చిరుగు దుప్పటి
రాత్రి 9 గంటలు అయింది. నవంబర్ నెల చలి గజగజ వణికించేస్తోంది. ఆఖరి సవారిని దింపేసి రాజయ్య రిక్షా తొక్కుకుంటూ తన గుడిసె దగ్గర ఆపి, రిక్షా లోపలి నుంచి కవరు తీసి కప్పి గుడిసెలో అడుగుపెట్టాడు. గుడిసెలో గుడ్డి దీపం వెలుగులో చాప మీద పడుకున్న పిల్లలను కేసి ఒకసారి చూశాడు. పిల్లలు కప్పుకున్న దుప్పటి మీదున్న చిరుగులోంచి పిల్లల మొహం కనబడుతోంది. అది దుప్పటి కాదు; చిరుగుల దుప్పటి ముక్క అంటే బాగుంటుందేమో! ఆ దుప్పటి కప్పుకున్న వాళ్ల వయసు ఎంతుంటుందో అన్ని చిరుగులే ఉన్నాయి పాపం. కాళ్లదాకా కప్పుకుంటే మొహానికి సరిపోదు; మొహం దాకా కప్పుకుంటే కాళ్లకు సరిపోదు. అలా ఉంది దుప్పటి పరిస్థితి. మరి శీతాకాలం, వర్షాకాలంలో ఆ కుటుంబానికి అవే దిక్కు. అసలే గుడిసె. గుడిసె సందు తలుపుల నుంచి చలిపులి పంజా విసురుతుంటే అడ్డుకునేది పాపం ఆ చిరుగుల దుప్పట్లే. ఆ ఇంట్లో ఉన్న రెండు దుప్పట్లు పరిస్థితి కూడా అదే. చలేస్తోందని అర్ధరాత్రి పిల్లలు లేచి ఏడుస్తుంటే సమాధానం ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యేవాడు రాజయ్య. వానాకాలం వచ్చే ముందు ప్రతి ఏటా దుప్పట్లు కొనమని చెప్పే భార్య మాటలకు తల ఊపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి రాజయ్యది. రిక్షా బండి ఎంత లా...