పోస్ట్‌లు

పసి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పండుగ వచ్చినపుడు పసితనం

ఏదైనా పండగ వచ్చిందంటే అరవై ఏళ్ళ వాడిని పదేళ్ల పసివాడిగా మారిపోతాను. ఊరిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో అలా అయిపోతాను. బాల్యపు అనుభూతులన్నీ చక్రం తిరిగినట్లు నా కళ్ళ ముందు తిరుగుతాయి. ఇవాళ సుబ్రహ్మణ్య షష్టి. నగరంలో ఉంటే పండగల హడావుడి ఉండదు. పల్లెటూర్లోనే పండగ వాతావరణం తెలుస్తుంది. గోదావరి జిల్లాలో ఉండే చిన్న చిన్న గుడులు దగ్గర కూడా తీర్థాలు జరుగుతాయి. మనది అసలే గోదావరి జిల్లా. ఇంకేముంది! పండగలు, పబ్బాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అచ్చంగా పాటించే పల్లె సీమలు ఉన్న ప్రదేశం. పవిత్ర గోదావరి ప్రవహించే ప్రదేశాలతో పాటు పుణ్యక్షేత్రాలు ఎన్నో. ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవుళ్లకి జరిగే ఉత్సవాలు, తీర్థాలు లెక్కలేనన్ని. అప్పట్లో తీర్థాలు, ఉత్సవాలు మాకు ఎక్కువ ఉత్సాహాన్ని, వినోదాన్ని ఇచ్చేవి. ఆ తీర్థాలకు వెళ్లడం అంటే ఒక సరదా. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు “తీర్థంలో ఏదైనా కొనుక్కో” అంటూ ఇచ్చే సొమ్ము జేబులో పెట్టుకుని, సైకిళ్లు తొక్కుకుని ఊరికి దూరంలో ఉండే దేవాలయాల దగ్గరికి వెళ్లడం—అదొక పెద్ద సరదా. దేవాలయం ప్రాంగణం పచ్చటి తాటాకు పందిళ్లతో, ఆ పందిళ్లు చిన్న చిన్న ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరించబడి చాలా అందంగా ఉండేది. అ...