అక్కడ ఏముంది?



ఏమో… మాటల్లో చెప్పలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది ఊరికి.

మన ఊరు కదా!

అందుకే పండగొస్తే చాలు — నగరం మొత్తం కదలిపోతుంది.

రహదారిపై అష్టకష్టాలు పడుతూ, గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ అయినా ఆ ఊరు చేరాలనే తపన.

రహదారిపై ఎన్ని లైన్లు ఉన్నా, ఏ లైన్ వైపు చూసినా సొంత ఊరికి వెళ్లే వాహనాలే.

బస్సులు… కార్లు… బైకులు… రైళ్లు…

ఎవరి స్తోమతకు తగినట్లు వాళ్లు.

ట్రాఫిక్ జామ్ అవుతుందన్న భయం ఉన్నా,

ఆ భయాన్ని మించిన ఉత్సాహం ప్రతి ముఖంలో మెరిసిపోతుంది.

ఈ మూడు రోజుల పండక్కి సొంత ఊరి దారి పడతారు.

అమ్మానాన్నలు… బాల్యస్నేహితులు… బంధువులు…

వాళ్లందరిని కలుసుకుంటామన్న ఆనందం

ప్రతి ఒక్కరి కళ్లల్లో కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది.

నగరంలో పనుల ఒత్తిడితో అలసిపోయిన, విసిగిపోయిన జనం

ఏదో కాస్తంత మనసుకు ఊరట, విశ్రాంతి కోసం

ఊరి వైపు పరుగులు పెడతారు.

“ఎక్కడున్నా పండగే కదా” అంటే కాదు —

పండగ సౌరభం పల్లెటూర్లోనే తెలుస్తుంది అంటారు.

అసలు పండగ మూడు రోజులే.

కానీ మాకు నెలరోజులు ముందు నుంచే

ఆకాశంలోని చుక్కలు ప్రతిరోజూ వాకిట్లోకి వచ్చి వెలుగు తెస్తాయి.

ఊరంతా మంచు దుప్పటి కప్పుకుని ఉండగా,

ఈ నెల రోజులు కోడి కూతతో కాదు —

నగర సంకీర్తనతో పల్లె మేలుకుంటుంది.

దేవుడి మీద భక్తి కాదు, ఉండ్రాళ్ల మీద భక్తి అనే సామెతను నిజం చేసే జనం.

ఈ నెల రోజులు గుడిలో పెట్టే ప్రసాదాలకే

భక్తులుగా మారిపోయే తరుణం చూస్తే

నవ్వు రాక మానదు.

ఇవన్నీ మామూలే… ఊరిలో.

ఊరి మధ్యలో పెద్ద భోగిమంట.

ఆ భోగిమంట కోసం కావలసిన సామగ్రి కోసం

తొలిరోజే ‘రెక్కి’ నిర్వహించేవారు కొంతమంది.

వాళ్ల చేతికి ఆ సామాను చిక్కకుండా దాచుకోవడం ఒక వింత అనుభవం.

అయినా చేయి జారిపోయిన వస్తువు

సగం కాలుతూ కనబడితే

మనసు అల్లాడిపోయే అనుభవం

ఈ నగరంలో ఎక్కడ దొరుకుతుంది?

భోగిమంట అంటే ఎర్రటి మంటలు

ఆకాశంలోకి ఎగిరి పడుతున్నట్లు కనపడడం సహజమే.

కానీ —

“మీ భోగిమంట శబ్దం కూడా చేస్తోందేమిటి?”

అని దారిన పోయే దానయ్య ఆసక్తిగా అడిగితే…

ఏమిటా అని పరిశీలించి చూస్తే,

పాపం — పండగ పూట పరలోక యాత్రకు వెళ్లిన

ఒక విషసర్పం!

ఆ దృశ్యం

ప్రతి ఏటా మనసులో మెదులుతూనే ఉంటుంది.

ఆ ఊరిలో పుట్టి పెరిగినా,

కొత్తవాడిలా

“ఎప్పుడొచ్చావు? బాగున్నావా?”

అనే ఆత్మీయమైన పలకరింపులు

మనసుని పులకరింప చేస్తాయి.

అమ్మ చేతితో పెట్టిన పచ్చడి మెతుకులు అమృతంగా ఉంటాయి.

పచ్చడి మెతుకులు పెట్టి ఎందుకు ఊరుకుంటుంది అమ్మ?

అందుకే పండగకి వారం రోజుల ముందు నుంచే

అష్టకష్టాలు పడి అమ్మ వండిన పిండి వంటలు

నాలుకకి ప్రతి ఏట కొత్త రుచిని అందిస్తాయి.

ఆ పల్లె రుచుల కోసం

ఈ నగరం నుంచి రావడం ఎలా మానేస్తాము?

బీరువాలో దాచుకునేంత సొమ్ము

పంటల మీద వచ్చినా రాకపోయినా,

పండక్కి వచ్చే పిల్లలందరికీ బట్టలు కొనండి

అని అమ్మ చెప్పే మాటలకు తల ఊపుతూ

అతి కష్టం మీద అందరికీ తలో జత కుట్టించిన

అమ్మానాన్నల ప్రేమ, ఆత్మీయత, అభిమానం…

ఈరోజు నగరంలో ఉంటూ

ఇష్టమొచ్చిన బట్టలు

సమయం, సందర్భం లేకుండా

కొనుక్కుని కట్టుకున్నా

రాని ఆనందం అది.

