నాన్నని దాచుకున్న బీరువా

 నాన్నని దాచుకున్న బీరువా


ఒకటో తారీకు జీతం అందుకుని ఆ బీరువాలో పెడుతుంటే ప్రతి నెల నాన్న గుర్తుకు వస్తాడు. ఆ బీరువా అంటే నాన్నకు అంత ఇష్టం. ఆరడుగుల పొడవు ఉండి, గచ్చకాయ రంగులో స్టీల్ హ్యాండిల్‌తో, పైన ఏడుకొండల వాడి స్టిక్కర్ అతికించి నాన్న గదిలో నిలబడి ఉండే బీరువా—నాన్న ఉన్నంతకాలం మెరిసిపోతూ ఉండేది.

బీరువాలోపల ఏమున్నా లేకపోయినా, ఎప్పుడూ తాళాలు వేసుకుని మొలతాడుకు కట్టుకుని తిరిగేవాడు నాన్న. నాన్నకి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అంటే—వాళ్ల తాతయ్య ఇనపపెట్టికి తాళాలు అలాగే మొలతాడు కట్టుకుని తిరిగేవాడట. నాన్న చేత ఇనపపెట్టి తాళాలు తీయించి డబ్బులు లెక్క చూసుకుని మురిసిపోయేవాడట నాన్న వాళ్ల తాతయ్య.

నాన్న వాళ్ల తాతయ్య ఒక పెద్ద భూస్వామి. కాలం కొట్టిన దెబ్బలకి ఎకరాలు కరిగిపోయి, ఇనపపెట్టి పాత సామాన్లు వాడి తూకానికి వెళ్లిపోయి, నాన్నకి జ్ఞానం వచ్చేటప్పటికి రెండు ఎకరాల భూమి మిగిలింది. అంతవరకు పాలేరులతో వ్యవసాయం చేయించే కుటుంబం, పొలానికి వెళ్లి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


చిన్నప్పుడు ఇస్త్రీ బట్టలు తొడుక్కుని సరదాగా పొలానికి వెళ్లే నాన్న, ముతక పంచ కట్టుకుని గట్టు దిగి పొలం పనులు చేయవలసిన పరిస్థితి వచ్చింది. అయినా నాన్నకి పాత వాసనలు ఇంకా వదలలేదు. అంటే, ఇనపపెట్టి కాకపోయినా కనీసం ఇనప బీరువాలో అయినా బట్టలు పెట్టుకుని డబ్బులు దాచుకోవాలని కోరిక అలాగే ఉండిపోయింది.


“ఏముంది బీరువాలో దాచుకోవడానికి? ఉన్న రెండు ముతక పంచలు దండెం మీద వేసుకుంటే సరిపోతుంది కదా! దానికోసం ఇనప బీరువా ఎందుకు?” అనేది అమ్మ.

“సంక్రాంతికి వచ్చిన పంట సొమ్ము పండగ వెళ్లేసరికి కనపడదు కదా. బీరువాలో ఏం దాచుకుంటాం?” అని అమ్మ మాటలకి ఏమో, “ఏం చెప్పం. బీరువాలో దాచుకునేంత సొమ్ము వస్తుందేమో… బీరువా వచ్చిన వేళ మంచిదయ్యి,” అని అనేవాడు నాన్న—పాపం.

సంక్రాంతికి వచ్చిన ఆ కొద్ది సొమ్ము బీరువాలో పెట్టి, ఇవ్వవలసిన వాళ్లకి మాటిమాటికి బీరువా తాళాలు తీసి ఇచ్చి ఆనందపడిపోయేవాడు. ఇనపపెట్టిలోంచి సొమ్ము తీసి ఇచ్చినట్లుగా అనుకునేవాడు. రోజు బీరువా తలుపు తీసి, లోపల ఉన్న లాకరు మీదున్న లక్ష్మీదేవి బొమ్మకి హారతి ఇచ్చేవాడు.

పోనీ బీరువాలో విలువైనవి ఏమున్నాయి అంటే—ఏమీ లేవు. ఉన్న రెండు ఎకరాల పొలం దస్తావేజు కూడా ఊర్లో ఉన్న కోపరేటివ్ సొసైటీ బీరువాలోనే ఉంది. పైగా అది ఎన్నో త్యాగాలు చేసి కొన్న బీరువా. ఏమిటో విచిత్రం—భోజనం అయిన తర్వాత రోజు వేసుకునే వక్కపొడి డబ్బా కూడా అందులో దాచుకునేవాడు. అందులో ఎందుకు అంటే, తాళాలు తీసి బీరువా తీయడం ఆయనకి సరదా.

ఎప్పుడూ ఇస్త్రీ పంచలు అందులో దాచుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాన్న ఎప్పుడూ ఇస్త్రీ చేయించుకునే వాడు కాదు. స్వయంగా తన బట్టలు తానే ఉతుక్కునేవాడు. భూస్వామి నుంచి రైతుగా మారిపోయిన తర్వాత పద్ధతులన్నీ మారిపోయాయి—ఈ పాపం.

ఈ ఒక్క బీరువా సరదా తప్ప. నేను, నా తమ్ముడు గదిలో బీరువా వెనకాల దొంగ–పోలీస్ ఆటాడుకున్నప్పుడు నాన్న ప్రాణం విలవిల లాడిపోయేది. కానీ తను మాత్రం అప్పుల వాళ్లు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కనపడకుండా బీరువా వెనకాల దాక్కునేవాడు.


నాకు తెలిసి ఉన్నంతవరకు మా నాన్నకి బీరువా వలన ఉపయోగం అదే. నాన్న బీరువా వెనకాల దాక్కున్నప్పుడల్లా నేను, మా తమ్ముడు నవ్వుతూ ఉండేవాళ్లం. నాన్న దొంగ–పోలీస్ ఆట ఆడుకుంటున్నాడని మా ఉద్దేశం. కానీ జీవితం ఆయనతో ఆటలాడుకుంటూ ఉందని మాకు తెలియదు.

ఇలాంటివి ప్రతిరోజూ ఎన్నో సందర్భాలు. ఇలాంటి సందర్భాలు, అవమానాలు ఎన్నో తట్టుకుని మమ్మల్ని చదివించి, మా కాళ్ల మీద నిలబడేలా చేసి, మాకు తోడు తీసుకొచ్చి, చిన్న చిన్న కోరికలు తీరకుండానే ఈ లోకంలో నుంచి నాన్న వెళ్లిపోయాడు. కొద్దిరోజులకి నాన్న బాటలోనే అమ్మ నడిచింది.


జీవితంలో కొన్ని కోరికలు తాము తీర్చుకోలేనప్పుడు, జీవితం అలాంటి అవకాశం ఇవ్వలేనప్పుడు, తల్లిదండ్రుల కోరికలు తీర్చే బాధ్యత పిల్లలే. అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు నాన్న.

మొదటిసారి నాకు జీతం వచ్చిన రోజు ఇంకా గుర్తుంది. చేతిలో జీతం కవరుతో ఇంట్లోకి అడుగుపెట్టగానే ఏదో అపరిచితమైన వణుకు. ఆ వణుకులో ఆనందమో, భయమో తెలియదు. నేరుగా బీరువా దగ్గరకు వెళ్లాను. నాన్న చేతులు తాళాల దగ్గరికి వెళ్లినట్టు, నా చేతులు కూడా తాళాల వైపే వెళ్లాయి.

తాళం తీస్తూ ఉంటే నాన్న నవ్వు కళ్లముందు నిలిచింది.


“ఇదిగో… ఇప్పుడు మన బీరువాలో దాచుకునేంత సొమ్ము వచ్చింది,” అని ఎక్కడో నాన్న స్వరం వినిపించినట్టు అనిపించింది.


బీరువా తెరిచాను. లోపల ఖాళీనే. లాకరు మీద లక్ష్మీదేవి బొమ్మ ఇంకా అలాగే ఉంది. ఒక్క క్షణం ఆగి జీతం కవరు అక్కడ పెట్టాను. తలుపు మూసి తాళం వేసి, తాళాన్ని చేతిలో పట్టుకుని నిలబడ్డాను. నాన్నలాగే మొలతాడు కట్టుకోవాలేమో అనిపించింది. నవ్వొచ్చింది.


ఎప్పుడూ ఒకటి రెండు ముతక పంచలతో ఉండే బీరువా అరలన్నీ ఇప్పుడు పట్టుచీరలతో, ఖరీదైన చీరలతో నిండిపోయి ఉన్నాయి. లాకరు మీద ఉన్న లక్ష్మీదేవి బొమ్మ తన పరివారంతో లాకర్‌లోకి దూరిపోయింది.


నాన్న బీరువా మీద పెట్టుకున్న ఆశలు, భయాలు, గర్వం—అన్నీ ఒకే చోట దాచినట్టు అనిపించింది. ఆ బీరువా నాన్నకు కేవలం ఇనపపెట్టి కాదు. అది ఆయన కలల సాక్ష్యం. భూస్వామి గర్వం నుంచి రైతు గౌరవానికి మారిన జీవితానికి ఒక గుర్తు. అప్పుల నుంచి తప్పించుకోవడానికి దాక్కున్న ఆశ్రయం. కొద్ది సొమ్ముని పెద్దగా అనిపించేలా చేసిన మాయ.


ఇప్పుడు ఆ బీరువా ముందు నేను నిలబడినప్పుడు అర్థమవుతుంది—నాన్న డబ్బును కాదు, భద్రతను దాచుకున్నాడు. మన భవిష్యత్తును తాళం వేసి కాపాడాడు. ఆయనకు తెలియకుండానే, తన అవమానాలతో మాకు గౌరవాన్ని కొనిచ్చాడు.

అందుకే…

ప్రతి నెల ఒకటో తారీకు జీతం అందుకుని ఆ బీరువాలో పెట్టే ప్రతిసారి,

డబ్బు పెట్టినట్టు కాదు—

నాన్న నమ్మకాన్ని, నాన్న జీవితాన్ని,

ఆ ఇనప బీరువాలో మళ్లీ మళ్లీ భద్రపరుస్తున్నట్టు అనిపిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం