ఆవకాయ
ఆవకాయ అందమైన అమ్మాయి కళ్ళను చెరువులో పెరిగే కలువ పూలతో పోలుస్తారు. ఈ కలవ పూలు రెండు రకాలు. ఒకటి తెలుపు మరొకటి ఎరుపు. ఈ ఎర్ర కలువ పూలు చూడగానే నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. మన వంటింట్లో కుండలో ఉన్న ఆవకాయ కూడా ఎర్రగా నూనెలో తేలుతూ కలువ పువ్వు లాగా నాకు అనిపిస్తుంది. ఆకులో పంచభక్ష పరమాన్నలున్న ఆవకాయ ముక్కలేకపోతే విస్తరి చిన్నబోతుంది. ఆంధ్రుడిగా పుట్టినవాడు ప్రతివాడు ఆవకాయ అంటే చాలా ఇష్టపడతాడు. విదేశాల్లో ఉన్న కోరి మరీ తెప్పించుకుంటాడు.ఆంధ్రుడికి ఆవకాయకి చాలా అవినాభావ సంబంధo వుంది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సందడి మొదలవుతుంది.కారణం ప్రధానంగా ఆవకాయకి కావలసిన మామిడి కాయలు కాసే కాలం. నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకునే కాలం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చళ్ళని ఎండ పెట్టి నిలువ చేసుకుంటే సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఆవకాయ ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. తెలుగు వాడు విస్తరిలోకి ఏమీ లేకపోయినా పెరుగన్నము ,ఆవకాయతో పూట గడిపేసుకుంటాడు. ఇదే విషయం శ్రీనాథ మహాకవి ఆవకాయతోటి తన అనుభవం పద్య రూపంలో చెప్పారు. ఈ విషయం ఒక కవి మిత్రుడు చెప్పాడు నాకు. అంటే ఆవకాయ అతి ప్రాచీనమైందని తెలు...