హరిదాసు తలపై ఉండే అక్షయపాత్రలో

బియ్యం పోయడం — చిన్నప్పటి తీయటి అనుభవం.

పెరిగి పెద్దయిన తర్వాత

రాజ్‌దూత్‌పై రామనామ స్మరణ చేస్తూ

వీధిలో తిరిగే హరిదాసుని సత్కరించడం

మరీ వింతైన అనుభవం.

నడవలో బుడ్డి గాడికి పోసిన భోగిపళ్ళను

వాడే రుచి చూస్తూ ఉండే దృశ్యం

తలుచుకుంటే నవ్వాగదు.

భోగిపళ్ళ పేరంటాళ్లు,

కట్టుకున్న చీరలు, పెట్టుకున్న నగలు గురించి

చెప్పుకునే గొప్ప కబుర్లు

విని విని బోర్ కొట్టినా,

తప్పని తద్దినంలా తలవంచుకుని

కాలం గడపడం — ఒక మధుర స్మృతి.

వీధిలో ఏడాదికోసారి వచ్చే బసవన్న ఆట

ప్రతి ఏడాది చూస్తున్నా

కొత్తగానే అనిపిస్తుంది.

పిల్లలు పెద్దవాళ్లయినా, మనవలతో సహా అందరికీ

“తీర్థంలో ఏమైనా కొనుక్కోండి” అంటూ

జేబులో డబ్బులు పెట్టే

తల్లిదండ్రుల అభిమానం ఎలా వదులుకుంటాం?

ఆ తీర్థం

కొంతమందికి జీవనోపాధి,

మరికొంతమందికి సరదా తీర్చే ప్రదేశం;

కానీ నోరులేని మూగజీవులకు

ప్రాణాలతో చెలగాటం.

చుట్టూరా ఎటు చూసినా దుకాణాలు.

గాలికి ఎగిరే బెలూన్లు,

సరాగాలు పలికించలేని వేణువులు,

నోరూరించే తినుబండారాలు,

ఒకసారి ఊదితే ఖాకీ డ్రెస్ వాళ్లేమోనని

భయపెట్టే విజిల్స్, ఆటబొమ్మలు…

ఇవన్నీ నగరాల్లోని

బహుళ అంతస్తుల షాపింగ్ మాల్స్‌లో దొరకవచ్చు

కానీ

“మన ఊరి సరుకు, మన తీర్థంలో కొనుక్కున్నది”

అని జ్ఞాపకంగా ఉంచుకోవాలనే కోరికను

ఎలా చంపుకుంటాం?

రాత్రి అయితే చాలు —

ఎవరి ఇంటి ముందు వాళ్లే కూర్చుని

పాత కబుర్లు, కొత్త జ్ఞాపకాలు.

ఎప్పుడు ఎవరు ఏ ఊరికి వెళ్లారు,

ఎవరి పిల్లలు ఏ నగరంలో స్థిరపడ్డారు,

ఎవరు మళ్లీ ఊరికి తిరిగి వస్తారా అన్న ఆశలు —

ఆ మాటల మధ్యే

నిదానంగా నిద్రలోకి జారిపోతారు.

తెల్లారితే

గోదావరి ఒడ్డున చలి గాలి తాకుతూ,

మంచు ముసురుకున్న పొలాలు చూసుకుంటూ

మనసంతా నిండిపోతుంది.

నగరంలో చూసే సూర్యుడు ఒకేలా ఉన్నా,

ఇక్కడ ఉదయించే సూర్యుడికి మాత్రం

ఏదో ప్రత్యేకమైన ఆత్మీయత ఉంటుంది.

పండగ ముగిసే రోజు దగ్గర పడుతున్న కొద్దీ

మనసులో తెలియని భారమొస్తుంది.

“ఇంకా రెండు రోజులే”,

“రేపటితో అయిపోయింది”

అని మాటల్లో చెప్పినా,

హృదయం మాత్రం ముందే వీడ్కోలు చెప్పడం మొదలుపెడుతుంది.

నెల రోజుల నుంచి రంగవల్లులతో మెరిసిపోయిన పండగ

కనుమనాడు రథం ఎక్కి వెళ్లిపోతుంది.

మళ్లీ నగరానికి బయల్దేరే రోజు,

బట్టలు బ్యాగులో పెట్టుకుంటూనే

మనసును ఊరిలోనే వదిలేస్తాం.

అమ్మానాన్నలు చెప్పే చివరి హితవు,

అందరూ కలిసి చెప్పే

“జాగ్రత్తగా వెళ్లి ఫోన్ చేయి”

అనే మాటలు —

రహదారి పొడవునా మన వెంటనే వస్తుంటాయి.

బస్సు ఊరి మలుపు దాటగానే

వెనక్కి తిరిగి ఒకసారి చూడాలనిపిస్తుంది.

“ఏముంది అక్కడ?” అని ఎవరు అడిగినా

సమాధానం చెప్పలేము.

కానీ —

మనసులో ఏదో ఖాళీ నిండిపోయినట్టుంటుంది.

అదే ఊరు.

అదే పండగ.

అదే మన జీవితం.


అక్కడ ఏముంది అని అడిగితే

చెప్పడానికి మాటలు ఉండవు.

మనసు మాత్రం ప్రతి పండగకి

మళ్లీ మళ్లీ ఊరి దారే చూపిస్తుంది.


రచన

మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ

📞 94917 92279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం