ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

ఆరోగ్యం వెర్సెస్ ఆహారపు అలవాట్లు.

ప్రతి జీవికి నిత్యవసరాలలో ముఖ్యమైనది ఆహారం. బ్రతుకు బండి సాగాలంటే శక్తి కావాలి. మనిషికి శక్తి తినే ఆహారo నుంచి 
పుడుతుంది. మనిషి శరీరము ఒక నడిచే కారు లాంటిది. కారు నడవాలంటే పెట్రోల్ పోయాలి. అలాగే మనిషి శరీరానికి కూడా
సమతుల ఆహారం అందించాలి. విటమిన్లు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు శరీరానికి కావలసిన రక్షణను శక్తిని ఇస్తాయి. శాఖాహారులందరూ బియ్యం ఆకులు పండ్లు కాయలు గింజలు ఆహారంగా స్వీకరిస్తారు. మాంసాహారులు వీటితో పాటు జంతువుల మాంసం ఆహారంగా తీసుకుంటారు. అయితే తీసుకునే ఆహారాన్ని పరిమితంగా తినడం, పరిశుభ్ర వాతావరణంలో వండిన పదార్థం తినడo,వేళకు తినడం లాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిలో ఏ నియమం తప్పిన ఆహారం విషతుల్యమవుతుంది. అది మన శరీరానికి మంచి బదులు చెడు చేస్తుంది. 
పూర్వకాలంలో తొలి రోజున వండిన ఆహార పదార్థాలను ముట్టుకునేవారు కాదు . అది మడి కాదు ఆచారంకాదు. ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్త.ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లులలో వండిన ఆహార పదార్థాలు దాచుకుని రెండు మూడు రోజుల వరకు ఉంచుకుని తింటున్నారు.
ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అన్న విషయం వారికే వదిలేయాలి. 

బజారు నుండి తీసుకుని వచ్చిన కూరగాయల్ని పండ్లని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని అప్పుడు దాచుకోవాలి. కారణం ఈ రోజుల్లో పంటలన్నీ రసాయనాలతోటి ఎరువులు తోటి పండిస్తున్నారు. సహజసిద్ధమైన పంటలు కాదు కాబట్టి ఒకటికి రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి.ఆ మధ్య కాలంలో కరోనా సమయంలో ముఖ్యంగా బయట నుండి ఇంటికి చేరే ప్రతి వస్తువు విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించేవారు. ఆధునిక కాలంలో మహిళలు కూడా ఉద్యోగస్తులు కావడం చేత ఇటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో కొంత అలసత్వం కనబడుతోంది. దాని మూలంగా ముఖ్యంగా పిల్లలు పెద్దలు అనారోగ్యo పాలవుతున్నారు.
వంట చేయడమనేది ఒక పూజ లాంటిదే . పూర్వీకులు కట్టెల పొయ్యి మీదవంట చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఇత్తడి పాత్ర పొయ్యి మీద పెట్టి దైవాన్ని తలుచుకుని కడిగిన బియ్యం ఆ కట్టెల మంటలో వేసేవారు. అది అగ్నిదేవుడికి సమర్పించినట్లుగా భావించేవారు . ఇది నేను ప్రతి రోజు మా అమ్మగారు వంట చేసేటప్పుడు గమనించేవాడిని . ఓ ఆహార పదార్ధాలు మీద వేసే మూతల విషయంలో కూడా అతి జాగ్రత్తలు తీసుకునేవారు.

  ఇక తినే ఆహార విషయంలో పూర్వీకులు తీసుకున్న జాగ్రత్తలు 
మనం తీసుకోవడం లేదని చెప్పాలి. వారు మనిషి పరిస్థితిని బట్టి వయసును బట్టి తగిన ఆహారం ఇచ్చేవారు. చంటి పిల్లలకి ముద్దపప్పు నెయ్యితో చారు కలిపి పెట్టేవారు. 
వేడి చేసిన శరీరం ఉంటే సగ్గుజావలిచ్చేవారు. ఆహార పదార్థాలలో ముఖ్యంగా చారు ప్రతిరోజు ఉండేది. ఆరోగ్య రీత్యా చారు ఎంతో మేలు చేస్తుంది.

  ఆధునిక కాలంలో యువత సరైన ఆహారo తీసుకోవడం లేదని చెప్పాలి. ముఖ్యంగా వేళ కాని వేళలో ఆహారం తీసుకోవడం
  బజార్లో ఏది పడితే అది తినడం అది అలవాటుగా మారింది.
  నేటి యువత షిఫ్ట్ డ్యూటీలో పనిచేయడం కూడా అనారోగ్యానికి కారణం అయింది. ముఖ్యంగా బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే వారిని తీసుకుని బయట హోటల్లో తినడం
అలవాటుగా మారింది . అదొక రకమైన ఆనందం. ఆనందం వెనుక శరీరానికి జరిగే చెడు చాలా కనిపిస్తోంది. ఒకటి అనవసరపు ఖర్చు రెండవది అనారోగ్యం. బయట తినే హోటల్ లో పరిశుభ్రత ఎంతవరకు ఉందని మనం అంచనా వేయలేం. ఇక ఆహార పదార్థాల నాణ్యత ను తనిఖీ చేసే ప్రభుత్వ విభాగాలు పనితీరు ఎలా ఉందో దేవుడికే తెలియాలి.

 అందమైన టేబుళ్లు స్పూన్లు పింగాణీ ప్లేట్లు నీలిరంగు బల్బుల వెలుగులలో మనల్ని ఆకర్షించి జేబులకు చిల్లు పెడుతున్నాయి.
ఖర్చులు బడ్జెట్కు మించిపోతున్నాయి. పుట్టినరోజుకో పెళ్లిరోజుకో సరదాగా వెళ్లి రావచ్చు. ప్రతి ఆదివారం ఇదే నోముగా చేస్తే ఫలితం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. 

రంగులు వేసిన స్వీట్లు మసాలా తగిలించిన హాట్లు
ఇవే ఆధునిక వంటలు. బజార్లో రంగురంగుల డబ్బాలో అందంగా కనబడి ఆకర్షిస్తున్నాయి. దానికి తోడు రకరకాల ఫుడ్ వెబ్సైట్లు విపరీతంగా పెరిగి రకరకాల కొత్త వంటలు పుట్టుకొచ్చి ఆరోగ్యానికి హానిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతని ఈ వెబ్సైట్లు చాలా ఆకర్షిస్తున్నాయి. 

  మా చిన్నతనాల్లో మినప సున్నుండలు జంతికలు కారప్పూస
  మినప రొట్టె పిల్లలకు చిరుతిళ్లుగా పెట్టేవారు. మినుము ఇనువంత బలం చేస్తుంది ఎముకలకు గట్టి గట్టిదనం చేకూరుస్తుంది. అలాగే పల్లెటూర్లలో విరివిగా దొరికే నేరేడు పళ్ళు జామకాయలు సీమ చింతకాయలు మొక్కజొన్న పొత్తులు అటుకులు చింతకాయలు రేగు పళ్ళు సీతాఫలాలు తేగలు అరటి పళ్ళు ఆ కాలం పిల్లలు పె ద్దలు ఎక్కువగా తినే వాళ్ళు. ఏ వస్తువులో ఏ ఔషధీయ గుణం ఉందో తెలియదు గానీ అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. దానికి తోడు ప్రతి ఇంట్లోనూ పశువులు ఉండేవి. పాలు తీసిన వెంటనే పిల్లలచే తాగించారు. వాటిని గుమ్మ పాలు అంటారు. నేడు గుమ్మ పాలు పోయి బొమ్మ పాలు మనకు దిక్కయింది. ఏ కాలంలో లభించే వస్తువు ఆ కాలంలో తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నేటి పిల్లలకి వీటి గురించి తెలియదు. యువత అంతా చాట్ బండ్లు చుట్టూ చేరుతున్నారు. అంత చిన్న వయసులో ఆ మసాలా దినుసులు శరీరానికి ఎంతవరకు మేలు చేస్తాయి అనే విషయం ఆలోచించుకోవాలి. 
పిల్లలకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. వీధి బండి దగ్గర తినడం వల్ల అలవాటును మాన్పించాలి. చక్కగా ఇంటిలో రుచికరంగా శుభ్రంగా చేసి పెట్టాలి. ఆధునిక వంటకాలను అలవాటు చేయకుండా శరీరానికి మేలు చేసే పదార్థాలను బలవంతంగా అయినా అలవాటు చేయాలి. రోజులను బట్టి ఇది తప్పదు.ఏదైనా మితంగా తింటే తప్పులేదు. రోజు అదే పనిగా తింటే మూల్యం చెల్లించక తప్పదు.

పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడిక తో పాటు
మంచి ఆహారపు అలవాట్లు కూడా నేర్పవలసినది తల్లిదండ్రులే.
జ్ఞానం లేని పిల్లలు దేనికి పడితే దానికి ఆకర్షింపబడతారు.
దానికి తోడు హాస్టల్లో చదివించే విద్యార్థుల పరిస్థితి కూడా అంతే. 

ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమంటేనే ఆహారపు అలవాట్లు.
భావిభారత పౌరులందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచవలసిన
బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. విపరీతంగా పుట్టుకొచ్చే
హోటల్స్ లో ,రోడ్డు పక్కన ఉండే బండి మీద అమ్మే ఆహార పదార్థాల తనిఖీ ఖచ్చితంగా చేయాలి. తనిఖీ లేకపోతే భయం ఉండదు. భయం ఉంటేనే నాణ్యత ఉంటుంది. ప్రజలు కూడా పరిసరాలను గమనించుకుంటూ పరిశుభ్రంగా ఉండే చోటే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవసరమైన చోట ప్రశ్నించాలి.
పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
   తస్మాత్ ఆరోగ్యం జాగ్రత్త.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం