ఆణిముత్యం


మనిషి భావాలను ప్రత్యక్షంగా ఆవిష్కరించే సమగ్ర కళ నాటకం. కేవలం చదివే సాహిత్యంతో పోలిస్తే, నాటకం కళ్ల ముందు కదిలే కవిత్వం. ఇందులో కథ, సంభాషణ, నటన, సంగీతం, వేషధారణ, వేదిక—అన్నీ కలిసిపోతాయి. అందుకే దీనిని దృశ్యకావ్యం అంటారు.


ఈ కళ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకుడికి వినోదం అందించడమే కాకుండా సమాజ ప్రయోజనం కూడా రచయిత ఆశించేవాడు అప్పట్లో. ఆనాడు సమాజంలో ఉండే దురాచారాలు కథా వస్తువుగా తీసుకుని నాటకాలు వ్రాసేవారు. గురజాడ వారి కన్యాశుల్కం ఒక సామాజిక ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది అయితే కాళ్ళకూరి నారాయణరావు గారి వరవిక్రయం నాటకం మరొక సాంఘిక దురాచారం గురించి సమాజానికి తెలియజేసింది. 


ఒక రచయిత రచన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆ రచయిత గురించి కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం. ఈ నాటక రచయిత శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు గోదావరి జిల్లాలలో జన్మించిన రచయితలలో ఒకరు. వృత్తిరీత్యా అధ్యాపకుడైనప్పటికీ సంఘసంస్కరణ అంటే మక్కువ. 


అందుకే ఆనాటి సంఘంలోని దురాచారాల్ని ఖండిస్తూ వరవిక్రయం నాటకం తో పాటు వేశ్యవృత్తిని ఇతివృత్తంగా చేసుకుని చింతామణి అనే నాటకం కూడా వ్రాశారు. ఈ చింతామణి అనే నాటకం తెలుగు నాట ప్రదర్శించబడని వీధి ఉండదు అనేది అతిశయోక్తి కాదు. అందులోని సంభాషణలు ఈనాటికీ ప్రజల నోర్లలో నానుతూ ఉంటాయి. 


ఈ నాటకం ఇతివృత్తం వరకట్నం అయినప్పటికీ ఈ నాటకాన్ని పాత్రల మధ్య సంభాషణలు హాస్యరస ప్రధానంగా వ్రాయడం వల్ల ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతోంది ఈనాటికి కూడా .


 పుణ్యమూర్తుల పురుషోత్తమరావు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ రిజైన్ చేసి తన ఇద్దరు కుమార్తెలు కాళింది కమల లకు పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్లిళ్ల పేరయ్యని సంప్రదిస్తాడు. అయితే పురుషోత్తం రావు గారి భార్య సింగరాజు లింగరాజు గారి దత్తత పుత్రుడు బసవరాజు సంబంధం అంటే మక్కువ చూపుతుంది. సింగరాజు లింగరాజు వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ పరమ లోభిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సింగరాజు లింగరాజు గారి అబ్బాయి బసవరాజుకి కాళిందినీ ఇచ్చి వివాహం చేయడానికి ఐదువేల ఐదు వందల రూపాయలు కట్నం గా ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు.


 ఇందుకోసం బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు ఒకసారి పరిశీలించండి.


♦️మీకొమార్తె చి॥ సౌ॥ కాళిందిని, నాకొమారుడు చి॥ బసవరాజునకు చేసికొనుటకు, అందులకై మీరు మాకు కట్నం క్రింద ఐదువేలు యైదువందల రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండిచెంబులు, వెండికంచము, వెండిపావుకోళ్ళు, పట్టుతాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా ఇచ్చుటకున్నూ, ప్రతిపూఁటఁ పెండ్లివారిని బ్యాండుతో పిలుచుటకున్నూ, రాకపోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకున్నూ, రెండుసారులు పిండివంటలతో భోజనములు, మూడుసారులు

కాఫీ, సోడా, ఉప్మా, యిడ్డెన, దోసె, రవ్వలడ్డు, కాజా, మైసూరు .

మైసూరు పాకాలతో ఫలహారములు చొప్పున మా యిష్టానుసారము ఐదు దినములు మమ్ము గౌరవించుటకున్నూ, అంపకాలనాడు మాకు పట్టుబట్టలు, మాతో వచ్చువారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకున్నూ నిర్ణయించుకొని బజానా క్రింద పదిరూపాయలు ఇచ్చినారు గాన ముట్టినవి .... అయ్యా .... ఇట్లు .... సింగరాజు లింగరాజు వ్రాలు" .... 


ఈ రసీదులో సింగరాజు లింగరాజు గారి కోరికల చిట్టా కనపడుతుంది. 


ఇక♦️పెండ్లి సమయంలో వియ్యపురాలికి చేయవలసిన మర్యాదల గురించి కాళ్ళకూరి నారాయణ రావు గారి చమత్కారం చూద్దాం.


♦️"వియ్యపురాలు గారికి తెలివిరాగానే కళ్ళు తుడవాలి; కాళ్ళు మడవాలి; కోక సర్దాలి; కిందకు దింపాలి; పెరట్లోకి పంపాలి; నీళ్ళచెంబందివ్వాలి; రాగానే కాళ్ళు కడగాలి; పండ్లు తోమాలి; మొహం తొలవాలి; నీళ్ళు పోయాలి; వళ్ళు తుడవాలి; 

తల దువ్వాలి; కొత్తచీర కట్టాలి; కుర్చీ వెయ్యాలి; కూర్చోబెట్టాలి; పారాణి రాయాలి; గంధం పుయ్యాలి; అత్తర్లివ్వాలి; పన్నీరు చల్లాలి;మొహాన్ని మొహరీలద్దాలి! కళ్ళకు కాసులద్దాలి! వంటిని వరహాలద్దాలి; వెండి పలుపు వెనకను కట్టాలి; బంగారుపలుపు పక్కను చుట్టాలి; దిష్టి తియ్యాలి; హార తివ్వాలి; అధ్వాన్న మివ్వాలి; నా పిండాకూడివ్వాలి ....యిల్లాంటివింకా నా తలవెంట్రుక లన్ని వున్నాయి.ఆలస్యమైతే అలక కట్నం చెల్లించ వలసి వస్తుంది"


♦️మొగ పెళ్లి వారికి చేయ వలసిన మర్యాదల్లో లోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి ....


♦️"నిన్నటి వుప్మాలో నిమ్మపళ్లరసమే లేదట. ఇడ్డెన్లలో అల్లం ముక్కలు లేవట. కాఫీలో పంచదార లేదట. ఈ పూటయినా కాస్త యింపుగా వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళ మొహాన్ని పెట్టికొట్టాలని పదిమందీ ఆలోచిస్తూన్నారు. ఖారాఖిల్లీలు కాస్త యెక్కువగా పంపండి. చుట్టలూ, సిగరెట్లూ, బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి. నిన్న పంపిన చీట్లపేకలు నిన్ననే చిరిగిపోయాయి. ఈపూటింకో నాలు గెక్కువ పంపండి. మదరాసు నశ్యం మాట మరిచిపోకండి. శలవు. మఱి ఆలస్యమైతే మాటదక్కదు".


♦️పెళ్ళైన తరువాత పదహారు రోజుల పండుగ అంటే ఏమిటో చూద్దాం.

♦️"తొలినాడు హడావడి, మలినాడు ఆయాసం; మూడు మంగళాష్టకాలు; నాలుగు సిగపట్ల గోత్రాలు; అయిదు అప్పగింతలు; ఆరు అంపకాలు; ఏడు వంట బ్రాహ్మల తగువు; ఎనిమిది ఋణదాత నోటీసు; తొమ్మిది జవాబు; పది దావా; పదకొండు స్టేటుమెంటు; పన్నెండు విచారణ; పదమూడు డిక్రీ; పద్ధానుగు టమటమా; పదిహేను వేలం; పదహారు చిప్ప. ఈ రోజుల్లో యిదే పదహారు రోజుల పండుగ".


ఇలా సాగుతుంది నాటకం. చివరికి వరకట్నం ఇవ్వడం ఇష్టం లేక కాళింది చనిపోతుంది. ఇచ్చిన వరకట్నం తిరిగి ఇచ్చే అవకాశం ఉండదు గనుక పురుషోత్తమరావు గారు తన రెండవ కూతురు కమలని బసవరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు.


 అయితే పెళ్లి అయినప్పటికీ కమల కాపరానికి రాకుండా సింగరాజు లింగరాజు గారు ఇచ్చిన వరకట్న రసీదు ఆధారంగా తాను బసవరాజును కొనుక్కున్నానని కనుక బసవరాజు తమ ఇంటికి రావాలని కోర్టులో కేసు వేస్తుంది. బసవరాజు కూడా భార్య పక్షాన చేరి తండ్రి దుర్బుద్ధిని బయటపెడతాడు. చివరికి సింగరాజు లింగరాజు మారి వరకట్న వ్యతిరేక ఉద్యమంలో చేరిపోతాడు. 


నాటకాన్ని హాస్య ప్రధానంగా నడిపిస్తూ సమాజానికి ఒక సందేశం ఇచ్చి ప్రజల హృదయాలను దోచుకున్న ఈ నాటకం ఎప్పటికీ మర్చిపోలేనిది.  


సేకరణ మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279 


---

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం