మా నాన్న
నాన్నంటే కుటుంబానికి అభయహస్తం. నాన్నంటే ఒక నిస్వార్థo. నాన్నంటే ఒక మార్గదర్శి. నాన్న – ఈ మాటలోనే ఓ ఆత్మీయత, ఓ అర్థవంతమైన అనుబంధం దాగి ఉంటుంది.పిలిచినప్పుడు హృదయం హర్షిస్తే, గుర్తొచ్చినప్పుడు కన్నీళ్లు వర్షిస్తాయి జీవితాన్ని నిర్మించే పునాది, ఆరంభ మౌనపు ప్రేమకు నిదర్శనం – నాన్న. నాన్న… ఈ ఒక్క పదమే ఎన్నో అర్థాలు, అనుబంధాలు, బాధ్యతలు, త్యాగాలను తనలో లీనమయ్యే అద్భుత భావన. పిల్లల కోసమో, కుటుంబం కోసమో, తన అవసరాలు పక్కకు నెట్టి, జీవితాన్ని నిశ్శబ్దంగా నిర్మించే ఒక మనిషి – ఆయనే నాన్న. నా బాల్యం గుర్తొస్తే – అమ్మ చూపించిన ప్రేమ, నాన్నది మౌనంగా మార్గం చూపించే బుద్ధి. అమ్మ చేతిలో ఆహారం, నాన్న చేతిలో ఆశయం. అమ్మ ఓ తపన, నాన్న ఓ త్యాగం. నాన్నతో మాటలూ తక్కువే, కానీ అనుబంధం ఎంతో లోతుగా. మన పరోక్షంలో బిడ్డ గొప్పతనాన్ని పదిమందికి గర్వంగా చెప్పి బిడ్డ ఎదుట మాత్రం ఆ మాటే ఎత్తడు. ఆ ప్రశంసలు మన చెవుల్లో కాదు, మన వెనుక నిలబడి మన విజయాన్ని నిశ్శబ్దంగా చూసే చూపుల్లో ఉన్నాయి. నాన్న హాయిగా ఉండే వయసులో శ్రమించాడు, మనకోసం కొత్త చెప్పులు కొనిపెట్టాలన్నదే గమ్యం, ఆయన పాదాలు పగిలినా...