చిరుగు దుప్పటి



రాత్రి 9 గంటలు అయింది.


నవంబర్ నెల చలి గజగజ వణికించేస్తోంది. ఆఖరి సవారిని దింపేసి రాజయ్య రిక్షా తొక్కుకుంటూ తన గుడిసె దగ్గర ఆపి, రిక్షా లోపలి నుంచి కవరు తీసి కప్పి గుడిసెలో అడుగుపెట్టాడు.


గుడిసెలో గుడ్డి దీపం వెలుగులో చాప మీద పడుకున్న పిల్లలను కేసి ఒకసారి చూశాడు. పిల్లలు కప్పుకున్న దుప్పటి మీదున్న చిరుగులోంచి పిల్లల మొహం కనబడుతోంది. అది దుప్పటి కాదు; చిరుగుల దుప్పటి ముక్క అంటే బాగుంటుందేమో! ఆ దుప్పటి కప్పుకున్న వాళ్ల వయసు ఎంతుంటుందో అన్ని చిరుగులే ఉన్నాయి పాపం. కాళ్లదాకా కప్పుకుంటే మొహానికి సరిపోదు; మొహం దాకా కప్పుకుంటే కాళ్లకు సరిపోదు. అలా ఉంది దుప్పటి పరిస్థితి.


మరి శీతాకాలం, వర్షాకాలంలో ఆ కుటుంబానికి అవే దిక్కు. అసలే గుడిసె. గుడిసె సందు తలుపుల నుంచి చలిపులి పంజా విసురుతుంటే అడ్డుకునేది పాపం ఆ చిరుగుల దుప్పట్లే. ఆ ఇంట్లో ఉన్న రెండు దుప్పట్లు పరిస్థితి కూడా అదే. చలేస్తోందని అర్ధరాత్రి పిల్లలు లేచి ఏడుస్తుంటే సమాధానం ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యేవాడు రాజయ్య. వానాకాలం వచ్చే ముందు ప్రతి ఏటా దుప్పట్లు కొనమని చెప్పే భార్య మాటలకు తల ఊపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి రాజయ్యది.


రిక్షా బండి ఎంత లాగినా, ప్రతి రోజు ఎన్ని త్యాగాలు చేసినా, నలుగురి కడుపులు నింపడం గగనం అయిపోయేది రాజయ్యకి. ఈ సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి. ఈ దుప్పట్లు కూడా రాజయ్య కొన్నవి కాదు. రెండు సంవత్సరాల క్రితం ఎవరో చనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థం గుడిలో పంచి పెట్టినవి. మళ్లీ అటువంటి అవకాశం రాలేదు.


బ్రతుకు బండిలోని సమస్యలను అన్నిటినీ పక్కనపెట్టినా ఈ సమస్య పాపం రాజయ్యని బాగా బాధిస్తోంది. పిల్లల బాధ చూడలేకపోతున్నాడు. భార్య కళ్లల్లో కూడా అశాంతి. భర్త పరిస్థితి తెలిసి చెప్పకుండా మౌనంగా తనలోనే బాధ దాచుకున్నప్పటికీ, ఆమె బాధ అర్థం చేసుకోలేని వాడు కాదు రాజయ్య. ఇలా ఆలోచనతో రాజయ్యకి నిద్ర పట్టలేదు ఆ రాత్రి.


తెల్లవారుజామునే పక్క వీధిలో ఉన్న సావిత్రమ్మగారిని బస్టాండ్లో దింపాలన్న మాట గుర్తుకొచ్చి లేచి కాలకృత్యాలు తీర్చుకొని రిక్షా తీసుకుని బయలుదేరాడు. సావిత్రమ్మ మనుమలను రోజు కాన్వెంట్‌కి తీసుకెళ్తుంటాడు రాజయ్య. తన ఇంటి ముందు ఆటో స్టాండ్ ఉన్నప్పటికీ ఆటో ఎప్పుడూ ఎక్కదు సావిత్రమ్మ. ఒంటరిగా ఎక్కడికెళ్లినా ఎంత దూరమైనా రాజయ్య రిక్షా మీదే వెళుతుంది. అంత నమ్మకం రాజయ్య మీద సావిత్రమ్మకు. రాజయ్యని స్వంత తమ్ముడిలా చూస్తుంది.


అందుకే అర్ధరాత్రి పిలిచినా అపరాత్రి పిలిచినా పరుగు పరుగున వెళ్తుంటాడు రాజయ్య. అలా ఆలోచించుకుంటూ సందు చివరన ఉన్న టీ కొట్టు దగ్గర ఆగి టీ లాగించి, సావిత్రమ్మ ఇంటికి వెళ్లి అమ్మగారిని ఎక్కించుకుని బస్టాండ్‌కు బయలుదేరాడు.


బస్టాండ్‌కి వెళ్లకుండా దారిలోనే కనబడ్డ తణుకు బస్సు ఆపి ఎక్కుతూ, రాజయ్య చేతిలో ₹100 నోటు పెట్టి “సాయంకాలం చిల్లర తీసుకుంటాను” అని చెప్పి గబగబా బస్సు ఎక్కేసింది సావిత్రమ్మ.


ఆ వంద రూపాయలను సీటు కిందనున్న పెట్లో పెట్టదామని సీటు ఎత్తబోతుంటే, సీట్లో ఎర్రగా ఉన్న హ్యాండ్‌బ్యాగ్ కనబడింది రాజయ్యకి. “అయ్యో! ఈ హ్యాండ్‌బ్యాగ్ అమ్మగారిది… మర్చిపోయారు కాబోలు” అనుకుంటూ ఒకసారి బస్సు వెళ్లిన వైపు చూశాడు. కనుచూపుమేరలో బస్సు ఎక్కడ కనిపించలేదు.


“విలువైన వస్తువులు ఏమైనా ఉంటే ఇప్పుడే ఈ బ్యాగ్ సావిత్రమ్మ ఇంటి దగ్గర ఇచ్చేయొచ్చు, లేదంటే సాయంకాలం తిరిగి వెళ్తాను కదా” అనుకుంటూ బ్యాగ్ జిప్ ఓపెన్ చేశాడు రాజయ్య. అందులో 500 రూపాయల నోట్ల కట్ట, కొంత చిల్లర కనబడింది.


బ్యాగ్ జాగ్రత్తగా బండిలో పెట్టి తన పనిలో పడిపోయాడు రాజయ్య. రిక్షా తొక్కుతుంటే చల్లగాలికి వణుకు పుట్టింది. “8 గంటలైనా ఇంకా చలి తగ్గలేదు” అనుకుంటూ ప్రతిరోజు చలికి వణుకుతున్న ఇంటిదగ్గర పిల్లలు, భార్య గుర్తుకొచ్చారు.


రిక్షాలో ఉన్న నోట్ల కట్టలోని ఒక నోటుతో తన సమస్య తీరిపోతుంది. “పోనీ ఒక నోటు తీసుకుంటే అమ్మగారికి ఏం తెలుస్తుంది? బ్యాగ్ తెచ్చిన ఆనందంలో డబ్బు లెక్కపెట్టుకోరు” అనుకున్నాడు రాజయ్య. కానీ “ఒక్క నోటు తీసినా, వంద నోట్లు తీసినా… ఆ పేరు జీవితాంతం ఉంటుంది. అలాంటి పని చేయకూడదు” అని మరో ఆలోచన దెబ్బకొట్టింది.


రెండు సంవత్సరాల క్రితం రిక్షాలో ఎవరో వదిలేసిన నగల బ్యాగ్ ముట్టుకోకుండా భద్రంగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినప్పుడు, నిజాయితీపరుడిగా పేపర్లోకి ఎక్కిన ఫోటో గుర్తుకొచ్చింది. అప్పుడు అందరూ ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు అమ్మగారి దృష్టిలో దొంగగా మిగిలిపోతా. ఇన్నాళ్లు సంపాదించుకున్న మంచితనం మొత్తం మూడు సెకండ్లలో మాయమైపోతుంది. ఆ ఆలోచనలతో చీకటి పడ్డింది.


ఇంటికి తిరిగి వస్తూ దారిలో సావిత్రమ్మ ఇంటి ముందు ఆగి, లోపలికి వెళ్లి బ్యాగ్‌ని, పొద్దున్నే ఇచ్చిన ₹100లో మిగిలిన చిల్లరతో కలిపి అందించాడు. “అమ్మ, ఒకసారి లెక్క చూసుకోండి” అన్నాడు. బ్యాగ్ చూడగానే సావిత్రమ్మ మొహం వెలిగిపోయింది. “పర్వాలేదు, పొద్దున్న బస్సు ఎక్కే హడావుడిలో మర్చిపోయాను” అంటూ నోట్లు లెక్కించి సంతృప్తిగా తలాడించింది.


బ్యాగులోంచి వంద రూపాయల నోటు తీసి రాజయ్యకి ఇవ్వబోతుంటే, “అమ్మ, నాకు డబ్బులు వద్దు… రెండు పాత దుప్పట్లు ఇప్పించండి” అన్నాడు రాజయ్య.


“అదేంటి? ఎవరైనా కట్టుకునే బట్టలు అడుగుతారు… నువ్వేమిటి ప్రత్యేకంగా దుప్పట్లు అడుగుతున్నావ్?” అని ఆశ్చర్యపోయింది సావిత్రమ్మ. రాజయ్య కళ్ల నీళ్లు పెట్టుకుని తన ఇంటి దగ్గర పరిస్థితి అన్నీ వివరించాడు.


రాజయ్య పరిస్థితి వింటే సావిత్రమ్మ కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. “గుప్పెడు మెతుకులు కావాలంటే ఎవరైనా పెడతారు. కానీ ఇలాంటి ప్రత్యేకమైన అవసరాలు తీర్చేవారు చాలా అరుదు… అది కూడా ఈ చలికాలంలో!” అనుకుంది. “సరే, రేపు ఉదయం రా” అని చెప్పి రాజయ్యని పంపేసి ఆలోచనలో పడింది సావిత్రమ్మ.


ప్రతి ఏటా కార్తీకమాసంలో తన భర్త పేరుతో చేసే అన్నదానానికి బదులు, దుప్పట్లు పంచిపెట్టింది ఆ మర్నాడు గుడిలో. రాజయ్యలాంటివారి చలిపులి సమస్యకు కొంత పరిష్కారం చెప్పింది సావిత్రమ్మ. అన్నదానం ఒకరోజు కడుపు నింపుతుంది. కానీ చలికాలంలో ఇచ్చిన దుప్పట్లు చిరిగిపోయే వరకు—ఆ ఇచ్చినవారి పేరు గుర్తుండిపోతూనే ఉంటుంది.


---


ఆ రోజు రాత్రి సావిత్రమ్మ ఇచ్చిన ఆ రెండు దుప్పట్లు చేతబట్టుకుని రాజయ్య గుడిసెలో అడుగుపెట్టాడు. గుడ్డి దీపం వెలుగులో పిల్లలు లేచి కూర్చున్నారు. చలితో వణికిస్తూ ఉన్న పిల్లలకు రాజయ్య ఆ దుప్పట్లు కప్పి వేయగా…


వారి కళ్లల్లో మెరిసిన ఆనందం—ఏ ధనంతోనూ కొలవలేనిది.


“నాన్నా… కొత్త దుప్పటా?” అని చిన్నవాడు అడిగాడు.


అవునని తల ఊపుతూనే పిల్లల నుదిటిపై చెయ్యేసాడు. గుడిసెలో మొదటిసారి ఆ చలికాలంలో ఓ సాంత్వన కనబడింది. పిల్లల చిరునవ్వు చూసి రాజయ్య హృదయం నిండిపోయింది.


సావిత్రమ్మ మనసు ఎంత పెద్దదో అర్థమైంది. తన నిజాయితీకి వచ్చిన ఫలితం ఇదేనేమో అనిపించింది. ఏ నోట్ల కట్ట తీసుకుని ఇంటికి తెచ్చినా వచ్చే ఆనందం కాదు ఇది. మనిషి మంచితనం కాపాడుకుంటే—అది తిరిగి మనకే దారి కనుపరుస్తుంది అని రాజయ్య మరొకసారి నమ్మాడు.


ఆ సాయంత్రం రిక్షా తొక్కుకుంటూ వెళ్లేటప్పుడు రాజయ్య గుండెల్లో ఒక వెలితి తగ్గి—ఓ నిండుదనం పెరిగింది. పేదరికం వెంటాడుతూనే ఉన్నా, మంచితనం మాత్రం తనను విడిచిపెట్టదని కొత్తగా గ్రహించాడు.


ఆ రెండు దుప్పట్లు విలువ రూపాయల్లో తక్కువ ఉండొచ్చు… కానీ వాటి వెచ్చదనం మాత్రం రాజయ్య హృదయంలో జీవితాంతం నిలిచిపోయింది.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం