జంతువు అయితేనేమి

జంతువు అయితేనేమి

ప్రతి మానవుడు గుడిలో విగ్రహాన్ని ఇంటిలో దేవుడి పటములను
పూజించడం , గణపతి నవరాత్రులలో గణపతిని పూజించడం దేవీ నవరాత్రులలో దేవిని పూజించడం సర్వ సాధారణమైన విషయం. అయితే మానవుడు దేవుళ్ళతో పాటు ఆవు వంటి సాధు జంతువులను పాములను కప్పలను కూడా పూజించడం మనం ఎరుగున్న విషయమే.
అయితే మనం హిందువులు జరుపుకునే పండుగలు అన్ని దేవతామూర్తులకు సంబంధించినవే కాకుండా జంతువులు కూడా ఆ పండుగలలో ప్రధానంగా పూజించబడతాయి. ఉదాహరణకి కనుమ పండుగ రోజున ఎద్దులను అలాగే నాగుల చవితి రోజున పుట్టలో ఉన్న పాములను పూజించడం జరుగుతుంది. ఏ కాలంలో చూసిన పశుపక్ష్యాదులు జంతువులు
కూడా మానవునికి సహాయ సహకారాలు అందిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నాయి. ప్రతిఫలంగా మానవుడు వాటికి పూజలు చేసి ప్రసాదాలు పెట్టి రుణం తీర్చుకుంటున్నాడు.

హిందువులందరికీ ఆవు పవిత్రమైన జంతువు. శుభ అశుభ కార్యక్రమాలకు కూడా ఆవును పూజించడం మన సాంప్రదాయం.
గృహప్రవేశం వంటి శుభకార్యాలకు ముందుగా ఆవును దూడను 
కొత్త ఇంటిలోకి ప్రవేశపెడతారు. మనం ఆవుని గోమాత అంటాం
ఇక చనిపోయిన వారు ఆవు తోక ద్వారానే పుణ్య లోకం చేరుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే గోదానం ఇవ్వడం జరుగుతుంది. 
ఇక కనుమ పండగ రోజున వ్యవసాయంలో రైతుకు సాయంగా ఉండే ఎద్దులను పూజిస్తారు.

వినాయక చవితి రోజున అత్యంత అల్పప్రాణి మరియు వినాయకుడి వాహనమైన ఎలుక వినాయకుడి తో పాటు పూజలు అందుకుంటుంది. అలాగే దుర్గాదేవి వాహనమైన సింహము దుర్గాదేవితోపాటు దేవి నవరాత్రులలో పూజలు అందుకుంటుంది.

అలాగే గోడ మీద పాకే బల్లిని చూస్తే అందరికీ భయం. అది మన మీద పడిన ఆహార పదార్ధాలు మీద పడిన దోషం. కానీ ప్రధానంగా కంచి పుణ్యక్షేత్రంలో బంగారు బల్లిని ముట్టుకుంటే దోషాలు తొలగిపోతాయని అని నమ్మిక. 

దేశంలో వర్షములు లేక అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు
మన గ్రామాల్లో నీటిలో తిరిగాడే కప్పలను పూజిస్తారు. ఆ విధంగా పూజిస్తే వర్షాలు కురుస్తాయని వారి నమ్మిక.

మనిషిని చూస్తే పారిపోయే ఉడత భగవంతుడికే సహాయం చేసి 
కృతజ్ఞతాపూర్వకంగా శ్రీరామచంద్రుడు ప్రసాదించిన మూడు చారలను తన ఒంటి మీద ధరించింది. ఉడతా భక్తిగా ప్రజల చేత తరతరాలుగా కొనియాడబడుతోంది.

ఇక యజమాని అంటే అత్యంత విశ్వాసం చూపించేది కుక్క.
రాత్రి పగలు యజమాని ఇంటికి కాపలా ఉండి అత్యంత ప్రేమగా ఇంటిలోనే పసిపాప లాగా పెంచబడుతుంది. వీధిలో ఉండే కుక్క కూడా కొత్త మనిషిని చూస్తే మొరుగుతూ ప్రజలకు హెచ్చరిక చేస్తుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనేక కేసుల పరిష్కారానికి ఈ జంతువు మీదే ఆధారపడతారు.

గాడిదలు అరుపు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. పూర్వకాలంలో రజకులకి గాడిదలను మాసిన బట్టల మూటలు మోస్తూ చాలా సహాయ సహకారాలు అందించేవి.
 ఈ ఆధునిక కాలంలో ఇవి కనపడవు.

