ఉయ్యాల
ఉయ్యాల. రాత్రి 8.30  గంటలయింది. కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్  రాజమండ్రి రైల్వే స్టేషన్ లో వచ్చే ఆగింది. అంతవరకు ఎదుటి సీట్లో కూర్చున్న ఒక యువతి వడిలో నిద్రపోతున్న పసిబిడ్డ లేచి  ఏడవడం మొదలెట్టింది.  ఆకలవుతుందేమోనని అనుకుని ఆ యువతి అందుకు తగిన ప్రయత్నాలు చేసి ఇంకా పిల్ల గుక్క పట్టి ఏడవడం మొదలుపెడితే ఆ పక్కన కూర్చున్న పెద్దావిడ తల్లి అనుకుంటా ఉయ్యాల కోసం ఏడుస్తోందేమో అని  అంటూ  ఇప్పుడు ఎలాగే బాబు!  వీడికి ఉయ్యాల బాగా  అలవాటైపోయింది అంటూ భుజం మీద వేసుకుని జో కొట్టడం ప్రారంభించింది. ఆ పసిబిడ్డ రైలు కుదుపులకి అమ్మమ్మ ప్రయత్నాలకి ఏమి మోసపోలేదు. ఏడుపు ఆపలేదు. పాపం ఆ ఇద్దరు ఆడవాళ్లు దిక్కుతోచక ఆ పిల్లవాడిని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పై బెర్త్ మీద పడుకున్న  వ్యక్తి ఆ పెద్దావిడకి భర్తనుకుంటా లేచి తిట్టడం ప్రారంభించాడు. వాడికి ఉయ్యాల అలవాటు చేయొద్దు అంటే వినలేదు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నామో అన్నాడు .   దానికి ఆ ముసలాడికి కోపం వచ్చి మీకు నన్ను తిట్టడానికి  ఒక సాకు దొరికింది. పసిపిల్లలను ఉయ్యాల్లో కాకుండా మంచం మీద...