అక్కడ ఏముంది?
ఏమో… మాటల్లో చెప్పలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది ఊరికి. మన ఊరు కదా! అందుకే పండగొస్తే చాలు — నగరం మొత్తం కదలిపోతుంది. రహదారిపై అష్టకష్టాలు పడుతూ, గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ అయినా ఆ ఊరు చేరాలనే తపన. రహదారిపై ఎన్ని లైన్లు ఉన్నా, ఏ లైన్ వైపు చూసినా సొంత ఊరికి వెళ్లే వాహనాలే. బస్సులు… కార్లు… బైకులు… రైళ్లు… ఎవరి స్తోమతకు తగినట్లు వాళ్లు. ట్రాఫిక్ జామ్ అవుతుందన్న భయం ఉన్నా, ఆ భయాన్ని మించిన ఉత్సాహం ప్రతి ముఖంలో మెరిసిపోతుంది. ఈ మూడు రోజుల పండక్కి సొంత ఊరి దారి పడతారు. అమ్మానాన్నలు… బాల్యస్నేహితులు… బంధువులు… వాళ్లందరిని కలుసుకుంటామన్న ఆనందం ప్రతి ఒక్కరి కళ్లల్లో కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. నగరంలో పనుల ఒత్తిడితో అలసిపోయిన, విసిగిపోయిన జనం ఏదో కాస్తంత మనసుకు ఊరట, విశ్రాంతి కోసం ఊరి వైపు పరుగులు పెడతారు. “ఎక్కడున్నా పండగే కదా” అంటే కాదు — పండగ సౌరభం పల్లెటూర్లోనే తెలుస్తుంది అంటారు. అసలు పండగ మూడు రోజులే. కానీ మాకు నెలరోజులు ముందు నుంచే ఆకాశంలోని చుక్కలు ప్రతిరోజూ వాకిట్లోకి వచ్చి వెలుగు తెస్తాయి. ఊరంతా మంచు దుప్పటి కప్పుకుని ఉండగా, ఈ నెల రోజులు కోడి కూతతో కాదు — నగర సంకీర్తనతో పల్లె మేలుకుంటుంద...