ఏ దేశ చరిత్ర పరిశీలించిన రాజుల సైన్యాలలో గుర్రములు ఉండేవని, రాజులు గుర్రపు స్వారీ చేసే వారని ,ఒక ఊరి నుండి మరొక ఊరికి పోవాలంటే గుర్రపు బండిని ఉపయోగించే వారిని తెలుస్తుంది. ఈ కాలంలో అక్కడక్కడ గుర్రపు బండి లు కనబడతాయి. ఆ కాలంలో రాజుల దినచర్యలో గుర్రం అనే జంతువు చేదోడువాదోడుగా ఉండేది.

ఇక హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి వారికి పెద్దపులి వాహనంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్షా సమయంలో
స్వామివారితో పాటు ఈ జంతువు కూడా పూజలు అందుకుంటోంది .

అలాగే దేశంలో తపాలా వ్యవస్థ లేనప్పుడు పావురాల ద్వారా సందేశాలు పంపేవారు. ఆ విధంగా నోరులేని ప్రాణి మానవుడికి ఎంతో సహాయ సహకారాలు అందించేది.
కోతి చేష్టలు అంటే ఎవరికైనా నవ్వు పుట్టిస్తాయి. ఆ వానరం అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామిగా మనం పూజిస్తుంటాం.
అసాధ్యమైన కార్యం జరగాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన
ఎక్కువగా చేస్తారు. ఈ కాలంలో అడవులన్నీ నశించి ఆహారం దొరకక కొన్ని ప్రాంతాల్లో కోతులు రోడ్లప్రక్కనకనబడుతుంటాయి. దారిన పోయే దానయ్యలు మీకు తోచిన మంచి ఆహారం ఇచ్చి వాటిని కాపాడండి. నిత్యము కూడా మనం భోజనం చేసే ముందు ఒక ముద్ద గోడ మీద పెడితే కొన్ని ప్రాణులకు అయినా ఆకలి తీర్చగలం. మనిషికి ఆకలి వేస్తే ఒక ముద్ద పెట్టమని నోరు తెరిచి అడుగుతాడు. నోరులేని జీవి తన ఆకలిని ఏ విధంగా చెప్పగలదు. పొలంలో ఉండే పశువు రైతును చూడగానే అరిచే అరుపులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. అది ఒక్క రైతుకు మాత్రమే తెలుస్తుంది. రోజు గోడ మీద ఒక ముద్ద పెట్టడం మనకేమీ బరువు కాదు. విషయం తెలుసుకుంటే వెలకట్టలేని మానసిక సంతృప్తి.

రాజస్థాన్ ఎడారులలో ఒంటె ప్రయాణ సాధనమే మానవుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది . రామచిలక కు చిలక పలుకులు నేర్పి మనిషి మానసిక ఆనందం పొందుతాడు.
సాక్షాత్తు పరమశివుడికి తన చర్మం ఆసనంగా ఇచ్చి జన్మ సార్థకత చేసుకుంది గాండ్రించే పులి. 

రామాయణంలో ప్రముఖ పాత్ర వహించి రామ రావణ యుద్ధానికి కారణం అయింది ఒక మాయ లేడి. నిజానికి అది మాయ లేడి కాదు . మంచి కన్నులు ఉన్న జంతువు.

కార్తీకమాస శుద్ధ చవితి రోజున బుసలు కొట్టే నాగన్న ని పూజించి నాగుల చవితి పండుగ జరుపుకుంటాం. ఈ నాగన్న ఏకంగా పరమాత్ముడు మెడలోనే హారమై కూర్చుంది.

ఇలా ప్రతి జీవి మానవుడికి ఏదో రకంగా ఉపయోగపడుతునే ఉంది.మనిషి మాత్రం తన ఆహారం కోసం జంతువుల పీక పిసికి చంపుతున్నారు. మనిషి తన సరదా కోసం జంతువులను వేటాడి చంపుతున్నాడు. అడవులను సర్వ నాశనం చేస్తున్నాడు.  
మనిషి ప్రకృతితో మమేకమైతనే ఆనందంగా ఉండగలడు.
సంప్రదాయాలు పాటిస్తేనే ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతుంది. పిల్లలందరికీ జంతువుల పట్ల ప్రేమ 
కలిగించండి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
          కాకినాడ 9491792278

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సామర్లకోట

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం