పండుగ వచ్చినపుడు పసితనం



ఏదైనా పండగ వచ్చిందంటే అరవై ఏళ్ళ వాడిని పదేళ్ల పసివాడిగా మారిపోతాను. ఊరిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో అలా అయిపోతాను. బాల్యపు అనుభూతులన్నీ చక్రం తిరిగినట్లు నా కళ్ళ ముందు తిరుగుతాయి.

ఇవాళ సుబ్రహ్మణ్య షష్టి. నగరంలో ఉంటే పండగల హడావుడి ఉండదు. పల్లెటూర్లోనే పండగ వాతావరణం తెలుస్తుంది. గోదావరి జిల్లాలో ఉండే చిన్న చిన్న గుడులు దగ్గర కూడా తీర్థాలు జరుగుతాయి.

మనది అసలే గోదావరి జిల్లా. ఇంకేముంది! పండగలు, పబ్బాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అచ్చంగా పాటించే పల్లె సీమలు ఉన్న ప్రదేశం. పవిత్ర గోదావరి ప్రవహించే ప్రదేశాలతో పాటు పుణ్యక్షేత్రాలు ఎన్నో. ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవుళ్లకి జరిగే ఉత్సవాలు, తీర్థాలు లెక్కలేనన్ని. అప్పట్లో తీర్థాలు, ఉత్సవాలు మాకు ఎక్కువ ఉత్సాహాన్ని, వినోదాన్ని ఇచ్చేవి.

ఆ తీర్థాలకు వెళ్లడం అంటే ఒక సరదా. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు “తీర్థంలో ఏదైనా కొనుక్కో” అంటూ ఇచ్చే సొమ్ము జేబులో పెట్టుకుని, సైకిళ్లు తొక్కుకుని ఊరికి దూరంలో ఉండే దేవాలయాల దగ్గరికి వెళ్లడం—అదొక పెద్ద సరదా. దేవాలయం ప్రాంగణం పచ్చటి తాటాకు పందిళ్లతో, ఆ పందిళ్లు చిన్న చిన్న ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరించబడి చాలా అందంగా ఉండేది.
అక్కడకు వచ్చే ప్రజలలో కొంతమంది భక్తులు, మరి కొంతమంది భక్తుల మీద వ్యాపారం చేసుకునే వాళ్లు, మరి కొంతమంది పొట్ట గడవక వచ్చిన వాళ్లు, మరి కొంతమంది వినోదం కోసం వచ్చే కుర్రాళ్లు—ఇలా రకరకాల ప్రజలతో గుడి ప్రాంగణమంతా నిండిపోయి ఉండేది. చిన్నపిల్లలు బొమ్మలు కొనలేదని ఏడుపులు, పెద్దవాళ్ల కేకలు, దుకాణదారుల అరుపులు, గుడిలోని మైక్‌ సెట్ నుంచి వినిపించే స్వామికి జరిగే అభిషేక పూజలతో కోలాహాలంగా ఉండేది. ఒకరికి మాట ఒకరికి వినిపించే వాతావరణం ఉండేది కాదు.

దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఇంక దుకాణాల మీద పడేవాళ్లం. ముందుగా తీర్థానికి వెళుతుంటే “జీళ్లు తప్పకుండా తీసుకురారా” అంటూ చెప్పే పెద్దవాళ్ల మాటలు గుర్తుకు వచ్చి ఆ చెట్టు దగ్గరికి నడిచేవాళ్లం. ఆ దుకాణం చుట్టూ ఆరేళ్ల పసివాడి దగ్గర నుంచి అరవై ఏళ్ల ముసలి వాళ్లు బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా ఉండేవారు. అప్పట్లో ఆ బెల్లం జీడి అంటే అంత క్రేజీ! ఒకసారి నోట్లో పెట్టుకుంటే గట్టిగా ఉండి, నోట్లో నానుతూ ఒక్కొక్క బెల్లం రసం గొంతు దిగుతుంటే అద్భుతంగా ఉండేది.

తీర్థం నుంచి ఇంటికి వెళ్లే ముందు, సైకిల్ ఎక్కే ముందు, నోట్లో పెట్టుకుని చీకుతూ సైకిల్ తొక్కుతూ ఇంటికి వెళ్ళిపోవేవాళ్లం. అలసట తెలిసేది కాదు. దృష్టి అంతా బెల్లం జీడి మీద ఉండేది. ఇంకొక పక్కనే ఖర్జూర పండు. దాని మీద ఈగలు ముసురుతున్న ఖర్జూర పండు కొనుక్కోకుండా తీర్థం నుంచి ఇంటికి వచ్చిన రోజులు లేవు.

ఇంటిదగ్గర “గుండాట ఆడకు” అంటూ చెప్పి పంపించినా మనసు ఆట వైపు లాగేసింది. దానికి తోడు స్నేహితులు కూడా “మీ ఇంటి దగ్గర చెప్పను లేరా?” అంటూ ఉత్సాహపరిచేవారు. ఇంకేముంది! ఒళ్ళు మరిచిపోయి ఆ గుండాట ముందు కూర్చుంటే సమయం తెలిసేది కాదు. ఇంతకీ అదొక వ్యసనం. ఒక డబ్బాలో చిన్న చిన్న నలుపు ప్లాస్టిక్ దిమ్మలు నలుచదరం ఆకారంలో ఉండి, ఒకటి నుండి పది అంకెలు వేసి ఉంటాయి. ఆటగాళ్లు తమకు నచ్చిన అంకె మీద సొమ్ము కాపు కాస్తారు.

ఆ ప్లాస్టిక్ నలుపు దిమ్మలన్నీ ఒక డబ్బాలో వేసి గిలకరించి, బోర్డు మీద తిప్పుతాడు. మనం కాపు కాసిన నెంబర్ కనుక వస్తే, మన సొమ్ముకి రెట్టింపు సొమ్ము ఇస్తారు. లేదంటే మన సొమ్ము ఆ వ్యాపారి గల్లా పెట్టెలోకి పోతుంది. ఒకసారి గెలుపొందితే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం! గెలుపు ఊరికినే కూర్చోనివ్వదు—మళ్లీ మళ్లీ పోటీలో పాల్గొనేలా ప్రేరేపిస్తుంది. అదే వ్యసనంలో ఉన్న గొప్పతనం. లాభం మాట దేవుడెరుగు! తెచ్చిన సొమ్ము జేబులోకి చేరేంతవరకు ఆట ఆడేవాళ్లు.

ఎందుకంటే ఇంటి దగ్గర ఇచ్చిన వాగ్దానాలు—చెల్లెలికి గాజులు, రిబ్బన్లు, తమ్ముడికి కళ్ళజోడు, విజిల్స్ కొన్ని తెస్తానని—నెరవేర్చాలి కదా మరి!

ఈలోగా అలా చూసేసరికి చెరువు పక్కనే నులక మంచం మీద సత్తు పళ్లాలలో రకరకాల తినుబండారాలు పెట్టి అమ్ముతూ ఉండేవారు. నోరు ఊరించే బెల్లం మిఠాయి, సీనా మిఠాయి, కారప్పూస, ఉల్లి పకోడీ, వేడి వేడి జిలేబి, పాకం కారే మడత కాజా—ఆ దుకాణం చుట్టూ కూడా జనం.

పండగ నాడు ఎవరు కొనుక్కుంటారని అనుకున్నా, చేతిలో చంటి బిడ్డతో ఒక ముష్టిది దాతలు ఇచ్చిన సొమ్ముతో పిండి వంటలు కొనడానికి వచ్చింది. అప్పుడు అర్థమైంది—ఎంతోమంది ఈ దేశంలో పండగ నాడు కూడా పరమాన్నం తినటం లేదని. ఏమిటో సృష్టి! దేవుడి మాయ. అమ్మ అన్ని అమర్చి పెడుతుంటే ఏమీ తెలియదు. బయట ప్రపంచం తెలియదు.

అలా ముందుకు నడిచి వస్తుంటే, దారిలో బూరాలమ్మే బుడ్డిది, బుడగలు అమ్మే బుడగోడు హడావిడిగా అటుఇటు తిరుగుతూ కనిపించేవారు. వాళ్ల జీవనోపాధి ఇదే. ముక్కు పచ్చలారని వయసులో మూడు పూటలు గడవాలంటే ఈ యాతన తప్పదు. ఆ చిట్టి భుజాల మీద ఏమి బాధ్యతలు ఉన్నాయో ఎవరికి తెలుసు!

అమ్మానాన్నల నీడలో అపురూపంగా పెరగవలసిన బుడతలు ఒంటిమీద సరైన దుస్తులు లేకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా బతుకు యాతన. అదే జాతరలో, అమ్మ ఒడి నుండి కిందకు దిగకుండా వీరి దగ్గర సరుకు కొనే పసిబిడ్డలే వీరికి కస్టమర్లు. భగవంతుడుది ఎంత మాయ! ఇద్దరూ మనుషులే—పరిస్థితులే వేరు. అవసరం ఉన్నా లేకపోయినా పెద్దలు పిల్లలు వీరి దగ్గర సరుకు కొంటే భగవంతుడికి పూజలు చేసినంత ఫలితం.

దారిలో చంటి బిడ్డలు రంగురంగుల కళ్ళజోడు పెట్టుకుని కనిపించేవారు. పిల్లలకు ప్రపంచమంతా రంగుల మయంగానే కనబడుతుంది. కానీ పెద్దయ్యాక తెలుస్తుంది అసలు రంగు—అది రంగుల లోకం కాదు, మాయలోకం అని. ఎదిగే పిల్లలను ఆ మాయాలోకం వైపు నడిపించకుండా చూడవలసిన బాధ్యత పెద్దలదే.

ఎక్కడి నుంచో శృతి లేని వేణు గానం వినపడుతోంది. “ఏమిటా?” అని చూస్తే వెదురు వేణువులు అమ్ముతూ కనిపించేవారు. ఆ వేణువులు సప్త స్వరాలు పలికించలేకపోయినా చంటి బిడ్డకు ఆట వస్తువు. ఆ యువకుడి ఉపాధికి అదే ఆధారం.

ఆ పక్కనే పిల్లలందరూ గుమిగూడి ఉన్నారు. ఆ నేల మీద పరచిన రంగు దుప్పటి మీద లక్క పిడతల నుండి విమానం బొమ్మల వరకు అన్నీ పేర్చి అందంగా అమర్చి ఉండేవి. 
ఈ లక్క పిడతల్లో ఒక సంసారానికి పనికొచ్చే సామానంతా ఉండేది. 

ఈ రోజూ అలానే తీర్థం దారి కళ్ల ముందుకొచ్చింది. కానీ ఇప్పుడు నేను చిన్నవాడిని కాదు, ఆ సైకిల్‌ కూడా లేదు, ఆ జీడి బెల్లం రుచి కూడా దొరకదు. అయినా పండగ వచ్చిందంటే మనసు మాత్రం పాత దారినే పరుగెడుతుంది. బాల్యపు జ్ఞాపకాలే మనిషికి నిజమైన పరమాన్నం. అవి తినకపోయినా తృప్తి, మాట్లాడకపోయినా మనసునిండా మధురం.

జీవితం ఎంత ముందుకు వెళ్లినా, ఎంత మార్పులు వచ్చినా, మనసు మాత్రం ఒక మూలన పల్లె దారిని, గోదావరి గాలిని, జాతర గోలని, చిన్న చిన్న సంతోషాలను దాచుకుంటుంది. ఆ రోజులు తిరిగి రావు, కానీ గుర్తులు మాత్రం ప్రతీ పండగకూ తిరిగి వస్తాయి—అదే జీవితం ఇచ్చిన పెద్ద వరం.

---

రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ – 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం