని చేసుకుంటూ కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ వరుసగా పూర్తి చేసి, నిదానంగా సాయంకాలం ఐదు గంటలకి బండి తీసుకుని బయటికి వెళ్లిపోయాడు.

రాబోయే చుట్టాల కోసం మళ్లీ రెండోసారి ఇల్లు సర్ది, డైనింగ్ టేబుల్ మీద మంచినీళ్లు, గ్లాసులుతో పెట్టి, పాల ప్యాకెట్ తెప్పించి రెడీగా కూర్చున్నాం.
సాయంకాలం ఎనిమిది అయ్యింది. ఐదు గంటలకు వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు.
“ఏమిటి ఇది?” — ఒకటే కంగారు.
“అసలే ట్రాఫిక్, దానికి తోడు వర్షం వచ్చేలా ఉంది” అని కంగారుపడి ఫోన్ చేస్తే,
“బండి మీద వాళ్లని తీసుకురావడం కుదరట్లేదు, ఆటో మీద తీసుకొస్తున్నాను. నేను వెనకాల ఫాలో అవుతున్నాను, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది” అని సమాధానం చెప్పాడు.

సరే, విషయం తెలిసింది కదా అని నిదానంగా కూర్చుంటే, అరగంటకు లిఫ్ట్ చప్పుడు అయ్యింది.

కుటుంబ సభ్యులంతా ఎలర్ట్ అయిపోయాం అతిధుల మర్యాదల కోసం.కాసేపటికి మా అబ్బాయి నవ్వుతూ చేతిలో రంగురంగుల పంజరం పట్టుకుని ముందుగా నడుస్తూ వచ్చాడు.

“మరి అతిధులు ఎక్కడ?” అనుకుంటూ వెనక్కి చూసే సరికి ఖాళీగా కనపడింది.
తీరా పంజరంలోకి తొంగి చూస్తే — నాలుగు తెల్ల లవ్ బర్డ్స్ పక్షి భాషలో మాట్లాడుకుంటూ కనబడ్డాయి!
“చుట్టాలు ఎక్కడ?” అని అడిగితే, నవ్వుతూ పంజరంలో పక్షుల్ని చూపించాడు.
ఆ రంగురంగుల పంజరం చూస్తే ముచ్చటగా అనిపించింది. లోపల నాలుగు పక్షులు — మూడు తెల్లగా, ఒకటి సిమెంటు రంగులో మెరిసిపోతూ విచిత్ర శబ్దాలు చేస్తూ ఉన్నాయి.
వాటిని చూస్తే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

అవి ఆడ పక్షులా మగ పక్షులా తెలియదు. ఆ పంజరంలో కుండ ఆకారంలో ఒక గూడు, ఆహారం నీరు పెట్టడానికి ప్రత్యేక సదుపాయం ఉన్నాయి.

ఆ గూడులో చిన్న చిన్న పక్షి పిల్లలు ముద్దుగా ఉన్నాయి.
ఎవరింటికైనా చుట్టాలు రావడం సహజం. కానీ మా ఇంటికి పక్షులు అతిథిగా రావడం చాలా అరుదైన విషయం.

ఈ ప్రత్యేక అతిధులు రాగానే ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఇల్లు పక్షుల శబ్దాలతో సందడిగా మారింది.

“వీటికి ఆహారం ఎప్పుడు పెట్టాలి? నీళ్లు ఎలా పోయాలి?” అంటూ మా వాళ్ళు పరిశోధనలు మొదలుపెట్టారు.
మొత్తానికి గుప్పెడు గింజలు, దోసెడు నీళ్లు నిర్ణీత ప్రదేశంలో పెట్టారు.
రెక్కల చప్పుడు చేస్తూ దొరికిన ఆహారాన్ని తినడం, పిల్లలకు కొంచెం పెట్టడం చూసి ఆనందం కలిగింది.
ఎక్కడో చెట్టు కొమ్మ మీద ఉండే పక్షి గూడు చూసినా మనసు తేలిపోతుంది. అలాంటిది మన చేతికి అందిన దూరంలో పక్షులు ఉండటం — మరింత ఆనందం.
అతిధుల్ని ఇంటికి తీసుకొచ్చాం, బాగానే ఉంది.
కానీ సకల మర్యాదలు చేయాల్సిన బాధ్యత మనదే.
భద్రమైన ప్రదేశంలో బస కూడా మనదే — ఎందుకంటే ఇవి నోరులేని మూగజీవాలు.

ఏదైనా ప్రమాదం జరిగితే బాధ చెప్పుకోలేని దేవుడి బిడ్డలు.
అందుకే భద్రంగా టీపాయ్ మీద పెట్టి, కిటికీ తలుపులన్నీ మూసి చూసుకుని పడుకుందామనుకున్నాం.

అప్పుడు అడిగాం మా అబ్బాయిని —
“ఇక ఈ అతిధుల కథ కమామీషు ఏమిట్రా?”
అప్పుడు అవినాష్ చెప్పడం ప్రారంభించాడు —
“ఈ అతిధుల కథ సినిమాటిక్ కట్ చేస్తే...” అంటూ

మియాపూర్ బస్టాండ్లో హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళే బస్సు వచ్చి ఆగింది.
ఒక వ్యక్తి దర్జాగా చేతిలో సూట్‌కేసు పట్టుకున్నట్టుగా ఈ పంజరం పట్టుకుని బస్సులోకి ఎక్కాడు.

సీటు నెంబర్ వెతుక్కుంటూ ఉండగా వెనకాల నుంచి బస్సు క్లీనర్ పరిగెత్తుకుంటూ వచ్చి —

“ఏవండీ, ఇది బస్సులో పట్టుకెళ్లడానికి వీల్లేదు! మధ్యలో చెకింగ్ ఉంటుంది. పట్టుకుంటే వన్యప్రాణుల స్మగ్లింగ్ కేసులో మమ్మల్ని బుక్ చేస్తారు!” అని చెప్పాడు.

“ఇవి నా పెంపుడు పక్షులండి. నేను నాలుగు వేల రూపాయలు పెట్టి కొన్నాను. ఎవరు అడిగినా సమాధానం చెబుతాను. కావాలంటే లగేజ్ చార్జ్ కూడా తీసుకోండి. ఇంట్లో ఎవరూ లేరు, అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి” అని జగదీష్ బతిమాలాడు.

క్లీనర్, డ్రైవర్ ఇద్దరూ “లేదండి, మమ్మల్ని ఊరుకోరు, లేకపోతే బస్సు దిగిపోండి” అని తేల్చేశారు.
ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా దగ్గరగా లేరు. అర్థరాత్రి రమ్మంటే ఎవరొస్తారు?
ఏం చేయాలో తెలియక జగదీష్ అయోమయంగా ఆలోచిస్తూ ఉండగా బస్సు పదిహేను నిమిషాలు ఆగిపోయింది. ప్రయాణికులు గొడవ మొదలుపెట్టారు.

“సార్, ఈ రాత్రికి ఈ పంజరం మా టికెట్ల ఆఫీసులో పెట్టి వెళ్ళండి. రేపు ఉదయం మీ వాళ్లను పంపి తీసుకెళ్లమనండి.”
భయంతోనూ, నిస్సహాయతతోనూ జగదీష్ అలా చేసాడు.
తర్వాత ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి “ఒక్క రోజుకి హెల్ప్ చేయండి” అని అడిగాడు.
స్నేహితులం ఎంత మంది ఉన్నా అందరూ తలో కారణం అని చెప్పారు. కారణాలు నిజమా అబద్దమా అని ఆలోచించే సమయం శక్తి జగదీష్ కి లేకపోగా ఆఖరి ఫోన్లో చివరికి ఒకే వ్యక్తి — అవినాష్ — సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు.
“బండి మీద తీసుకెళ్ళిపోవచ్చురా, ఎక్కువ పని లేదు. కాస్త ఆహారం నీరు పెట్టి ఉంచు. రెండు రోజుల్లోనే వస్తా” అని జగదీష్ హాయిగా నిద్రపోయాడు బస్సులో.

అనుకున్నట్టుగానే బండి మీద వెళ్లిన అవినాష్‌కి, బండి మీద పెట్టి తీసుకెళ్లవచ్చు గాని
“పిట్టలు ఉన్న పెట్టెను బండి మీద తీసుకురావడం అసాధ్యం” అని అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత అర్థమైంది. ఒప్పుకున్న బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి ఆటోలో పంజరాన్ని భద్రంగా తీసుకొచ్చాడు. 

అవి మాకు ఇచ్చిన ఆనందం వర్ణనాతీతం. మేము డబ్బు ఖర్చు పెట్టి చేసిన అతిథి మర్యాదలు ఏమీ లేవు — కానీ ఆ పక్షుల మధురమైన సన్నిధి మరపురానిది.
మాకే కాదు — వీడియో కాల్‌లో మా నాలుగేళ్ల మనవరాలికీ ఆనందం కలిగింది.
మరుసటి రోజు అవి వెళ్ళిపోయేటప్పుడు ఏదో తెలియని చిన్న బాధ కలిగింది.
సాధారణంగా ఎవరైనా అతిథులు వెళ్ళేటప్పుడు వీధి వరకు సాగనంపుతాం, చెయ్యి కలుపుతాం.
దగ్గర వాళ్లయితే కన్నీళ్లు పెడతాం.
కానీ ఇవి మూగజీవాలు — మన బాధ వాటికీ తెలియదు.
అడవిలో ఉండే పక్షులు ఇంటికి వచ్చి చేసిన అల్లరి వినసొంపుగా ఉంది.
అవి ప్రేమ పక్షులు — వాటిని ప్రేమగా చూడాలి.
వాటి మధ్య ప్రేమ శాతం ఎంత ఉందో మనం లెక్కించలేము కానీ, మనకైతే మూగజీవాల పట్ల ప్రేమ, కరుణ ఉండాలి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ
9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం